తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన జుజ్జవరపు సతీశ్ గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కొబ్బరి తోటలో ఐదంచెల సాగు ద్వారా ఎకరానికి ఏటా రూ.1,05,000 నికరాదాయం పొందుతున్నారు. మోటార్ బైక్‌తో నడిచే ట్రాలీని, బైక్‌తో నడిచే స్ప్రేయర్‌ను తానే తయారు చేయించుకోవటం ద్వారా కూలీల ఖర్చును భారీగా తగ్గించుకోవటం ఆయన ప్రత్యేకత. రైతుసాధికార సంస్థలో మాస్టర్ ట్రైనర్‌గా పనిచేస్తూ ఇతర రైతులకు మార్గదర్శకుడిగా మారారు. ఆయన స్ఫూర్తితో కురుకూరు గ్రామానికి చెందిన సుమారు పాతిక మంది రైతులు 300 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు.
రిటైర్డ్ ఐసిఏఆర్ ఉద్యోగుల సంఘం సి.హెచ్. రవీందర్‌రెడ్డి బెస్ట్ ఫార్మర్ అవార్డుతో సతీశ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో సత్కరించటం విశేషం. కొబ్బరి తోటలో ఐదంచెల అంతర పంటలను ఆయన సాగు చేస్తున్నారు. మొదటి లేయర్‌గా 27“27 అడుగులకు కొబ్బరి, రెండో లేయర్‌గా కొబ్బరి చెట్ల మధ్యలో 13.5“10 అడుగులలో కోకో సాగు చేస్తున్నారు. మూడో లేయర్‌లో 7“7 అడుగులలో వక్క మొక్కలు వేశారు. నాలుగో లేయర్‌లో వక్క మొక్కలకు మిరియాలు పాకిస్తున్నారు. ఐడో లేయర్ గా ఎండ పడే చోట ఫైనాపిల్ మొక్కలు నాటారు. కొబ్బరి మొక్కలు లేని చోట్ల జాజికాయ మొక్కలు నాటారు.
ప్రతి 10 రోజులకు జీవామృతం డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. పిచికారీ కోసం టైప్ 2 సూపర్ జీవా మృతం వాడుతున్నారు. సాధారణంగా జీవామృతం తయారీకి ప్రతి సారీ ఆవు పేడ, మూత్రం అవసరం ఉంటుంది. అయితే, టైప్ 2 జీవామృతం తయారీకి ఒకసారి పేడ, మూత్రం వాడితే చాలు, ఆ తర్వాత 6 నెలల వరకు ఆ అవశేషాలకు 200 లీటర్ల నీటికి లీటరు జీవన ఎరువులతో పాటు బెల్లం జోడిస్తూ మళ్లీ మళ్లీ జీవామృతాన్ని తయారు చేసుకొని వాడటం వల్ల అదే ఫలితాలు వస్తున్నాయన్నారు. జీవామృతం వడపోతకు తాను రూపొందించిన ఆటోమేటిక్ ఫిల్టర్ సిస్టమ్‌ను మరో 20 మంది రైతులు 200 ఎకరాల తోటల్లో వాడుతున్నారని సతీశ్ (90107 42459) తెలిపారు.
బైక్ ట్రాలీ ఖర్చు రూ. పది వేలు
ద్విచక్ర మోటారు వాహనానికి వెనుక కట్టుకొని బరువులు లాక్కెళ్లేందుకు వీలుగా ఐదేళ్ల క్రితం సతీశ్ బైక్ ట్రాలీని సొంత ఆలోచనతో తయారు చేయించుకొని వినియోగిస్తున్నారు. ఎరువులు వేయటం వంటి పనులకు ఎకరానికి 8–10 మంది కూలీలు అవసరమవుతారని బైక్ ట్రాలీ ఉండటం మూలాన ఇద్దరు కూలీలతోనే వేగంగా పని పూర్తవుతోందని సతీశ్ తెలిపారు.
బైక్ ఇంజన్‌తోనే జీవామృతం, పంచగవ్య, ఇతర ద్రావణాలు, కషాయాలను సైతం సులువుగా పిచికారీ చేయగలుగుతున్నానని తెలిపారు. బైక్ ట్రాలీ తయారీకి రూ. పది వేలు ఖర్చయ్యిందని, ఈ ఐదేళ్లలో దాని ద్వారా దాదాపు రూ. 2 లక్షల వరకు డబ్బు ఆదా అయ్యిందన్నారు. దీని ద్వారా ప్రకృతి వ్యవసాయం సులువు కావటం వల్ల ఇతర రైతులు సైతం స్ఫూర్తిని పొందుతున్నారన్నారు. తనను చూసి పాతిక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టారన్నారు.
జీవామృతాన్ని ఫిల్టర్ చేయటం, పిచికారీ చేయటం వంటి పనుల్లో కూడా మనుషుల ప్రమేయం తగ్గించే ఫిల్టర్ వ్యవస్థను నిర్మించటం వల్ల వడకట్టే పని సులువైపోయిందని, పిచికారీ చప్పున పూర్తవుతోందన్నారు. బైక్ స్ప్రేయర్ ద్వారా ఎకరంలో అర గంటలోనే పిచికారీ పూర్తవుతోందన్నారు. టైప్ 2 సూపర్ జీవామృతం తయారీ పద్ధతి రైతులకు వెసులుబాటుగా ఉందన్నారు.
సేంద్రియ సాగుపై రైతు సదస్సులు
‘నాబార్డు’ సహకారంతో ‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో సేంద్రియ సాగు పద్ధతులు, కషాయాలు/ ద్రావణాల తయారీ, విలువ జోడింపుపై తెలంగాణలో రైతులకు అవగాహన సదస్సులు జరగనున్నాయి. 9న కరీంనగర్ జిల్లా చొప్పదండి మం., పెద్దకురుంపల్లిలోని మల్లిఖార్జున రెడ్డి తోటలో, 10న జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లోని ఎడమల మల్లారెడ్డి తోటలో, 11న పెద్దపల్లి జిల్లా రామగిరి మం., కల్వచర్లలోని యాదగిరి శ్రీనివాస్ తోటలో (ఉ.10 గం.–సా. 4 గం.) సదస్సులు జరుగుతాయి. పాల్గొనదలచిన రైతులు తప్పనిసరిగా ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు.. 70939 73999 (వెంకట్‌రెడ్డి). అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.
Comments
Please login to add a commentAdd a comment