సైకిల్‌ రైడ్‌కి వెళ్లిన 'తారా లీ'కి ఏమైంది..? ఇప్పటికీ మిస్టరీగానే! | Tara Calico: Is She the Woman in the Mysterious Polaroid? | Sakshi
Sakshi News home page

సైకిల్‌ రైడ్‌కి వెళ్లిన 'తారా లీ'కి ఏమైంది..? ఇప్పటికీ మిస్టరీగానే!

Published Sun, Aug 14 2022 11:08 AM | Last Updated on Sun, Aug 14 2022 11:16 AM

Tara Calico: Is She the Woman in the Mysterious Polaroid? - Sakshi

అది 1989 జూలై నెల. ఫ్లోరిడాలోని పోర్ట్‌సెయింట్‌ జాన్‌లోని రద్దీగా ఉండే కన్వీనియెన్స్‌ స్టోర్‌ పార్కింగ్‌లో ఓ మహిళ  తన కారును పార్క్‌ చేస్తూ.. పక్కనే ఆగిన టయోటా కార్గో వ్యాన్‌ని గమనించింది. దాన్ని ఒక ముప్పై ఏళ్ల మీసాల వ్యక్తి డ్రైవ్‌ చేసుకుని రావడం, పార్క్‌ చేసి వేగంగా స్టోర్‌ లోపలికి వెళ్లడం చూసింది. ఆ టయోటాలో ఏదో అలికిడిగా అనిపించి.. వెనుక నుంచి వెళ్లి గమనించింది. ఆ కారు విండో ఓపెన్‌ చేసి ఉండటంతో.. తొంగి చూసింది. చూడగానే షాక్‌ అయ్యింది. అందులో ఒక యుక్త వయస్కురాలు,  ఒక చిన్న బాలుడు నోటికి నల్లటి ప్లాస్టర్‌ వేసి, చేతులు వెనక్కి కట్టేసి బందీలుగా ఉన్నట్లు గుర్తించింది.

వాళ్లు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కారు డోర్‌ రావట్లేదు. తను కూడా వాళ్లకు సాయం చెయ్యాలని అనుకుంది కానీ వీలు కాలేదు. వెంటనే వాళ్లను తన కారులో ఉన్న కెమెరాతో ఫొటో తీసి (చిత్రంలో గమనించొచ్చు) పోలీసులకు సమాచారం ఇవ్వడానికి పరుగుతీసింది. పోలీసులు వెంటనే స్పందించారు. కారు పోయేదారుల్లో రోడ్డు బ్లాక్‌ చేయడంతో పాటు.. కొందరు ఆ స్టోర్‌ పార్కింగ్‌ని తనిఖీ చేశారు. ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు.

కేవలం ఆమె తీసిన ఫొటో తప్ప మరే సాక్ష్యం లేదు. విషయం బయటికి రావడంతో ఆ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె తీసిన ఫొటో చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. పలు టెలివిజన్‌ కార్యక్రమాల్లో విస్తృతమైన కవరేజీ వచ్చింది. ఆ ఫొటోలో యువతిని పరిశీలనగా చూసిన కొందరు.. తను కచ్చితంగా తారా లీ క్యాలికో అయ్యుంటుందని అభిప్రాయపడ్డారు. మరికొందరు కాలికో కాదని కొట్టి పారేశారు. 
ఇంతకీ ఎవరా తారా లీ క్యాలికో?
1988 సెప్టెంబర్‌ 20న ఉదయం 9:30 గంటలకు ఇంటి నుంచి సైకిల్‌ రైడ్‌కి వెళ్లి, తిరిగి రాని పందొమ్మిదేళ్ల అమ్మాయి తారా. న్యూ మెక్సికోలోని వాలెన్సియా కౌంటీలో నివసించే ఆమె.. హైవే 47పైకి ప్రతిరోజు రైడ్‌కి వెళ్లేది. తనకది చాలా ఇష్టం. అప్పుడప్పుడు తన తల్లి ప్యాటీ డోయెల్‌తో కలసి పోటీ పడేది. ఒకసారి తారా, ప్యాటీ కలసి రైడ్‌కి వెళ్లినప్పుడు.. ఓ అనుమానాస్పద ట్రక్‌ తమను వెంబడించడం చూసి ప్యాటీ భయపడింది. కొన్ని రోజులు రైడింగ్‌కి వెళ్లడం మానేస్తే బెటర్‌ అని.. వెళ్లినా సెక్యూరిటీ వెపన్స్‌ అందుబాటులో ఉంచుకోమని తారాను హెచ్చరించింది.

అయితే తారా తేలిగ్గా తీసుకుంది. ‘ఆ రోజు తన సైకిల్‌ టైర్‌ గాలి తక్కువగా ఉందని నా సైకిల్‌ తీసుకుని వెళ్లింది. ఎప్పుడూ గంటలోపు వచ్చేసేది. ఆ రోజు రాలేదు. అనుమానం వచ్చి నేను వెతుక్కుంటూ వెళ్లాను. ఎక్కడా తారా కానీ తను వేసుకుని వెళ్లిన సైకిల్‌ కానీ కనిపించకపోవడంతో భయపడి పోలీసులకు కంప్లైంట్‌ చేశా’ అని చెప్పుకొచ్చింది ప్యాటీ. అయితే ఆ మరునాడు ప్యాటీ.. తారా వెళ్లిన దారిలోనే మరింత ముందుకు వెళ్తే.. ఇంటికి మూడు మైళ్ల దూరంలో తారా వాడే వాక్‌మన్‌ భాగాలు, బోస్టన్‌ టేప్‌ ముక్కలు కనిపించాయి.

ఈ సారి పోలీసులు రంగంలోకి దిగారు. తారా అదృశ్యమైన నాలుగు రోజుల తర్వాత జాన్‌ ఎఫ్‌. కెన్నెడీ క్యాంప్‌గ్రౌండ్‌ సమీపంలో మరిన్ని వాక్‌మన్, టేప్‌ ముక్కలు దొరికాయి. అయినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. తారా ఆ రోజు సైకిల్‌ మీద వెళ్లడం చాలా మంది చూశారు. అయితే అందులో కొందరు.. క్యాంపర్‌ షెల్‌ కలిగిన ఒక లేత–రంగు పికప్‌ ట్రక్‌ను తారాకు సమీపంలో గమనించామని చెప్పారు.

ఫొటోలో బందీగా ఉన్న అమ్మాయి ముఖానికి ప్లాస్టర్‌ ఉండటంతో.. ప్యాటీ తన కూతురు తారాని సరిగా గుర్తించలేకపోయింది. అయితే ఫొటోలోని అమ్మాయి కాలు మీద ఉన్న చిన్న మచ్చను చూసి.. తన కూతురు తారాకు కారు యాక్సిడెంట్‌లో ఏర్పడిన గాయమే అదని గుర్తుపట్టింది. పైగా ఫొటోలో అమ్మాయి పక్కనే ఉన్న పుస్తకం తారాకు బాగా ఇష్టమైన పుస్తకం కావడంతో తనే తారా అని ఫ్యాటీ నిర్ధారించింది. మరి తను తారా అయితే.. ఆ బాబు ఎవరు? ఈ ప్రశ్నే పోలీసులకు మరో సవాలుగా మారింది. మొత్తానికీ ఆ అబ్బాయి పేరు మైకేల్‌  హేన్లీ అని, 1988లో తారా అపహరణకు గురైన ప్రదేశానికి 75 మైళ్ల దూరంలో తన తండ్రితో కలసి వేటకు వెళ్లినప్పుడు తప్పిపోయాడని ఆధారాలు సంపాదించారు.

హేన్లీ కుటుంబం కూడా ఆ ఫొటోలో ఉన్న బాబు తమ బాబే అని అంగీకరించింది. దాంతో దర్యాప్తు వేగం పుంజుకుంది. సరిగ్గా అప్పుడే కొన్నినెలల తేడాలో.. మరిన్ని చిత్రాలు బయటికి వచ్చాయి. వాటిలో తారాను పోలిన అమ్మాయిలు నోటికి ప్లాస్టర్స్‌ కట్టి.. బందీగా ఉన్నట్లే ఉండటంతో ఇది కేసును పక్కదారి పట్టించడానికి నేరస్థులు ఆడుతున్న ఆటేనని పోలీసులు భావించారు. ఇక 1990లో మైకేల్‌  హేన్లీ అవశేషాలు.. తను అదృశ్యమైన ప్రదేశానికి 7 మైళ్ల దూరంలో బయటపడ్డాయి. దాంతో ఫొటోలో ఉన్న అబ్బాయి హేన్లీనేనా అనే అనుమానాలూ మొదలయ్యాయి.

కూతురు మీద బెంగతో ప్యాటీ.. ఆరోగ్యం క్షీణించి 2006లో చనిపోయింది. 2008లో వాలెన్సియా కౌంటీకి చెందిన రెనే రివెరా అనే అధికారి మాట్లాడుతూ.. ‘తారా మిస్‌ అయిన రోజు.. ఇద్దరు యువకులు తారాతో మాట్లాడాలని ట్రక్‌లో ఆమెని ఫాలో చేశారు. కానీ అనుకోకుండా ట్రక్‌ సైకిల్‌ని ఢీ కొట్టడంతో.. తారా సైకిల్‌ మీద నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. కేసు అవుతుందనే భయంతో తారాను చంపేసి.. ఓ చెరువులో పడేశారని నాకు సమాచారం ఉంది. కానీ.. తారా బాడీ దొరక్కుండా నేను ఏ చర్యలు తీసుకోలేను’ అని స్టేట్మెంట్‌ ఇచ్చాడు.

రివెరా చెప్పిన కథ చాలా వరకూ నిజమేనని.. ఆ వెంబడించిన యువకుల్లో ఒకడు పోలీసు అధికారి కొడుకని.. తారాపై లైంగిక దాడి చేసి, చంపేసి ఉంటారని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. అయితే స్టోర్‌ పార్కింగ్‌ ఫొటోలోని అమ్మాయి.. తారా ఒక్కరేనా? అసలు తారా ఏమైపోయింది? ఆ ఫొటోలో ఉన్న బాబు ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలతో నేటికీ ఈ కేసు మిస్టరీగానే మిగిలింది.
 ∙సంహిత నిమ్మన 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement