నిన్నటి తరం పిల్లలకు అమ్మమ్మ నాన్నమ్మ వంటకాల రుచి గురించి చెబితే చాలు నగర వాసపు జీవితాల్లో ఆ రుచిని మిస్ అవుతున్న విధానాన్ని తలుచుకొని మరీ బాధ పడి పోతారు. ఆనంద్ భరద్వాజ్ అతని భార్య నళిని పార్థిబన్‌లు చెన్నైలో ఉంటున్నతమ అమ్మమ్మ జానకి పాటి వంటకాలను పండగల సమయాల్లో ఎంతగా కోల్పోతున్నామో గ్రహించారు. చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి, అమ్మమ్మ వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. 82 ఏళ్ల అమ్మమ్మ చేత వ్యాపారాన్ని ప్రారంభించారు.
నేడు 32 దేశాలకు ఆ రుచులను అందిస్తూ ఈ వయసులో అమ్మమ్మను వ్యాపారవేత్తగా మార్చేశారు. దేశంలో దక్షిణ భారతీయ వంటకాలకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ముఖ్యంగా పండగల సమయాల్లో బామ్మలు వండే పిండివంటల రుచి మనుమలను నగరవాసం నుంచి లాక్కుని వచ్చేలా చేస్తుంది. అచ్చం ఇదే విధంగా 2015లో దీపావళి సమయంలో కుటుంబ సభ్యులు బామ్మ జానకి పాటి స్పెషల్ వంటకాలను మిస్ అయ్యారు. బామ్మ చేతి వంట రుచి గొప్పతనాన్ని ఆమె మనవడు ఆనంద్ భరద్వాజ్ అతని భార్య నళిని పార్థిబన్ మరీ మరీ గుర్తు చేసుకున్నారు. ‘దీపావళికి మా అమ్మమ్మ జాంగ్రీలు, మురుకులు, మైసూర్ పాక్‌లను చాలా జాగ్రత్తగా తయారు చేసేది. ఆమె వంట చేస్తున్నప్పుడు మనవళ్లైన మాకు కథలు కూడా చెబుతుండేది. ఆ జ్ఞాపకం నేడు ఎస్‌కెసి (స్వీట్ కారం కేఫ్)ను ప్రారంభించేలా చేసింది’ అని చెబుతుంది నళిని పార్ధిబన్.
రూ.2000 ల పెట్టుబడి
ఆనంద్, నళిని తమ అమ్మమ్మ చేతి వంట రుచిని ప్రపంచానికి పరిచయం చేయాలను కున్నారు. సంప్రదాయ దక్షిణ భారత స్నాక్న్‌కు ఆధునిక ట్విస్ట్ ఇవ్వడానికి వారు చాలా ప్రయత్నాలే చేశారు. అయితే, ఈ ప్రయాణం కష్టమైందని త్వరలోనే గ్రహించారు. చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దీంతో ఇంటిలోని ఒక చిన్న గదిలో రూ.2000 పెట్టుబడితో ప్రారంభించారు. మొదట కస్టమర్లను సంపాదించడానికి వార్తాపత్రికల మధ్యలో కరపత్రాలను ఉంచి, పంపిణీ చేసింది. దీంతో ఆర్డర్లు వెల్లువెత్తడం పారంభించాయి. జనం కొద్ది రోజుల్లోనే అమ్మమ్మ స్నాక్స్‌ని బాగా ఇష్టపడ్డారు.
ప్రతి దశలోనూ కొత్త ఉత్సాహం
‘వంటకాలన్నీ అమ్మమ్మవే. ఆమె చెప్పినట్టే చేస్తాం. కానీ, వంటను దగ్గరగా ఉండి పర్యవేక్షిస్తుంటాం. ఎక్కడా రాజీ పడకుండా చూసుకుంటాం’ అని నళిని చెబితే, ‘నాణ్యమైన దినుసులతో పాటు ప్రేమ, శ్రద్థతో మా కుటుంబం కోసం చేసే విధంగా తయారు చేస్తాం’ అని జానకి పాటి చెబుతుంది.
పాటీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారుచేస్తుంది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ బామ్మ ఉత్సాహాన్ని ఎవరైనా పొందవచ్చు. క్రికెటర్ ఎంఎస్ ధోని పట్ల తన ప్రేమను సోషల్‌మీడియా ద్వారా పంచుకొని ఆనందిస్తుంటుంది. జీవితంలోని ఈ దశనూ ఆనందంగా గడపడం కోసం ఉత్సాహంగా పనిచేస్తుంది. ‘ఇది నాకు పునర్జన్మ లాంటిది. మీరు ప్రయత్నించేవరకు మీకూ తెలియదు మీలోని శక్తి ఎంతో’ అని అందరికీ చెబుతుంది. ‘మా బామ్మలోని శక్తి మాకూ ప్రేరణగా పనిచేస్తుంది. ఆమె తన అభిమాన క్రికెటర్‌నీ ఉత్సాహపరుస్తుంది. అలాగే, సరికొత్త మొబైల్ యాప్స్ గురించి నేర్చుకుంటుంది. ఆమెకు జీవితం పట్ల ఉన్న అభిరుచి అసమానమైనది’ అంటూ తమ అమ్మమ్మ గురించి ఆనందంగా వివరిస్తుంది నళిని.
నేడు ఎస్‌కెసి (స్వీట్ కారమ్ కేఫ్) స్టార్టప్ భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు విస్తరించి, అమ్మమ్మ చేతి వంట సూపర్ అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment