చందమామ రావే... జాబిల్లి రావే... అని పాలబువ్వ తిన్నన్ని రోజులూ పాడుతూనే ఉన్నాం. నీ పాట పాడుతూ, నువ్వు వస్తావని నమ్ముతూనే పెరిగాం. పెద్దయిన తర్వాత రావోయి చందమామా అని పిలిచాం. వస్తాడు నా రాజు ఈ రోజు అని దొంగచూపులు, బెంగచూపులు చూశాం. నెలవంక కోసం ఆకాశంలో వెతికాం. పున్నమి రోజు నీ వెన్నెల కోసం ఎదురుచూస్తుంటాం. మా చిన్నప్పుడు మా అమ్మ ‘నిన్ను అంతగా పిలిచింది’ ఎన్ని తరాలు పిలిచినా, ఎన్ని తరాల అమ్మలు పిలిచినా నువ్వు రాలేదు.
అందుకే మేమే నీ దగ్గరకు వచ్చేశాం. అమ్మలందరికీ అమ్మ మా భూమాత. భూమి తల్లి తన ప్రతినిధిగా నీ దగ్గరకు విక్రమ్‌ని పంపించింది చూశావు కదా! అమ్మకు తమ్ముడంటే చాలా ఇష్టం మామా! రక్షాబంధన్ పండుగకు నీకు రాఖీ కట్టడానికే విక్రమ్‌ని పంపించింది చూడు! మరి!!! రక్షాబంధన్ కట్టించుకున్న నువ్వు... అమ్మకు బహుమతి ఏమిస్తున్నావ్ చందమామా!
ఈ రోజు శ్రావణమాసం, పున్నమి రోజు. రక్షాబంధన్ వేడుక చేసుకుంటున్నాం. ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. అన్నదమ్ముల శ్రేయస్సు కోరుతూ అక్కచెల్లెళ్లు భగవంతుడికి పూజ చేసి, తీపి వంటకాలను నివేదన చేస్తారు. పూజలో ఉంచిన రక్షాబంధనాన్ని అన్నదమ్ముల ముంజేతికి కట్టి ‘ఇది నీకు రక్ష, నువ్వు నాకు రక్ష’ అని మమతలు పూయిస్తారు. పురాణకాలంలో యమున తన సోదరుడు యముడికి రాఖీ కట్టింది. శ్రీకృష్ణుడికి వరుసకు చెల్లెలైన ద్రౌపది రాఖీ కట్టింది. చరిత్రకాలంలో రాణి కర్ణావతి చక్రవర్తి హుమయూన్‌కి రాఖీ పంపింది. ఈ కథనాలను చదువుకున్నాం. రాఖీ మీద వచ్చిన సినిమాలను చూశాం.
సినిమాలో హీరోకి అక్క పాత్ర కట్టినంత అందమైన రాఖీని చూసినప్పుడు ఈ సారి రక్షాబంధన్‌కి తన తమ్ముడికి కూడా అలాంటి అందమైన రాఖీనే కట్టాలని ప్రతి అక్కా ఉవ్విళ్లూరుతుంది. అలా వచ్చినవే రకరకాల రాఖీలు. ముత్యాలను పోలిన తెల్లటి పూసలతో అల్లిన రాఖీలు, కెంపుల వంటి రాళ్లు పొదిగిన రాఖీలు, తెల్లటి రాళ్లు, పచ్చటి చమ్కీలతో మెరిసే రాఖీలు, రంగురంగు పూసల రాఖీలు, మువ్వల రాఖీలు రూపుదిద్దుకున్నాయి. ఎకో ఫ్రెండ్లీగా మట్టి రాఖీలు మణికట్టును ఆకట్టుకున్నాయి. బంగారు, వెండి రాఖీలు రాజ్యమేలాయి. ఈ ఏడాది మాత్రం రాఖీల్లో చందమామ హీరో అయ్యాడు. రాఖీల మీద రాకింగ్ చేస్తున్నాడు.
ఇక మేమైతే ఈ ఏడాది నీ రాఖీలతో పండుగ చేసుకుంటున్నాం. అమ్మాయిల చెవులు పట్టుకుని ఉయ్యాలలూగిన చాంద్‌బాలీలు ఇప్పుడు అబ్బాయిల మణికట్టు మీద మకుటాయమానంగా మెరుస్తున్నాయి. అర్ధవలయాకారంలో నువ్వు ముంజేతి మీద ఉంటే ప్రతి అబ్బాయీ ‘మా అక్క కట్టింది చూడు’ అని ప్రియురాలికి చూపించుకుంటూ తామే చందమామ అయినట్లు మురిసిపోతున్నారు... మెరిసిపోతున్నారు నీ మేనల్లుళ్లు.
(చదవండి: తమ్ముడికి రాఖీ కట్టేందుకు..ఓ చిన్నారి ఏం చేసిందో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment