ఉద్యోగులను సంతోషంగా ఉంచడానికి.. ప్రత్యేకమైన 'హ్యాపీనెస్‌ టీమ్‌'ల ఏర్పాటు.. | Special 'Happiness Teams' Have Been Set Up To Keep The Employees Happy | Sakshi
Sakshi News home page

ఇదీ ట్రెండ్‌! ఆఫీస్‌... ఆల్‌ హ్యాపీస్‌!

Published Thu, Aug 22 2024 8:34 AM | Last Updated on Thu, Aug 22 2024 11:01 AM

Special 'Happiness Teams' Have Been Set Up To Keep The Employees Happy

ప్రతి ఒక్కరం ఆనందకరమైన జీవనం కోసం తాపత్రయపడుతుంటాం. అందుకు, పగలు–రాత్రి తేడా లేకుండా శ్రమిస్తుంటాం. దానికి తగ్గట్టు ‘మనలో ఒత్తిడి కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు. ఒత్తిడి ప్రభావం పనిపై పడకుండా ఉద్యోగులను సంతోషంగా ఉంచడానికి హ్యాపీనెస్‌ టీమ్‌ను ప్రత్యేకంగా నియమించుకుంటున్నాయి కార్పొరేట్‌ కంపెనీలు. దానిలో డెలాయిట్‌ ఒకటి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఐదు గుణగణాలు అలవరచుకుంటే సంతోషకరమైన జీవితం సాధ్యమని వివరిస్తున్నారు. 

హార్వర్డ్‌ యూనివర్శిటీ 70 ఏళ్లుగా తమ విద్యార్థుల జీవితాలను ట్రాక్‌ చేస్తూ ‘ఎవరు ఎంత ఆనందంగా ఉన్నారు’ అనే విషయం మీద ఇప్పటికీ రీసెర్చ్‌ చేస్తోంది. ఎవరి జీవితాలు సంతోషంగా ఉన్నాయని ఆ పరిశోధక బృందం పరిశీలిస్తే ఎవరయితే ఎక్కువ హ్యూమన్‌ నెట్‌వర్కింగ్‌ చేయగలుగుతున్నారో వారు ఆనందాన్ని సంపూర్ణంగా పొందుతున్నారని అర్థం చేసుకున్నారు. డబ్బు, హోదా అందం, తెలివితేటలు.. ఇవేవీ ఆనందానికి కొలమానం కావని తెలుసుకున్నారు.

ఆనందాన్ని మర్చిపోతున్నామా?!
ఏ వ్యక్తులు అయితే తమని తాము ప్రశాంతంగా ఉంచుకొని, తమ జీవిత లక్ష్యాలను తెలుసుకుంటూ ప్రయాణిస్తున్నారో ఈ కింద ఉదాహరించిన 5 గుణగణాలను కలిగి ఉంటారు. కార్పోరేట్‌ లేదా మరే రంగంలో పనిచేసేవారికైనా ఈ ఐదు గుణగణాలను అలవర్చుకుంటే చాలు. వాటిలో...

  • శారీరకపరమైన ఆరోగ్యకరమైన అలవాట్లు: శరీరానికి కావల్సినవాటిని అందించడంలో లోపం ఏర్పడినా స్ట్రెస్‌ పెరుగుతుంది. ఫలితంగా పనితీరులో సంతృప్తి స్థాయి 20 శాతానికి పడిపోతుంది.

  • తెలివితేటలు (ఇంటెలెక్చువల్‌): ఒక అంశాన్ని ఎంత బాగా విశ్లేషిస్తున్నాం, ఎంత క్రియేటివ్‌గా వర్క్‌ చేస్తున్నాం .. అనేది మన బ్రెయిన్‌పైన ఆధారపడి ఉంటుంది. అస్తమానం మొబైల్‌లోని స్టఫ్‌ని చూస్తూ అదే ఆనందం అనుకుంటే మరో 20 శాతం పనితీరు పడిపోతుంది.

  • భావోద్వేగాల అదుపు: ఎదుటివారిని మన నియంత్రణలోకి తెచ్చుకోవాలి అనే ధ్యాస చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా తమ భావోద్వేగ పరిస్థితి పట్ల అవగాహన లేక అదుపే ఆనందాన్నిస్తుంది అనుకుంటారు. భావోద్వేగాల సమతుల్యతను ΄ాటిస్తూ వెళ్లే వారు తమ పనితీరు సామర్థ్యాన్ని 20 శాతం పెంచుకుంటారు.

  • ఆధ్యాత్మికత: ప్రతి ఒక్కరూ ‘నా ఈ జీవితానికి అర్థం ఏంటి?’ అనుకుంటూ శోధించేవారు హాయిగా తమ జీవన గమనాన్ని సాగించగలుగుతారు. అందుకు దైవాన్ని ఆలంబనగా చేసుకుంటూ తమ కలలకు తగిన పనులు చేస్తూ మరో 20 శాతం సంతృప్తిని పెంచుకుంటారు.

  • ప్రతికూలత: తెల్లవారి లేస్తే ఎన్నో అనుకోని సమస్యలు ఉంటాయి. భావోద్వేగాల పరంగా కింద పడిపోతాం. కానీ, మట్టి ముద్దలాగా అలాగే ఉండకుండా తిరిగి ఎలా లేచి నిలబడతామనేది సవాల్‌గా తీసుకోవాలి. దీని వల్ల మరొక 20 శాతం ఆనందంగా ఉంటాం. ‘ఇలా ఒక్కో గుణం నుంచి 20 శాతం ఆనందాన్ని పెంచుకుంటూ ప్రయాణించేవాళ్లు నూటికి నూరు శాతం సంతృప్తికరమైన జీవనం గడుపుతారు’ అని క్లినికల్‌ సైకాలజిస్ట్‌ రాధికా ఆచార్య తెలియజేస్తున్నారు. 
    అంచనాలు భారీగా ఉంటాయి.

  • ‘డబ్బుతో కొనలేని ఆనందంలో ఉత్పాదకత, సంతృప్తి, శ్రేయస్సు ఉంటాయి. ఒకసారి ఈ పోస్ట్‌కు కమిట్‌ అయ్యామంటే అంచనాలు కూడా భారీగా ఉంటాయి’ అంటారు చీఫ్‌ హ్యాపీనెస్‌ ఆఫీసర్‌ సరస్వతి కస్తూరి రంగన్‌. డెలాయిట్‌ కంపెనీలో ఇటీవల మొదటిసారి కొత్త హోదాలో పది మంది సభ్యులతో ఉన్న బృందానికి నాయకత్వం వహిస్తున్నారు ఈ చీఫ్‌ హ్యాపీనెస్‌ ఆఫీసర్‌. – నిర్మలారెడ్డి

హ్యాపీనెస్‌ సన్‌ ఫ్లవర్‌..
మేం ఉద్యోగుల ఆనందంపై దృష్టి పెడుతున్నామనే విషయం సంస్థలో ప్రతి ఒక్కరికీ తెలియపరిచాం. సంస్థలో టాలెంట్‌ ఫంక్షన్లు జరుపుతాం. జిమ్, యోగా వంటి క్లాసులు ఉంటాయి. ఎవరైనా వారి సమస్య గురించి చెప్పినప్పుడు ముందు వాటిని అర్థం చేసుకుంటాం. ‘హ్యాపీనెస్‌ సన్‌ఫ్లవర్‌’ ద్వారా సరైన పరిష్కారం లభించేలా ప్రయత్నిస్తాం. మేం రూపొందించిన ‘΄÷ద్దు తిరుగుడు పువ్వు’కు ఆరు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఆరు పూలరేకల్లో ప్రతి రేకా ప్రత్యేక పనితీరుతో ఉంటుంది. ప్రయోజనం, అనుసంధానం, విశ్రాంతి, వైవిధ్యం– సమానత్వం, మానసిక, శారీరక ఆరోగ్యం వంటి ఆరు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అంతేకాదు అనుకూలత, ఫెయిర్‌నెస్, ధైర్యం, చురుకుదనం వంటి సూత్రాలతో సన్‌ఫ్లవర్‌ వికసిస్తుంది. అభిరుచితో జీవించడానికి, ఒక శక్తివంతమైన, ఆరోగ్యకరమైన కార్యాలయాన్ని సృష్టించడం మా హ్యాపీనెస్‌ టీమ్‌ లక్ష్యం. – సరస్వతి కస్తూరి రంగన్, డెలాయిట్‌ చీఫ్‌ హ్యాపీనెస్‌ ఆఫీసర్‌

వాస్తవంలోనే ఆనందం..
మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మన మాట, ప్రవర్తన ΄ాజిటివ్‌గానూ, వాస్తవికంగానూ ఉండాలి. వర్చువల్‌ అనేది తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. ప్రకృతి నుంచి లభించేవీ, మనం చేసే పనుల మంచి ఫలితాలే ఆనందాన్నిస్తాయి. కాలక్షేపం కోసం చేసే కొన్ని పనులు జీవితంలో నష్టం చేసేవిగానే ఉంటాయి. – రాధికా ఆచార్య, క్లినికల్‌ సైకాలజిస్ట్, స్టూడెంట్‌ కౌన్సెలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement