మన హిందూ దేవాలయాల్లో ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చాలామంది భక్తులు కూడా ఆ దేవాలయ ప్రసాదాలంటే చాలా ఇష్టపడతారు కూడా. అందుకోసం గుడికి వచ్చేవాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధం. ఈ దేవాలయంలో దేవుడికి రాళ్లనే నైవేద్యంగా పెడతారట. పైగా అలా చేస్తే అనుకున్న పని ఎలాంటి ఆటంకం లేకుండా అయిపోతుందని అక్కడ వారి నమ్మకం.
వివరాల్లోకెళ్తే..శ్రీకాకుళం జిల్లా షేర్ మహ్మద్‌పురం గ్రామంలో ఈ వింత ఆచారం నెలకొంది. అక్కడ గ్రామస్తులు దేవుడికి నైవేద్యంగా ఏదోఒక రాయిని సమర్పిస్తారు. ఇది కొన్నేళ్లుగా వస్తున్న ఆచారం అని చెబుతున్నారు స్థానికులు. వాళ్లు ఆ దేవుడిని 'వీరుడి తాతగా' కొలుస్తారు. నిజానికి అక్కడ దేవాలయం గానీ దేవుని విగ్రహం కానీ ఉండదు. అక్కడ గుట్టగా.. భక్తులు నైవేద్యంగా సమర్పించిన రాళ్లు మాత్రమే కనిపిస్తాయి. అక్కడే సమీపంలో ఉండే వేపచెట్టునే దేవుడిగా పూజిస్తారు. ఈ దేవుడిని వీరుడి తాతగా పిలుస్తుంటారు.
ఆ ప్రాంతంలో కుమ్మరి వాళ్లు ఉండేవారని, ఈ గ్రామంలో జరిగే పెళ్లిళ్లకు కుండలు తయారు చేసి పెద్ద ఊరేగింపుగా వచ్చి ఈ ప్రాంతంలో ఉండేవారని చెబుతున్నారు. ఆ తర్వాత క్రమేణ ఆ ప్రాంతాన్ని వీరుడి తాతగా కొలవడం ప్రారంభించారు. ఆ దారి వెంబడి వెళ్తూ ఆ స్వామికి ఏదో ఒక రాయిని సమర్పించి వెళ్తే తక్షణమే పని అవుతుందని వారి ప్రగాఢ నమ్మకం. అది కేవలం ఆ ఊరికి మాత్రమే పరిమితం కాలేదు. చుట్టు పక్కడ గ్రామస్తులు సైతం ఇక్కడకు వచ్చి రాళ్లను సమర్పిస్తుంటారు.
ఈ ప్రదేశం సరిగ్గా ప్రధాన రహదారికి పక్కనే ఉంది. అత్యంత విలువైన ఈ ప్రదేశం పక్కన ఉన్న కొంత జాగా(నాలుగుసెంట్లు భూమిని) ఆ దేవుడి కోసం గ్రామస్తులు వదిలేశారు. ఈ ప్రదేశంలోనే పెళ్లిళ్లు కూడా చేసుకుంటారని చెబుతున్నారు అక్కడి గ్రామస్తులు. వినడానికి నమ్మశక్యం కాని విధంగా వింతగా ఉంది కదూ ఈ ఆచారం. ఏదీఏమైన మనిషి నమ్మకమే దేవుడు అని మరోసారి ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది.
(చదవండి: యావత్తు సృష్టిని ఒక్క గంటలో సృష్టించి..'స్త్రీ మూర్తి'ని మాత్రం ఏకంగా అన్ని రోజులా?)
Comments
Please login to add a commentAdd a comment