కూతుళ్లతో భగవతి
ఆ రాజుకు ఏడుగురు కొడుకులు అనే కథ చిన్న నాటి నుంచి వినే ఉంటారు. కానీ, అనగనగా ఒక భగవతి ఆమెకు ఏడుగురు కుమార్తెలు అనే కథ మాత్రం ఇప్పుడు ప్రపంచం అంతా చెప్పుకుంటోంది. ‘ది స్పైస్ గర్ల్స్ ఆఫ్ ఇండియా’గా ప్రఖ్యాతి గాంచిన వారి విజయ గాథను తెలుసుకోవాలంటే మాత్రం జోద్‌పూర్ వెళ్లాలి.
సందడిగా ఉండే సర్దార్ మార్కెట్లో ఎమ్.వి. స్పైసెస్ పేరుతో ఉన్న సుగంధ ద్రవ్యాల దుకాణాన్ని ఒక తల్లి, ఏడుగురు కుమార్తెలు నిర్వహిస్తున్నారు. ఆ చిన్న దుకాణం ప్రపంచ పర్యాటకులను పలకరిస్తుంది. వారి ట్రేడ్‌మార్క్ మసాలా సెంటెడ్ చాయ్. ప్రపంచం నలుమూలల నుండి నగరాన్ని సందర్శించే పర్యాటకులు ఎమ్.వి. స్పైసెస్ పేరుతో ఉన్న ఆ స్టోర్‌ను తప్పనిసరిగా సందర్శిస్తారు. ఆ స్టోర్ గొప్పతనాన్ని, దాని ఏర్పాటు వెనకాల దాగున్న కృషిని ఒక కప్పు సెంటెడ్ టీ ని గుటక వేస్తూ్త తెలుసుకుంటారు. అప్పుడు కానీ అక్కడినుంచి వెళ్లరు. అలా వెళ్లిన పర్యాటకులు, బ్లాగర్లు ఈ సెవన్ వండర్స్ గురించి గొప్పగా ప్రస్తావిస్తూ ఉంటారు.
అసమానతలకు ఎదురొడ్డి...
‘ఏడుగురు కూతుళ్లైనా సరే, ఒక్క కొడుకుతో సమానం కాదు. వారసుడి కోసం ఎదురుచూడాల్సిందే’ అత్తగారి విసురు మాటలకు పాతికేళ్ల భగవతి తల్లడిల్లిపోయింది. భర్త మోహన్‌లాల్ మొహం చూసింది. తల్లి మాటకు అడ్డుచెప్పలేని అతను భార్య స్థితిని అర్ధం చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని జో«ద్‌పూర్‌లో ఎమ్.వి.స్పైసెస్ పేరుతో ఉన్న సుగంధ ద్రవ్యాల దుకాణంలో ఆరుపదుల వయసు దాటిన భగవతి తన జీవన ప్రయాణం గురించి వివరించినప్పుడు ఈ సమాజంలో కూతుళ్లకు ఉన్న స్థానం ఏంటో, అసమానతలకు ఎదురొడ్డి వారు ఏ విధంగా ఎదిగారో కళ్లకు కడతారు.
సమానత్వం.. గౌరవం
ఎమ్.వి సుగంధ ద్రవ్యాల కథ వాస్తవానికి తన కోసం మాత్రమే కాకుండా ఆమె ఏడుగురు కుమార్తెల సమానత్వం, గౌరవం కోసం ఒక తల్లి చేసిన యుద్ధ కథగా చెప్పుకోవచ్చు. అజ్మీర్లో పెరిగిన భగవతి 22 ఏళ్ల వయసులో 15 వేల రూపాయల కట్నంతో అత్తవారింట అడుగుపెట్టింది. వరుసగా ముగ్గురు కూతుళ్లు పుట్టారు. కొడుకు పుట్టకపోవటంతో అత్తమామలు భగవతిని శత్రువులా చూసేవారు. కూతుళ్లు కుటుంబానికి ‘భారం’ అనే ముద్రవేశారు. కొడుకు కోసం ఏడుగురు కూతుళ్లను కన్న భగవతి ఆరోగ్య స్థితిని ఎట్టకేలకు అర్థం చేసుకున్నాడు భర్త మోహన్ లాల్.
‘నా భర్త చదువుకున్న వ్యక్తి. దయగలవాడు. కానీ, ఇంటి పెద్దలకు ఎదురు చెప్పలేని మనస్తత్వం. నేను ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత మా ఏడుగురు కూతుళ్లను తీసుకొని అత్తవారింటి నుంచి బయటకు వచ్చాం. ఒక చిన్న కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంట్లో మసాలాలతో వండే ఆహారాన్ని నా భర్త బాగా ఇష్టపడేవాడు. ఇదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు, మసాలాల వ్యాపారం చేయడానికి ఒప్పుకున్నాడు. రకరకాల సుగంధ ద్రవ్యాలను పోగుచేసి, వాటితో ఘుమ ఘుమలాడే మసాలా పొడులు తయారు చేసి ఇచ్చేదాన్ని. మొదట్లో మహారాణా కోట సమీపంలో బెడ్‌షీట్ పరిచి, వాటిని అమ్మేవాడు. పగటిపూట మసాలాలు అమ్మి, సాయంత్రం కిరాణాషాప్ నడిపేవాడు.
అలా వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఏడుగురు పిల్లలు, మేము ఇద్దరం బతికిన తొలినాళ్లను ఇప్పటికీ మర్చిపోలేం. ఆ తర్వాత కిరాణ షాపునే మసాలా దుకాణంగా మార్చేశాం. ఆ కొన్ని రోజులకే అనారోగ్యంతో నా భర్త కన్నుమూసినప్పుడు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాలేదు. మసాలా దినుసులు అమ్మే వ్యాపారాన్ని నా కూతుళ్ల సహకారంతో చూసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు మా అత్తగారు తీవ్రంగా వ్యతిరేకించారు ఆడవాళ్లు చేసే పనేనా ఇది అంటూ. కానీ, ఎవరి మాటలూ లెక్కచేయకుండా ఈ వ్యాపారాన్ని కొనసాగించాను. అందుకు నా కూతుళ్లు పడిన కష్టం, వారిచ్చిన సహకారం చాలా గొప్పది. ఏడుగురు అమ్మాయిలు మంచి చదువులు చదువుకున్నారు. వ్యాపారాన్నీ చూసుకుంటున్నారు’ అంటూ తాము ఎదుర్కొన్న గడ్డు స్థితిని, దానిని ఓపిగ్గా దాటిన వైనాన్ని, గౌరవప్రదమైన జీవితాన్ని ఎలా సంపాదించుకున్నారో వివరిస్తారు భగవతి.
‘ఉషా, పూనమ్, నీలం, నిక్కి, కవిత, రితు, ప్రియా’ అంటూ తన ఏడుగురు కూతుళ్లను పరిచయం చేస్తూ వీరు నా ప్రపంచ అద్భుతాలు అంటారు భగవతి. ఈ ఏడుగురు కూతుళ్లు తల్లి భగవతితో కలిసి ఎమ్.వి.స్పైసెస్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపును ఇస్తున్నారు.
అదృష్టానికి చిరునామా!
‘ఇటీవల జో«ద్‌పూర్ సందర్శనలో మేం ఎం.వి. స్పైసెస్ దుకాణాన్ని సందర్శించి అదృష్టవంతులమయ్యాం. సుగంధ ద్రవ్యాల అల్మారాలతో నిండి ఉన్న ఆ చిన్న దుకాణాన్ని ఏడుగురు అక్కాచెల్లెళ్లు నిర్వహిస్తున్నారు. మసాలా చాయ్‌కి కావల్సిన అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు గల ప్యాకెట్‌ను మేం కొన్నాం. అది చూస్తే ‘ప్యాకెట్ ఇన్ ఇండియా’గా అనిపించింది’ అంటూ ఒక పర్యాటకురాలు తన బ్లాగ్‌లో రాసుకున్నారు. ‘ది స్పైస్ గర్ల్స్ ఆఫ్ ఇండియా’ గురించి బిబిసి ఈ ఏడుగురు కూతుళ్ల గురించి డాక్యుమెంటరీ కూడా చేసింది.
సెంటెడ్ ఛాయ్ గురించి పర్యాటకులకు వివరిస్తూ...
Comments
Please login to add a commentAdd a comment