ఎండలోకి వెళ్లినప్పుడు కొందరిలో ముఖం, మెడ భాగాలు ఎర్రగా మారుతుంటాయి. అప్పుడప్పుడు ఈ ఎర్రమచ్చల్లో కాస్త దురద కూడా రావచ్చు. ఎండకు ఏమాత్రం తట్టుకోలేని ‘ఫొటో సెన్సిటివిటీ’ ఉన్నవారిలో... ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలా ఎర్రబారడం, ఎర్రమచ్చలు రావడాన్ని ‘సన్‌బర్న్స్’గా చెప్పవచ్చు. ఫెయిర్ స్కిన్ ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ‘సన్‌బర్న్స్’ నివారణ కోసం కొన్ని సూచనలివే...
► బాగా ఎండలోకి వెళ్లే ముందు 50 ప్లస్ ఎస్‌పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ రాసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం రాసుకోవడమే కాకుండా... బయటకు వెళ్లాక ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ క్రీమ్ రాసుకోవడం రిపీట్ చేస్తుండాలి.
► అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అందులో ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు ఎక్కువగా వాడాలి. అలాగే క్యారట్, క్యాప్సికప్ (పసుపు పచ్చరంగులో ఉండేవి) ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మంచి రంగు ఉండే తాజా పండ్లు ఎక్కువగా తినాలి.
► ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి ఆయన సలహా మేరకు యాంటీ ఆక్సిడెంట్స్ ట్యాబ్లెట్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు. ఇలా కనీసం మూడు నెలల పాటు వాడాలి.
(చదవండి: అందరి తీర్పూ ఆమె ఉద్యోగంపైనే!)
► రోజూ కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల మన ప్రతి కణం పునరుత్తేజం పొందుతుంది. దాంతో ఈ సమస్యతో పాటు అన్నిరకాల ఆరోగ్యసమస్యల నుంచి నివారణ పొందవచ్చు.
► సమస్య తీవ్రంగా ఉన్నవారు ఆ ఎర్రమచ్చల మీద డాక్టర్ సలహా మేరకు ‘డెసోనైడ్’ అనే మైల్డ్ స్టెరాయిడ్ ఉన్న క్రీము ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పదిరోజుల పాటు రాయాలి.
► ఈ సూచనలు పాటించాక కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఒకసారి డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.
(చదవండి: మీ కోసం 'వెదురు' చూసే బొమ్మలం!)
Comments
Please login to add a commentAdd a comment