చాలా ఏళ్ల కిందట.. వార్తా చానళ్లు లేని .. సోషల్ మీడియా ఊహ కూడా తెలియని కాలం.. తెలంగాణలోని ఓ ఊరిలో ఒక సంఘటన జరిగింది.. ఒక అబ్బాయి.. ఒక టీనేజ్ అమ్మాయి వెంట పడ్డాడు.. ‘ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను’ అని. ‘నాకు ఇష్టంలేదు’ అని స్పష్టం చేసింది అమ్మాయి. ఆ మాటను ఫ్రెండ్‌తో చెప్పి వాపోయాడు అబ్బాయి. ‘అరేయ్.. ఒక సినిమాలో హీరో.. హీరోయిన్‌కు పసుపు కొమ్ము కట్టేస్తాడ్రా.. పసుపు కొమ్ము కట్టేస్తే పెళ్లయిపోయినట్టేనంట.. అది తీసేయడానికి లేదంట’ అని సలహా ఇచ్చాడు ఆ ఫ్రెండ్. ఆ ప్లాన్ నచ్చింది ఆ అబ్బాయికి. మరుసటి ఆ అమ్మాయి కాలేజ్ నుంచి వస్తుంటే కాపుకాసి పసుపు కొమ్ము కట్టేశాడు. అల్లకల్లోలమయ్యాయి రెండు కుటుంబాలు. పెద్దల పంచాయతీలో ఆ పసుపుకొమ్మును తాళిగా నిర్ధారించి.. ఆ చేష్టను పెళ్లిగా పరిగణించారు.
ఆ అమ్మాయి కల ‘చదువు’ అలా ఓ పసుపుకొమ్ముకు బందీ అయిపోయింది.ఈ ప్రస్తావనకు సందర్భం.. రాజమండ్రిలోని జూనియర్ కాలేజ్‌లో పిల్లలు చేసుకున్న పెళ్లి.పిల్లల చేష్టలకు తప్పొప్పులు నిర్ణయించడం కాదు.. వాళ్ల మీద ఆ ప్రభావాలకు బాధ్యత వహించే తత్వం కావాలి! ఈవ్ టీజింగ్ చేస్తున్నా, ప్రేమ కోసం వేధిస్తున్నా, సెక్సువల్ ఆబ్జెక్ట్‌గా చూస్తున్నా, మోసం చేసి వెళ్లిపోయినా, పసుపు కొమ్ము అంటే తాళే అనే స్థిరాభిప్రాయంతో ఉన్నా.. చదువు, ఆట, పాటలతో ఆస్వాదించాల్సిన వయసును అర్థంతెలియని తంతుతో పెంచేసుకున్నా.. కచ్చితంగా ఆ తప్పు పెద్దలదే. అమ్మానాన్న మొదలు బంధువులు, ఇరుగుపొరుగు, వార్తా పత్రికలు, టీవీ చానళ్లు, సినిమాలు, సోషల్ మీడియా.. లేటెస్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్.. వీళ్లంతా, ఇవన్నీ ఆ పెద్దల్లో సభ్యులే. ఆ తప్పొప్పుల్లో భాగస్వాములే.
ప్రతి ఆవిష్కరణ, ప్రతి ప్రయోగం వ్యాపారం కోసమే అయిపోయింది. ఈ క్రమంలోకి జీవన శైలీ చేరింది. అందుకే అమ్మానాన్న పనిచేయాల్సిన పరిస్థితి. పని పట్టణాల్లోనే దొరుకుతోంది. దాంతో మంచిచెడు చూసుకునే పెద్దలున్న ఉమ్మడి కుటుంబాలు వలసలతో పరిమిత కుటుంబాలుగా కుదించుకుపోయాయి. ఒకప్పుడు పిల్లల పెంపకంలో అమ్మానాన్న పాత్రే ఎక్కువ. ఇప్పటి అమ్మానాన్నలు పెంపకంలో నామమాత్రంగానే మిగిలిపోయారు. పిల్లలకు సౌకర్యాలు అమర్చే ప్రయాసలో పడి. తర్వాత స్థానంలో ఉన్న బంధుగణాన్ని చూపిద్దామనుకున్నా కనుచూపు మేరల్లో ఉండట్లేదు. చుట్టుపక్కల వాళ్లు ఎవరో తెలియనంత బిజీలో పడిపోతిమి. ఇవి నిద్రాణమైనప్పుడు పిల్లల భవిష్యత్తుకు పునాది పడే పాఠశాలలు చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల డాలర్ డ్రీమ్స్ బోధనశాలలను ఎమ్‌సెట్, ఐఐటీ ఎట్‌సెట్రా మూసల ఫ్యాక్టరీలుగా తయారుచేశాయి. పిల్లల ఆలోచనలను పట్టించుకునే సున్నితత్వాన్ని, వాళ్ల మాటలను వినే ఆసక్తిని బోధకులూ వదిలేసుకోవాల్సి వచ్చింది, టీచింగ్ టార్గెట్స్‌ను పూర్తి చేసే ప్రయత్నంలో. ఈ వాక్యూమ్‌ను పూర్తి చేస్తున్నవి సమాచార, సాంకేతిక విప్లవ, వినోద సాధనాలు. బోధన.. పఠనాన్ని, పరిశీలనను, పరిశోధనను, విచక్షణను నేర్పుతుంది. సమన్వయం అలవరుస్తుంది. బోధనలేని సమాచారం కుతూహలాన్ని కలిగిస్తుంది. థియరీ లేని ప్రాక్టికల్స్ వైపు ఉసిగొల్పుతుంది.
అందుకే.. ‘ఈ పెద్దాళ్లున్నారే..’ అన్న డైలాగులు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. టీనేజ్ లవ్ స్టోరీల సినిమాలు సాహసంగా తోస్తాయి. ఆ హీరోయిక్ స్టంట్‌ను జీవితంలో ప్రదర్శించాలనే ఉత్సుకతను రేపుతాయి. ఆ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌ను మీడియా, సోషల్ మీడియా వైరల్ చేస్తాయి. హీరోయిజంగా ఎస్టాబ్లిష్ చేస్తాయి. దాన్నుంచీ ప్రేరణ పొందేవాళ్లెంతమందో.
చదువుల మిల్లు నుంచి ఒత్తిడితో బయటపడ్డ ఆ పిల్లలు ఆటలతో సేదతీరే అవకాశం లేదు. అన్నిచోట్లా ఆ కరిక్యులమ్ మిస్. అందుకే వాళ్లను వీడియో గేమ్స్, సినిమాలు.. సినిమాలు లేని ఈ కరోనా టైమ్‌లో ఓటీటీ వేదికలు.. సెన్సార్‌షిప్‌లేని అందులోని కార్యక్రమాలు, సోషల్ మీడియా వేదికలు.. ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. వాటి సైడ్‌ఎఫెక్ట్సే లైంగిక దాడులు, యాసిడ్ దాడులు, హత్యలు, మైనర్‌ల పెళ్లిళ్లు ఎట్‌సెట్రా. కొరవడిన పేరెంటింగ్ అనుభవాలకు ఉదాహరణలు.
తప్పు పిల్లలది కాదు.. అమ్మానాన్న, తాత, అవ్వ, బంధుమిత్రులు, ఇరుగుపొరుగు, టీచర్లు, పాలకులు, సమాచార, వినోద మాధ్యమాలు అన్నీ కలిసి ఉన్న సమాజానిది. పిల్లల కోసం పిల్లల పెంపకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది మనం. అప్పుడే అవసరంలేని విషయాలను వాళ్లకు అందుబాటులోకి తెస్తున్నది మనం.. దృష్టి సారించకూడని ప్రపంచాన్ని వాళ్ల ముందు పెడ్తున్నది మనం. బాధ్యత మరిచింది.. మరుస్తున్నది మనం. పిల్లల తప్పటడుగు పెద్దల తప్పిదమే. జ్ఞానం మనకు కావాలి. ఒత్తిడిలేని చదువు, హాయినిచ్చే ఆటపాటలతో వాళ్లను పెంచుకునే చైతన్యం మనకు రావాలి. అందమైన బాల్యం, భద్రమైన యవ్వనాన్ని వాళ్లకిచ్చే బాధ్యత మనం తీసుకోవాలి.
-శరాది
Comments
Please login to add a commentAdd a comment