వచ్చి అక్కడే ఉంటా..!  | Govardhan Reddy killed by black people attack | Sakshi
Sakshi News home page

వచ్చి అక్కడే ఉంటా..! 

Published Fri, Feb 22 2019 12:50 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

Govardhan Reddy killed by black people attack - Sakshi

ఆత్మకూర్‌(ఎం): అమెరికాలోని ఫ్లోరిడాలో నల్లజాతీయులు జరిపిన దాడిలో మృతి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేట గ్రామవాసి కొత్త గోవర్ధన్‌రెడ్డి కాల్పుల ఘటనకు ఒక రోజు ముందు హైదరాబాద్‌లో ఉంటున్న భార్య, పిల్లలతో వీడియో కాల్‌ మాట్లాడినట్లు తెలిసింది. ‘డాడీ ఎప్పడొస్తావ్‌... మిమ్మల్ని చూడాలి’ అని కూతుళ్లు అడిగితే ‘వస్తానమ్మా.. త్వరలోనే వచ్చి అక్కడే ఉంటాను. ఏదైనా పని అక్కడే చేసుకుంటాను. నేనిక్కడ.. మీరక్కడ బాగాలేదు.. వస్తాను’ అని వీడియోకాల్‌లో గోవర్ధన్‌రెడ్డి అన్నట్లు కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. గోవర్ధన్‌రెడ్డి మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఫ్లోరిడాలో ఉన్న అతని స్నేహితులు ఇక్కడి వారికి వాట్సాప్‌ సందేశాలు పంపిస్తున్నారు. గోవర్ధన్‌ అక్కడ అందరితో కలివిడిగా ఉండేవారని, ఆయన మృతి బాధాకరమని వారు పేర్కొన్నారు. గోవర్ధన్‌రెడ్డి మృతిచెందిన విషయాన్ని అతని తల్లిదండ్రులు నర్సిరెడ్డి, పద్మలకు గురువారం ఉదయం వరకు కుటుంబ సభ్యులు చెప్పలేదు. ‘మీ అల్లుడికి ఆరోగ్యం బాగా లేదు’అని చెప్పి బంధువులు వారిద్దరిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో ప్రస్తుతం గోవర్ధన్‌రెడ్డి భార్య, పిల్లలు ఉంటున్న ఇంటికి వెళ్లాక విషయం తెలపడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  

శోకసంద్రంలో ఫ్రెండ్స్‌ కాలనీ 
హైదరాబాద్‌: అమెరికాలో ఉన్మాదుల దుశ్చర్యలకు బలైన కొత్త గోవర్ధన్‌రెడ్డి ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు గురువారం పెద్దఎత్తున హైదరాబాద్‌ ఫిర్జాదిగూడ ఫ్రెండ్స్‌ కాలనీలోని ఆయన ఇంటికి తరలివచ్చారు. తల్లిదండ్రులకు ఆయన ఏౖకైక కుమారుడు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, పద్మమ్మను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. గోవర్ధన్‌రెడ్డికి భార్య శోభారాణి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. స్థానికంగా ఉన్న జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌లో శ్రీయ పదో తరగతి, తులసి ఏడో తరగతి చదువుతున్నారు.  

మూడు రోజుల్లో గోవర్ధన్‌ మృతదేహం నగరానికి? 
3 రోజుల్లో గోవర్ధన్‌ మృతదేహం నగరానికి వచ్చే అవకాశం ఉందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అక్కడే ఉన్న స్నేహితులు, బంధువుల సహాయంతో గోవర్ధన్‌ మృతదేహాన్ని నగరానికి తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందని బంధువులు తెలిపారు. 

మృతదేహం తీసుకొచ్చేందుకు  చర్యలు తీసుకోండి: దత్తాత్రేయ 
సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కొత్త గోవర్ధన్‌రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని సుష్మాస్వరాజ్‌ హామీ ఇచ్చారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement