అక్షర్‌ధామ్.... ఆధ్యాత్మికతకు అర్థం చెప్పిన స్వామి నారాయణుడి ఆలయం. సమాజాన్ని ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, తాత్వికత వైపు నడిపించిన సంఘసంస్కర్త స్మారక మందిరమే అక్షర్‌ధామ్. స్వామి నారాయణుడు 18–19 శతాబ్దాల్లో సమాజంలో కరడుగట్టి ఉన్న సామాజిక దురాచారాలను పరిహరించడం కోసం పని చేశాడు. మనదేశం అప్పుడు స్థానికంగా హిందూ, ముస్లిం పాలకుల పాలనలో ఉంది. ఈ రాజ్యాలన్నీ బ్రిటిష్ పాలన కింద మనుగడ సాగించాయి. ఈ సమ్మేళన సంస్కృతి ప్రభావం సమాజం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. అనేక మూఢ నమ్మకాలు, సామాజిక దురాచారాలు పెచ్చరిల్లిన నేపథ్యంలో మహిళలు ఆంక్షల వలయంలో చిక్కుకుపోయారు. భద్రత, మత విశ్వాసాల నిబంధనల కింద పేదవాళ్లు మహిళలు మగ్గిపోతున్న సమయంలో సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నతుడు స్వామి నారాయణుడు. ఆడపిల్లలను పురిట్లోనే ప్రాణాలు తీస్తున్న రోజుల్లో స్వామి నారాయణుడు సతి దురాచారాన్ని నియంత్రించడంతో΄ాటు మహిళలకు చదువు అవసరాన్ని చెప్పాడు. వివక్ష రహిత, హింస రహిత సమాజాన్ని స్థాపించడం కోసం సమాజాన్ని సన్మార్గంలో నడిపించాడు. ఒక సంఘ సంస్కర్త గౌరవార్థం నిర్మించిన క్షేత్రం కావడంతో ఇక్కడ వైదిక క్రతువులు ఉండవు. ఏకకాలంలో ఈ ఆవరణంలో వేలాదిమంది ఉన్నప్పటికీ రణగొణధ్వనులుండవు. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. అక్షర్‌థామ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఆర్ట్, సైన్స్, కల్చర్, స్పిరిచువాలిటీల సమ్మేళనం.
ఇది ఎక్కడుంది!
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఉంది అక్షర్‌ధామ్. అహ్మదాబాద్ నుంచి 40 కి.మీ.లు ఉంటుంది. రాజస్థాన్ నుంచి తెప్పించిన ఈ పింక్ సాండ్‌స్టోన్ నిర్మాణం... అందమైన శిల్పసౌందర్యానికి నిలయం. చక్కటి గార్డెన్‌లు, స్వామి నారాయణ్ జీవిత చరిత్ర, ఆయన తీసుకువచ్చిన సంస్కరణల ఇతివృత్తంలో సాగే చిత్ర ప్రదర్శన, పెయింటింగ్స్, శిల్పాలను చూసి తీరాల్సిందే. ఈ ఆలయంలో ప్రతి అంగుళం అత్యాధునికమైన సాంకేతికతను, ఆధ్యాత్మిక భావనను, క్రమశిక్షణను ప్రతిబింబిస్తుంది. అక్షర్‌ధామ్‌ను ఎక్స్‌ప్లోర్ చేయడానికి ప్రయాణ సమయం కాకుండా కనీసం మూడు గంటల సమయాన్ని కేటాయించుకోవాలి. అక్షర్‌ధామ్‌కి ఎంట్రీ ఫీజ్ లేదు కానీ ఎగ్జిబిషన్‌లు, వాటర్ షోలకు టికెట్ ఉంటుంది. వాటర్ షో ‘సత్ చిత్ ఆనంద్’ కథనం కఠోపనిషత్తు ఆధారంగా హిందీలో సాగుతుంది నెరేషన్. నచికేతుడికి యముడు వరాలివ్వడం వంటి ఉపనిషత్ సారాంశాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ మల్టీ కలర్ లేజర్స్, ఫైర్‌బాల్స్, అండర్ వాటర్ ఫ్లేమ్స్‌లో టెక్నాలజీని ఎంజాయ్ చేయవచ్చు.
ఫొటో పాయింట్
అక్షర్‌ధామ్ లోపలికి మన కెమెరాలను అనుమతించరు, కానీ ఈ ఆవరణలో ఫొటో పాయింట్ దగ్గర కెమెరాతో ఒక ఫొటోగ్రాఫర్ ఉంటాడు. పర్యటనకు గుర్తుగా అక్షర్‌ధామ్ గోపురం కనిపించేటట్లు ఫొటో తీయించుకోవచ్చు.
సావనీర్ షాప్‌లో పుస్తకాలు, ఫొటోలు, వీడియో సీడీలతోపాటు అక్షర్‌ధామ్ టీ షర్టులుంటాయి. ఫొటోలతో ఇంటిని నింపడం కంటే టీ షర్టు కొనుక్కోవడం మంచి ఆప్షన్. అక్షర్‌ధామ్ ఆవరణ మొత్తం తిరిగి చూసిన తర్వాత ఆశ్యర్యంగా అనిపించేదేమిటంటే... స్వామి నారాయణుడి జీవనశైలి అత్యంత నిరాడంబరంగా సాగింది. ఆయన స్మారక మందిరం మాత్రం సంపన్నతకు ప్రతిరూపంగా ఉంది.
అభిషేకం చేయవచ్చు!
అక్షర్‌ధామ్‌లో పర్యాటకులు అందరూ స్వామి నారాయణ్‌కి అభిషేకం చేయవచ్చు. అభిషేక మండపంలో పూలు, ఆకులతో నీటి చెంబులను వరుసగా పేర్చి ఉంటారు. టికెట్ తీసుకుని మౌనంగా క్యూలో వెళ్లి అభిషేకం చేయాలి. ఇక్కడ నియమాలు చాలా కచ్చితంగా ఉంటాయి. కానీ హ్యూమన్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. డ్రెస్ కోడ్ విషయంలో ఇండియన్, వెస్ట్రన్ అనే నియమాలేవీ ఉండవు. కానీ భుజాలు, ఛాతీ, నాభి, భుజాల నుంచి మోచేతుల వరకు, మోకాళ్ల కింది వరకు కవర్ అయ్యే డ్రెస్‌లను మాత్రమే అనుమతిస్తారు. మనం ధరించిన డ్రస్ వాళ్ల నియమాలకు లోబడి లేకపోతే మూడు వందల రూపాయలు డిపాజిట్ చేయించుకుని సరోంగ్ అనే డ్రస్‌ను ఇస్తారు. మన దుస్తుల మీద దానిని ధరించాలి. డ్రస్ వెనక్కి ఇచ్చినప్పుడు మన డబ్బు ఇచ్చేస్తారు. ఫోన్‌లు, కెమెరాలు, పెన్‌డ్రైవ్‌లు, మ్యూజిక్ డివైజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, ఆయుధాలు, ఆటబొమ్మలు, లగేజ్, పెట్‌లు, ఆహార పానీయాలు, పొగాకు ఆల్కహాల్ ఇతర నిషేధిత డ్రగ్స్‌కు అనుమతి ఉండదు. చంటి పిల్లలతో వెళ్లే వాళ్లకు పాలు, ఆహారం, నీళ్ల సీసాలను అనుమతిస్తారు. వికలాంగులకు, వృద్ధులకు వీల్ చైర్ ఫ్రీగా ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment