తల్లిగా మారిన ప్రతి స్త్రీ పిల్లల పనిని ఇష్టంగానూ అదే సమయంలో కష్టంగానూ భావిస్తుంటుంది. తన బాగు గురించి తాను చూసుకోవడం మరచిపోతుంటుంది. తల్లిగా మారిన తర్వాత కూడా తమ జీవితాన్ని అర్థవంతంగా ఎలా మార్చుకోవాలో క్రీడాస్ఫూర్తితో నిరూపిస్తున్నారు కొందరు తల్లులు. ఇటీవల అమెరికా వాసి కైట్లిన్ డోనర్ స్ట్రోలర్‌తో రన్నర్ మామ్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది.
ముంబై వాసి అయిన వినీత్ సింగ్ గర్భవతిగా ఉన్నప్పటి నుంచే రన్నింగ్‌తో తన ప్రపంచాన్ని ఎంత ఆరోగ్యంగా మార్చుకుందో రుజువు చేస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న ఇద్దరు పిల్లల తల్లి అయిన 34 ఏళ్ల కైట్లిన్ డోనర్ ఇటీవల చేసిన ప్రయత్నం అందరినీ ఆకర్షించింది. తన 20 నెలల కొడుకును స్ట్రోలర్ (లాగుడు బండి)లో కూర్చోబెట్టుకొని, ఆ స్ట్రోలర్‌ను నెడుతూ మైలు దూరాన్ని కేవలం ఐదు నిమిషాల 11 సెకన్లలో పూర్తి చేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అధికారిక గుర్తింపు పొదింది. తల్లుల్లో ఉన్న శక్తిని ఎలా పెంచుకోవచ్చో తన సాధన ద్వారా నిరూపిస్తోంది.
సాధనమున సమకూరు..
రెండవ గర్భధారణ సమయంలో ప్రసవానంతరం తన లక్ష్యాన్ని ప్రపంచానికి చాటాలనుకుంది. రన్నింగ్ గోల్‌ని ఏర్పరుచుకునే క్రమంలో ఆమెకు రన్నర్ స్నేహితులు ఉత్సాహం కలిగించారు. ఇది ఆమెను మరింత ముందుకు వెళ్లేలా చేసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ్రపాసెస్‌లో భాగంగా సెప్టెంబర్ 2022లో తన బిడ్డకు కేవలం నెల వయసు ఉన్నప్పుడే క్లైటిన్ దరఖాస్తు చేసింది. కానీ, అది తిరస్కరణకు గురైంది. కిందటేడాది మళ్లీ దరఖాస్తు చేసింది.
ఒలింపిక్ మారథాన్ ట్రయల్స్‌లోనూ వెనకబాటుకు లోనైంది. అయినా నిరుత్సాహపడకుండా మరింతగా కఠినమైన శిక్షణా విధానాన్ని పాటించింది. లెగ్ టర్నోవర్‌ని పెంచడానికి కొన్ని స్పీడ్ వర్కవుట్‌లను నిర్వహించింది. సాధనలో 1600 మీటర్ల వర్కౌట్‌ను స్ట్రోలర్‌తో సాధన చేసింది. ఈ ఎక్స్‌పీరియెన్స్ ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపింది. కిందటి నెలలో బాబ్ గేర్ రివల్యూషన్ 3.0 స్ట్రోలర్‌తో ట్రాక్‌లోకి ప్రవేశించింది. దీనికి ఆమె కుటుంబం, సన్నిహితులు అందించిన మద్దతు తనకీ విజయం సాధించడానికి తోడ్పడింది అని తెలియజేస్తుంది.
కఠినమైన లక్ష్యాలనే ఎంచుకోవాలి..
ట్రాక్‌పై పరిగెత్తుతున్నప్పుడు ప్రతి అడుగుతోనూ ఆమె ఈ లక్ష్యాన్ని అధిగమించడంతో చుట్టూ ఉన్న వారి చప్పట్ల హోరు కన్నా తన లక్ష్యానికి ఆమె ఇచ్చి ప్రాముఖ్యానికి అందరూ కొనియాడారు. మైలు దూరాన్ని 5 నిమిషాల 11.13 సెకన్ల సమయంలో ముగించి, మునుపటి 5 నిమిషాల 13 సెకన్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి విజేతగా నిలిచింది.
ఆమె ట్రాక్‌పై పరిగెత్తుతున్నప్పుడు అందరి దృష్టి ఆమెపై అలాగే బాబ్‌గేర్ రివల్యూషన్ 3.0 స్ట్రోలర్‌లోని బిడ్డపై కూడా ఉంది. ‘సులువైన వాటిని కాదు భయానకమైన లక్ష్యాలనే ఎంచుకోండి. ఎందుకు సాధించలేం? అనే ప్రశ్న ఎవరికి వారు వేసుకోండి. ఆశించిన ఫలితం వస్తుందో రాదో చెప్పలేం. కానీ, ప్రయత్నించినందుకు ఏ మాత్రం చింతించరు’ అని బోసినవ్వుల కొడుకును ఎత్తుకుంటూ చెబుతుంది డోనర్.
మన వినీత్ సింగ్
ముంబై వాసి వినీత్ సింగ్‌కి తల్లిగానే కాదు విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్‌గా... ఫిట్‌నెస్ ఔత్సాహికురాలుగా కూడా ఎంతో పేరుంది. ఆరు నెలల గర్భవతిగా ఉండీ వైద్యుల అనుమతితో ఈ ఏడాది జనవరిలో జరిగిన 30 కి లోమీటర్ల మారథాన్‌లో పాల్గొంది. ‘నా ప్రపంచం ఎంత ఆరోగ్యంగా ఉందో ఈ మార థాన్ నాకు పరిచయం చేసింది’ అని ఈ సందర్భంగా తెలియజేసింది. వినీత్ సింగ్ కుటుంబం క్రీడలు, ఫిట్ నెస్ అంటే చాలా ఇష్టపడుతుంది.
అప్పటికే వినీత్‌కి అల్ట్రా మారథాన్, హాఫ్ మారథాన్ వంటి వాటిల్లో పాల్గొన్న అనుభవం ఉంది. 3.8 కిలోమీటర్ల ఈత, 180 కిలోమీటర్ల సైకిల్ రైడ్, 42 కిలోమీటర్ల మారథాన్‌లలోనూ పాల్గొంది. మోస్ట్ పవర్‌ఫుల్ ఉమన్‌గా అవార్డులూ గెలుచుకుంది. గర్భవతులుగా ఉన్నప్పుడు, ప్రసవానంతరమూ తల్లులు తమ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ చూపాలో, తమ ప్రపంచాన్ని ఎంత ఉత్సాహకరంగా మార్చుకోవాలో ఈ తల్లులు తమ జీవనశైలితో నిరూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment