కాన్పు తర్వాత ఉద్యోగానికి.. | Tips To Get Back To Work After Giving Birth | Sakshi
Sakshi News home page

కాన్పు తర్వాత ఉద్యోగానికి..

Published Fri, Aug 5 2022 2:53 AM | Last Updated on Fri, Aug 5 2022 2:53 AM

Tips To Get Back To Work After Giving Birth - Sakshi

నిన్న మొన్నటి దాకా మీ లోకం వేరు. పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగం చేస్తున్నారు. కాని ఇప్పుడు? మీరొక తల్లి. ఒక బుజ్జి అద్భుతం మీ జీవితంలోకి వచ్చింది. ఆ తబ్బిబ్బులోనే ఒక సతమతం కూడా ఉంటుంది. పాలు పట్టడం (అదంత సులువైన పని కాదు మనం ఊహించినంత), స్నానం చేయించడం, నిద్ర పుచ్చడం... ఇవన్నీ కొంత కాలం పాటు అర్థం కావు. మెల్లగా పరిస్థితి అదుపులోకి వస్తుంది.

మీ బుజ్జికి మీరు మీకు మీ బుజ్జి అర్థం కావడం మొదలెడతారు. కన్ను మూసి తెరిచేలోపు ఆరు నెలలు గడిచిపోతాయి. మీరు ఆఫీసుకు తిరిగి వెళ్లే సమయం వచ్చేస్తుంది. ఆలోచించి చూస్తే ఆఫీసులో పని చేయడం గత జన్మలా అనిపిస్తుంది. మళ్లీ ఆ డ్యూటీకి అలవాటు పడాలి. గతంలో భార్య డ్యూటి, ఉద్యోగి డ్యూటి. ఇప్పుడు తల్లి డ్యూటీ కూడా. చాలా ఆందోళనగా అనిపిస్తుంది. కాని ఏం పర్లేదు. కొన్ని టిప్స్‌ పాటిస్తే అంతా బాగుంటుంది.

ఎవరు చూడాలి?
మీరు డ్యూటీకి జాయిన్‌ కావాల్సిన ఒకటి రెండు వారాలకు ముందే ఆయా చూడాలా? డే కేర్‌లో వదులుతారా? లేదంటే అమ్మ/అత్త చూసుకుంటారా... డిసైడ్‌ అవ్వాలి. ఉద్యోగానికి వెళ్లే రోజు నుంచి మాత్రమే వీరి చేతుల్లో బుజ్జిని పెట్టకుండా రెండు వారాల ముందు నుంచే మెల్లగా అలవాటు చేయాలి. మొదట వారికి అప్పజెప్పి ఒకటి రెండు గంటలు బయటకు వెళ్లిరావాలి.

దాంతో మానసికంగా మీకు పాప/బాబు నుంచి దూరంగా పనికి వెళ్లే సమయం అలవాటు అవుతుంది. అదే సమయంలో బ్యాక్‌ అప్‌ ప్లాన్‌ కూడా కావాలి. అంటే ఆయా రాకపోతే, డే కేర్‌ ఆ రోజు వీలు కాకపోతే, ఇంట్లో వాళ్లు లేకపోతే ఎవరు వచ్చి బాబును చూస్తారో ముందే ప్లాన్‌ చేసి వారికి చెప్పి పెట్టాలి. వారు అంత నమ్మకమైన వారు కావాలి. బుజ్జిని వారికి కూడా అలవాటు చేయాలి.

రొటీన్‌ని అలవాటు చేయాలి
చంటి పిల్లలు ఒక రొటీన్‌లో పడటం మంచిది. అది కూడా అలవాటు చేయాలి. ఆడుకునే సమయం, నిద్ర పోయే సమయం, స్నానం చేసే సమయం, తిండి తినిపించే సమయం ఇవి అలవాటు చేయడం ముఖ్యం. దానికి తగ్గట్టు మీ నిద్రను విశ్రాంతిని కూడా ప్లాన్‌ చేసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగిగా, తల్లిగా కూడా మీరు అలసి పోయే అవకాశం ఎక్కువ. అంతే కాదు మీరు ఆఫీసుకు వెళితే బాబును చూసుకునేవారు కూడా ఈ రొటీన్‌ను ఫాలో అవుతారు. జోల పాడి నిద్ర పుచ్చడం, బుజ్జగించి తినిపించడం మీకు లాగే ప్రేమగా, ఓపికగా చేసే మనిషి దొరకడమే మీరు ముఖ్యంగా భావించి వెతకాలి.

తిండిని సిద్ధం చేయండి
చంటికి ఆరునెలలు దాటాకే మీరు ఉద్యోగానికి వెళతారు కాబట్టి మీ చంటి ఏమి తింటే మంచిదో మీరు తెలుసుకున్నారు కాబట్టి ఆ తిండిని మీరు సిద్ధం చేసి మీరు లేనప్పుడు వెతుక్కునే బాధ లేకుండా చూడాలి. ఆ తిండి పెట్టే చోటు ఫిక్స్‌డ్‌గా ఉండాలి. మీ బాబును చూసుకునేవారికి ఆ తిండి ఎలా సిద్ధం చేసి తినిపించాలో మీరు ప్రాక్టీసు చేయించాలి. తరువాయి వారు చూసుకుంటారు. 

పనులు ప్లాన్‌ చేసుకోండి
మీరు ఎప్పటికప్పుడు ఆఫీసు పనులు ఇంటి పనులు ప్లాన్‌ చేసుకోవాలి. ఇంటి పనులు వీకెండ్‌లో చేసుకుంటూ ఆఫీసు పనులు ఏ రోజుకారోజు పెండింగ్‌ లేకుండా చూసుకోవాలి. ఆఫీసు అయ్యాక ఇల్లు చేరి మీ పాపను గుండెకు హత్తుకోవాలి కాబట్టి ఆఫీసులో పిచ్చాపాటి మాట్లాడి టైమ్‌ వేస్ట్‌ చేసి లేట్‌ అవర్స్‌ పని చేయవద్దు. అంతే కాదు ‘చంటి బిడ్డ ఉంది’ అనంటే కొంత పని మీ కొలిగ్స్‌ షేర్‌ చేసుకుంటారు. ఆ మాత్రం బరువు వారి మీద వేయండి. మొత్తానికి పని భారం నెత్తిన లేకుండా చూసుకుంటే మీ బాబుతో మీకున్న సమయాన్ని సంతోషంగా గడపొచ్చు.

సిసి టీవీని బిగించుకోండి
ఇది అత్యంత ముఖ్యం. బిపి రాకుండా ఉంటుంది. ఇవాళ రేపు మైక్‌ ఉన్న కెమెరాలు దొరుకుతున్నాయి. వాటిని బిగించుకుంటే మీ పాప/ బాబు ఎలా ఉన్నారో, కేర్‌ టేకర్‌ సరిగా చూసుకుంటూ ఉందో లేదో ఒక కన్నేసి పెట్టే వీలుంటుంది. ఆఫీసుకు వెళ్లే తల్లికి ఇది బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అని చెప్పవచ్చు. ఇవి ఏమంత ఖరీదు కూడా కాదు. అలాగే మీ ఆఫీస్‌లో, ఫ్రెండ్స్‌లో, కాలనీలో ఉన్న కొత్త తల్లులతో ఒక వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకోండి. ఒకరికొకరు ఉన్నామనే ధైర్యం ఉంటుంది. చాలా సందేహాలకు అక్కడే సమాధానం దొరుకుతుంది.

గిల్ట్‌ను పక్కన పెట్టండి
అయ్యో చంటి పిల్లాణ్ణి వదిలిపెట్టి ఉద్యోగానికి వెళుతున్నానే అన్న గిల్ట్‌ను వదిలిపెట్టండి. మీ బంగారానికి ఏం కావాలో అవన్నీ చూసే మీరు ఉద్యోగానికి వెళుతున్నారు. కుటుంబం కోసం, మీ సంతానం కోసమే మీరు పని చేస్తున్నారు. అది మాత్రమే కాదు మీ కోసం కూడా మీరు ఉద్యోగం చేస్తున్నారు. మీకు ఉద్యోగం ఇష్టమైతే ఆ ఇష్టం ఉన్నందుకు గిల్ట్‌ ఫీల్‌ అవ్వాల్సిన పని లేదు. పని చేయండి. పెంచండి. పని చేస్తూ చక్కగా పెంచడంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటే మిమ్మల్ని మించినవారు లేరు.

క్వాలిటీ టైమ్‌
మీ గొంతు... నవ్వు... మాటలు వినడం మీ పాపకు ఇష్టం. మీ బాబు అదే కోరుకుంటాడు. కనుక వారితో క్వాలిటీ టైమ్‌ను మీరు గడపాలి. వారు నిద్రపోయే సమయంలో మీరు ఉన్నంత మాత్రాన, మీ డ్యూటీ సమయంలో మీ బుజ్జి మేలుకుని ఉన్నంత మాత్రాన క్వాలిటీ టైమ్‌ కుదరదు. అందువల్ల మీ ఇద్దరూ యాక్టివ్‌గా ఉండే టైమ్‌ ఏదో సెట్‌ చేసుకుని ఆ టైమ్‌లో ఇద్దరూ రోజూ తప్పనిసరిగా గడపాలి. 

ఇలా చేయండి
మాతృత్వం ఎంత ముఖ్యమో ఉద్యోగమూ అంత ముఖ్యమే. ప్రసూతి సెలవులు ముగిశాక ఉద్యోగానికి వెళ్లకతప్పదు. వర్కింగ్‌ ఉమన్‌గా ఉంటూ తొలి కాన్పు తర్వాత ఉద్యోగానికి తిరిగి వెళుతుంటే కనుక ఎన్నో సందేహాలు... ఆందోళనలు. మరేం పర్వాలేదు. ఈ టిప్స్‌ పాటించండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement