శుంభ నిశుంభులు రాక్షస సోదరులు. శివుడి కోసం ఘోర తపస్సు చేశారు. పురుషుల చేతిలో మరణం లేకుండా వరం పొందారు. వరగర్వం తలకెక్కిన శుంభ నిశుంభులు ముల్లోకాలనూ పీడించసాగారు. దేవతలు సహా ముల్లోకాల జనాలందరూ ఆదిపరాశక్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. శుంభ నిశుంభులు స్వర్గంపై దండెత్తి, దేవతలను తరిమికొట్టారు. స్వర్గాన్ని ఆక్రమించుకున్నాక శుంభుడు తనను తాను త్రిలోకాధిపతిగా ప్రకటించుకున్నాడు. శుంభుడి ప్రాపకం కోసం కొందరు రాక్షస సేనానులు అతడి వద్ద ఆదిపరాశక్తి సౌందర్యాన్ని వైనవైనాలుగా వర్ణించారు. తనవంటి వీరుడు పెళ్లాడితే అలాంటి సౌందర్యరాశినే పెళ్లాడాలని తలచాడు శుంభుడు.
శుంభ నిశుంభుల దాష్టీకాలను ఆలకించిన ఆదిపరాశక్తి క్రోధావేశంతో తన భ్రుకుటి ముడివేసింది. ఆమె లలాటం నుంచి కాళీ పుట్టుకొచ్చింది. కాళీ సమేతంగా జగజ్జనని శుంభ నిశుంభులు నివసించే పరిసరాలకు వెళ్లి, అక్కడ ఒక ఉద్యానవనానికి చేరుకుంది. అక్కడ ఆసీనురాలై, మధురగాత్రంతో సంగీతాలాపన చేయసాగింది. అనుచరుల ద్వారా శుంభుడికి ఈ సమాచారం తెలిసింది. ఎవరో దేవకన్య తనను వలచి వచ్చిందని తలచాడు. ఆమెకు తన బలపరాక్రమాలను వివరించి, ఆమెను సగౌరవంగా అంతఃపురానికి తోడ్కొని రమ్మంటూ సుగ్రీవుడనే మంత్రిని పంపాడు. సుగ్రీవుడు ఉద్యానవనంలోకి చేరే సమయానికి కాళీ సమేత అయిన ఆదిపరాశక్తి మధుపానం చేస్తూ కనిపించింది.
‘ఓ కాంతామణులారా! మీరెవరో తెలియదు. మీ సౌందర్యాన్ని తెలుసుకుని త్రిలోకాధిపతి అయిన మా ప్రభువు శుంభుడు నన్ను ఇక్కడకు పంపాడు. మీ అదృష్టం పండింది. మీరిద్దరూ శుంభుడి క్రీడాసౌధానికి విచ్చేసినట్లయితే, అర్ధసింహాసనాన్ని అధివసించి ముల్లోకాలనూ ఏలవచ్చు కదా’ అన్నాడు. ఆదిపరాశక్తి సుగ్రీవుడి వంక చిరునవ్వుతో చూసి, ‘మీ శుంభుడి బలపరాక్రమాలను నేను ఎరుగుదును. అయితే, నన్ను యుద్ధంలో గెలవగలిగిన వాడినే పెళ్లాడాలనే ప్రతినబూనాను. నా మాటను మీ నాయకుడికి తెలియజెప్పు’ అని అతడిని పంపేసింది. సుగ్రీవుడు శుంభునికి ఆదిపరాశక్తి మాట చెప్పాడు. అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. వాళ్లను ఈడ్చుకు రమ్మంటూ ధూమ్రలోచనుడనే వాడిని పంపాడు. కాళీ వాడిని హతమార్చింది.
ఈసారి చండ ముండులనే వారిని సైన్యంతో పంపాడు. ధూమ్రలోచనుడిని చంపిన కాళీపై చండ ముండులు యుద్ధానికి దిగారు. ఎటు చూసినా తానే కనిపిస్తూ కాళీ రణరంగంలో వీరవిహారం చేసింది. రాక్షసవీరులను ఒక్కొక్కరినే అంతం చేసింది. చండ ముండుల శిరస్సులు ఖండించి, వారిని హతమార్చింది. చండ ముండుల చావు చూడగానే మిగిలిన రాక్షస సేనలు పలాయనమంత్రం పఠించాయి. చారులు ఈ సంగతిని శుంభుడికి చేరవేశారు. అమిత పరాక్రమవంతులైన చండ ముండులు హతులైన సంగతి విని శుంభుడు హతాశుడయ్యాడు. ఈసారి మహాభీకరుడైన రక్తబీజుడిని సైన్యంతో పంపాడు. రక్తబీజుడు రంకెలు వేస్తూ యుద్ధానికి వచ్చాడు.
కాళీ రక్తబీజుడితో యుద్ధానికి తలపడింది. రణరంగమంతా ఎటు చూసినా తానే కనిపిస్తూ రాక్షస సేనలను దునుమాడసాగింది. రక్తబీజుడికి ఆయుధాలతో గాయాలు తగిలినప్పుడల్లా వాడి ఒంటి నుంచి నేలరాలే రక్తబిందువుల నుంచి రక్తబీజులు పుట్టుకురాసాగారు. కాళీ సహస్ర రూపాలతో సహస్రజిహ్వలు చాస్తూ విజృంభించింది. రక్తబీజుడు నెత్తుటిబొట్టు నేల రాలకముందే తన జిహ్వలతో తాగేస్తూ, భీకర యుద్ధం కొనసాగించింది, చివరకు వాడిని వధించింది. రక్తబీజుడి మరణవార్త తెలియగానే శుంభుడిలో ధైర్యం సడలింది. నిశుంభుడు అది గమనించి, ‘అన్నా! నేనుండగా నీకెందుకు విచారం? నేనే స్వయంగా ఆమెను బంధించి తెచ్చి, నీ ముందు ఉంచుతాను’ అని పలికి అట్టహాసంగా బయలుదేరాడు. ఆదిపరాశక్తి వాడిని యుద్ధంలో అంతమొందించింది.
యుద్ధానికి పంపడానికి ఎవరూ మిగలకపోవడంతో చివరకు శుంభుడు తానే బయలుదేరాడు. ‘కాంతామణీ! నా అనుచరులను హతమార్చావని నీ మీద నాకు కినుక లేదు. రమణులకు రాణివాసం శోభిస్తుంది గాని, రణరంగం కాదు. నాతో రాణివాసానికి వస్తే, ముల్లోకాలను ఏలుకోగలవు. ఇక ఆలస్యం చేయక బయలుదేరు’ అన్నాడు. ‘ఓహో! నువ్వేనా శుంభుడవు? నా ప్రతిజ్ఞ తెలుసు కదా! నీ బలపరాక్రమాలు ఏమాత్రానివో ఒకసారి చూస్తాను, రా!’ అని పలికింది ఆదిపరాశక్తి. యుద్ధానికి సిద్ధపడ్డాడు శుంభుడు. కాళ్లు నేలకు తాటిస్తూ, భీకర సింహనాదం చేశాడు. ఆ ధ్వనికి దిక్కులు పిక్కటిల్లాయి. దేవతలు భయకంపితులయ్యారు. ఇంతలో శివుడు అక్కడకు వచ్చాడు. ఆదిపరాశక్తికి నవశక్తులను అందించాడు.
ఆదిపరాశక్తి ఆదేశంతో కాళీ రణరంగంలో వీరవిహారం ప్రారంభించింది. తోడుగా నవశక్తులు సహస్రాది రూపాలతో రాక్షస సేనలను మట్టుపెట్టసాగారు. భీకర సంగ్రామంలో రణరంగమంతా కళేబరాల గుట్టలు పోగుపడ్డాయి. నెత్తుటేర్లు ప్రవహించాయి. కాళీ చివరకు శుంభుడిని దొరకబుచ్చుకుని వాడి చేతులు, కాళ్లు, తల నరికి పారేయడంతో వాడు నేలకూలాడు. రాక్షసులందరూ హతమారడంతో కాళీతో కలసి ఆదిపరాశక్తి రణరంగంలో విజయతాండవం చేసింది. దేవతలు వేనోళ్ల స్తుతులు చేస్తూ ప్రార్థించడంతో ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుని, ప్రసన్నవదనంతో దేవతలను ఆశీర్వదించింది.
Comments
Please login to add a commentAdd a comment