జమున,రాగి దుబ్బు
అవును మీరు చదివింది నిజమే. గత కొన్ని సంవత్సరాలుగా ‘గులి రాగి’ పద్ధతిలో రాగి నారు పోసి మొక్కలు నాటి సాగు చేయడం ద్వారా ఉత్తరాంధ్ర, తూ.గో జిల్లాలోని కొండ ప్రాంతాల్లో గిరిజన రైతులు మెరుగైన దిగుబడి సాధిస్తున్నారు. అయితే, గత ఏడాది వర్షాధారంగా జమున అనే గిరిజన మహిళా రైతు కొత్త పద్ధతిని ఆచరణలోకి తెచ్చారు. గులి రాగి పద్ధతిలో కొన్ని మార్పులు చేసి మరింత అధిక దిగుబడి సాధించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వర్షాధారంగా జమున సాగు చేసిన రాగి దుబ్బుకు 28 నుంచి 39 పిలకలు వచ్చాయి. అందుకే ఈ సాగు విధానాన్ని ‘జమున పద్ధతి’ అని పిలుస్తున్నారు.
గిరిజన మహిళా రైతు జమున. ఆమె విశాఖపట్నం జిల్లా మంచింగిపుట్టు మండలం హంసబండ గ్రామంలో కుటుంబంతో జీవిస్తూ వర్షాధారంగా వినూత్న పద్ధతిలో దేశవాళీ రాగులను సాగు చేస్తున్నారు. 2019లో మొదటి సారిగా ప్రయోగాత్మకంగా జమున ఈ పద్ధతిలో రాగి పంటను పండించారు. ఆశ్చర్యంగా ప్రతి దుబ్బుకు 28 నుండి 39 పిలకలు వచ్చాయి. మొదటిసారి ఆమె ఈ పద్ధతి ద్వారా ఎకరానికి 12.2 క్వింటళ్ల రాగుల దిగుబడి పొందారు. ఈ ఏడాది మరింత ఎక్కువ దిగుబడి వస్తుందని భావిస్తున్నారు.
ఈ విధానంలో పనులు చాలా వరకు ‘గులి రాగి’ పద్ధతిని పోలి ఉంటాయి. కానీ నాటే పద్ధతి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. జమున పద్ధతిలో ప్రయోజనాలను గుర్తించిన ‘సంజీవిని’ స్వచ్ఛంద సంస్థ సారధులు దేవుళ్ళు, అమ్మాజీ ఈ పద్ధతిని ఈ ఏడాది మరింత ప్రచుర్యంలోకి తీసుకువచ్చారు.
ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి గిరిజన కొండ వాలు ప్రాంతాల్లో గులి రాగి ఈ ఏడాది 3,500 ఎకరాలకు విస్తరించగా, జమున పద్ధతిలో రాగి సాగును 144 మంది రైతులు చేపట్టారని ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు కూడా అయిన దేవుళ్లు (9849205469) తెలిపారు.
‘జమున’ సాగు పద్ధతి వివరాలు: ∙జమున సాగు పద్ధతిలో వర్షాధారంగా పొడి దుక్కులతో రాగి, మెట్ట వరి పంటలను పండించవచ్చు. వాలు భూములు, లోతు తక్కవగా ఉన్న ఇసుక నేలలు అనుకూలం. నీరు నిలువ ఉంటే కలుపు సమస్య ఎక్కువ అవుతుంది. దేశవాళి రాగి, వరి రకాల పంట ఎదుగుదలకూ అంత అనుకూలం కాదు.
♦వేసవిలో అంటే ఏప్రిల్‌లో మూడు సార్లు పొడి దుక్కులు చేయాలి. చివరి దుక్కిలో ఎకరానికి 5 టన్నుల పశువుల (గెత్తం) ఎరువు లేదా టైపు–2 ఘన జీవామృతం వేయాలి.
♦మే నెలలో విత్తుకోవటానికి అనుకూలం. వర్షాలకు ముందే విత్తుకుంటే కలుపు మొక్కలు తగ్గి, పంట ఎదుగుదల బాగుంటుంది.
♦దేశవాళి రాగి రకాలు చిన్న చోడి, పెద్ద చోడి అనుకూలం. దేశవాళీ వరి రకాలు కుంటికులియా, కలమోరి, కొండగిరిలను ఎన్నుకోవాలి. విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి.
♦విత్తుకోవడానికి ముందు నేలను చదును చేయాలి. మొక్కకు మొక్కకు మధ్య , వరుసల మధ్య అడుగు దూరం ఉండాలి. పొలానికి ఇరువైపులా తాళ్ళ సహాయంతో గానీ లేదా మార్కర్ల సహాయంతో గానీ ఒక అడుగు దూరంతో గీతలు గీయాలి.
♦రెండు గీతలు కలిసే చోట సూమారు రెండు అంగుళాల గుంత తీయాలి. గుంతలో కొద్దిగా టైపు–1 ఘన జీవామృతం వేయాలి. తర్వాత 2–3 విత్తనాలను (రాగి లేదా వరి) గుంతలో వేసి మట్టితో పూడ్చాలి. అయితే విత్తనాలు లోతుగా పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ విత్తనాలు గుంతలో లోతుగా పడితే అవి మొలకెత్తవు.
♦మొలకెత్తిన నెల రోజుల్లోగా ఎక్కువగా ఉన్న చోట్ల మొక్కలు కొన్ని పీకి మొలకెత్తని గుంతల్లో నాటు వేయాలి. ఈ విధంగా ప్రతి గుంతకు 2–3 పిలకలు ఉండేలా చేయాలి.
♦జమున పద్ధతి గులి రాగితో పోలికలు ఉంటాయి. రెండింటికీ మధ్య ముఖ్యమైన తేడా ఉంది. గులి రాగి పద్ధతిలో ప్రతి గుంతలో 12–21 రోజుల నారును నాటుతారు. జమున పద్ధతిలో నారుకు బదులుగా విత్తనాలను వేస్తారు. అయితే, మెట్ట వరి పంటకు సంబంధించి ఇది ఒక నూతన ఒరవడిగా చెప్పుకోవచ్చు.
♦విత్తిన 30 రోజుల తర్వాత మొదటి కలుపును వీడర్ల సహాయంతో తీయాలి. కూలీలతో కూడా చేయించవచ్చు లేదా ఎద్దుల సహాయంతో దంతె/ గొర్రు వాడవచ్చు. తర్వాత 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు కలుపు తీయాలి. అంటే, మొత్తం 3 సార్లు అంతర సేద్యం చేయాలి.
♦కలుపు తీసిన ప్రతిసారీ ఎకరానికి 200 లీటర్ల ద్రవ జీవామృతం పోయాలి. ప్రతి మొక్క మొదళ్లలో సుమారు 100 మీ. లీ. పోయాలి.
♦కలుపు తీయడానికి, ద్రవ జీవామృతం పోయడానికి స్థానికంగా లభ్యమయ్యే యంత్రాలను వాడవచ్చు. నాలుగు వరుసలకు ఒకేసారి కలుపు తీయడానికి అలాగే నాలుగు వరుసలలో ఉన్న మొక్కలకు ద్రవ జీవామృతం పోయడానికి ఒకే యంత్రం పనిచేస్తుంది (ట్రాక్టర్ తో పని లేకుండా మనుషులు లాగవచ్చు).
♦గులి రాగి పద్ధతి మాదిరిగానే జమున పద్ధతిలో రాగి పంటలో లేత మొక్కలపై కర్ర దుంగను లాగాలి. ఎక్కువ పిలకలు రావటం కోసం కర్ర దుంగను లాగుతారు. మొలకెత్తిన 15 రోజుల నుంచి 45 రోజుల మధ్య 15 రోజుల వ్యవధిలో 2–3 సార్లు కర్ర దుంగను లాగాలి. అయితే, జమున పద్ధతిలోని మెట్ట వరి పంటకు కర్ర దుంగను లాగనవసరం లేదు.
♦పంట చుట్టూ బంతి, మొక్కజొన్న, కంది మొక్కలను రక్షక పంటలుగా, ఎర పంటలుగా వేయాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. అవసరమైతేనే కషాయాలను ఉపయోగించాలి.
♦గిరిజన ప్రాంతాల్లో అంతరించిన మెట్ట వరి సాగును కూడా ఈ ఏడాది నుంచి పునరుద్ధరించామని దేవుళ్లు చెప్పారు. కుంటి గులియ, కొండగిరి, చుపర్ ధాన్యం దేశవాళీ వరి రకాలను 480 ఎకరాల్లో సాగు చేస్తున్నారని ఆయన వివరించారు. ఏప్రిల్, మే నెలలో మొదటి వర్షాలకు చల్లుతారు. కందులు, బొబ్బర్లు కలిపి చల్లుతారు. వరి సెప్టెంబర్– అక్టోబర్ కల్లా మెట్ట ధాన్యం కోస్తారు. ఈ బియ్యం బలవర్ధకమని, రుచికరమని దేవుళ్లు అంటున్నారు.
♦సేంద్రియ గులి రాగి ఎకరానికి గత ఏడాది అత్యధికంగా 18.25 కిలోల దిగుబడి వచ్చినట్లు శాస్త్రవేత్తలు నమోదు చేశారు. ఈ ఏడాది గులి రాగిలో అంతర పంటల సాగునూ ప్రారంభించటం విశేషం. 5 వరుసలు రాగి, 2 కొర్రలు, 2 కంది వేశారు.
Comments
Please login to add a commentAdd a comment