శృతి యూట్యూబ్‌ ఛానల్‌కు కోటిమంది సబ్‌స్క్రైబర్స్‌ | Special Story On Youtube Star Sruthi Arjun Leaving IT Job | Sakshi
Sakshi News home page

ఆడియెన్స్‌ మెచ్చిన ‘శృతి’!

Published Wed, Jun 16 2021 7:18 AM | Last Updated on Wed, Jun 16 2021 9:45 AM

Special Story On Youtube Star Sruthi Arjun Leaving IT Job - Sakshi

చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే అమ్మాయి... ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టుగా బీటెక్‌ చదివి, తర్వాత పెళ్లి చేసుకుని భర్తతో అమెరికాలో స్థిరపడింది శృతి అర్జున్‌ ఆనంద్‌. యూఎస్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తూ.. ఖాళీ సమయంలో తనకు తెలిసిన ఫ్యాషన్‌ వీడియోలను సరదాగా తీసి ఓ రోజు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఆ వీడియోలకు మంచి స్పందన లభించడంతో తన ఐటీ జాబ్‌ను వదిలేసి, తనలో దాగున్న నైపుణ్యాలను వెలికితీసి పూర్తిగా యూట్యూబ్‌ వీడియోలపై దృష్టి పెట్టింది. ఫలితం... పాపులర్‌ యూ ట్యూబర్‌గా ఎదిగింది. క్రియేటివ్‌ కంటెంట్, ఫన్నీ వీడియోలు, ఫ్యాషన్‌ బ్లాగర్‌గా వివిధ రకాల ఛానళ్లు నడుపుతూ సక్సెస్‌పుల్‌ సోషల్‌ స్టార్‌ అనిపించుకుని ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది శృతి. 

ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక ప్రదేశం ఝాన్సీలో 1985లో పుట్టిన శృతి తన అన్నయ్య అంకూర్‌ ఆనంద్‌తో అక్కడే పెరిగింది. ఆర్మీ పబ్లిక్‌ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసి, బుందేల్‌ఖండ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేసింది. తరువాత 2009లో అర్జున్‌ సాహును వివాహం చేసుకుని భర్తతో అమెరికాలో స్థిరపడింది. వీరికి అనాయ ఆనంద్‌ అనే పాప ఉంది.

అమెరికాలో ఉన్నప్పుడే..
భర్తతో అమెరికా వెళ్లిన శృతి ఓ ఐటీ కంపెనీలో టెక్నికల్‌ ఇంజినీర్‌గా పనిచే సేది. అయితే ఉద్యోగం దొరకక ముందు శృతి వర్కింగ్‌ విసా కోసం కొన్ని రోజులు ఎదురు చూసింది. ఈ సమయంలో ఆమె విభిన్న రకాలు గా తన జుట్టును దువ్వుకునేది. ఈ క్రమంలోనే రకరకాల హెయిర్‌ స్టైల్స్‌ ప్రయత్నించి వాటన్నింటి వీడియోలు తీసుకునేది. 2010లో ఒకరోజు సరదాగా తన హెయిర్‌స్టైల్స్‌ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఆ వీడియోకు మంచి స్పందన రావడంతో రకరకాల వీడియోలు అప్‌లోడ్‌ చేయడమే పనిగా పెట్టుకుంది. 

శృతి అర్జున్‌ ఆనంద్‌ ఛానల్‌..
అమెరికాలో టెక్నికల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నప్పుడు గుర్‌గావ్‌లో స్టీరియా ఇండియా లిమిటెడ్‌లో ప్రోగ్రామర్‌గా ఉద్యోగం దొరకడంతో ఇండియా వచ్చి జాబ్‌లో చేరింది. అయితే కుటుంబం మొత్తం నోయిడాలో ఉండడంతో రోజూ అక్కడి నుంచి గుర్‌గావ్‌కి వెళ్లాల్సి రావడం, దానికితోడు యూట్యూబ్‌లో వీడియోలకు మంచి వ్యూస్‌ వస్తుండడంతో.. కొద్దిరోజుల తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని యూట్యూబ్‌కు కేటాయించింది. 2011లో ‘శృతి అర్జున్‌ ఆనంద్‌’ పేరిట యూ ట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. తొలినాళ్లల్లో శృతికి యూట్యూబ్‌ ఛానల్‌ నడపడం కాస్త కష్టంగా ఉండేది. దీంతో తన భర్త అర్జున్‌ శృతికి సాయం చేసేందుకు ఉద్యోగాన్ని వదిలేసి ఇండియా వచ్చాడు.


ఒకపక్క శృతికి వీడియోలు తీయడంలో సాయం చేస్తూనే తను కూడా ఒక యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించాడు. ఇలా కుటుంబం మొత్తం యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ బిజీ అయిపోయారు. చర్మం, జుట్టు సంరక్షణకు వంటింటి చిట్కాలు, మేకప్‌ మెలకువలు, పట్టణ, గ్రామీణ తల్లులు, కూతుర్ల మధ్య వ్యత్యాసం, పేద, గొప్ప కుటుంబాల కల్చర్‌పై రూపొందించిన ఫన్నీ వీడియోలను శృతి ఎక్కువగా తన ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసేది. ఆమె వీడియోలలో ‘మోడ్రన్‌ మామ్‌ వర్సెస్‌ దేశీ మామ్,యూజ్‌ దీజ్‌ ట్రిక్స్‌ టు అప్లై పర్‌ఫెక్ట్‌ వింగ్‌ ఐలైనర్స్‌ ఆన్‌ బోత్‌ ఐస్‌’ వంటివి బాగా ఆదరణ పొందాయి. 


ప్రముఖ బ్రాండ్లకు పనిచేయడంతోపాటు, పాపులర్‌ యూట్యూబర్‌ ప్రజక్త కోలి వంటి వారితో కలిసి శృతి పనిచేస్తోంది. శృతి అర్జున్‌ ఆనంద్‌ డిజిటల్‌ మీడియా, శృతి మేకప్‌ అండ్‌ బ్యూటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌లను సొంతగా నిర్వహిస్తోంది. దీంతో ఆమె 2016లో ఇండియా టాప్‌టెన్‌ బెస్ట్‌ యూ ట్యూబర్స్‌ జాబితాలో స్థానం దక్కించుకుంది. శృతి ఛానల్‌కు దాదాపు కోటిమంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement