Labor charges
-
10 ఏళ్లుగా వ్యవసాయం..బైక్ ట్రాలీ వాడకంతో తగ్గిన కూలీల ఖర్చు
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన జుజ్జవరపు సతీశ్ గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కొబ్బరి తోటలో ఐదంచెల సాగు ద్వారా ఎకరానికి ఏటా రూ.1,05,000 నికరాదాయం పొందుతున్నారు. మోటార్ బైక్‌తో నడిచే ట్రాలీని, బైక్‌తో నడిచే స్ప్రేయర్‌ను తానే తయారు చేయించుకోవటం ద్వారా కూలీల ఖర్చును భారీగా తగ్గించుకోవటం ఆయన ప్రత్యేకత. రైతుసాధికార సంస్థలో మాస్టర్ ట్రైనర్‌గా పనిచేస్తూ ఇతర రైతులకు మార్గదర్శకుడిగా మారారు. ఆయన స్ఫూర్తితో కురుకూరు గ్రామానికి చెందిన సుమారు పాతిక మంది రైతులు 300 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. రిటైర్డ్ ఐసిఏఆర్ ఉద్యోగుల సంఘం సి.హెచ్. రవీందర్‌రెడ్డి బెస్ట్ ఫార్మర్ అవార్డుతో సతీశ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో సత్కరించటం విశేషం. కొబ్బరి తోటలో ఐదంచెల అంతర పంటలను ఆయన సాగు చేస్తున్నారు. మొదటి లేయర్‌గా 27“27 అడుగులకు కొబ్బరి, రెండో లేయర్‌గా కొబ్బరి చెట్ల మధ్యలో 13.5“10 అడుగులలో కోకో సాగు చేస్తున్నారు. మూడో లేయర్లో 7“7 అడుగులలో వక్క మొక్కలు వేశారు. నాలుగో లేయర్లో వక్క మొక్కలకు మిరియాలు పాకిస్తున్నారు. ఐడో లేయర్ గా ఎండ పడే చోట ఫైనాపిల్ మొక్కలు నాటారు. కొబ్బరి మొక్కలు లేని చోట్ల జాజికాయ మొక్కలు నాటారు. ప్రతి 10 రోజులకు జీవామృతం డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. పిచికారీ కోసం టైప్ 2 సూపర్ జీవా మృతం వాడుతున్నారు. సాధారణంగా జీవామృతం తయారీకి ప్రతి సారీ ఆవు పేడ, మూత్రం అవసరం ఉంటుంది. అయితే, టైప్ 2 జీవామృతం తయారీకి ఒకసారి పేడ, మూత్రం వాడితే చాలు, ఆ తర్వాత 6 నెలల వరకు ఆ అవశేషాలకు 200 లీటర్ల నీటికి లీటరు జీవన ఎరువులతో పాటు బెల్లం జోడిస్తూ మళ్లీ మళ్లీ జీవామృతాన్ని తయారు చేసుకొని వాడటం వల్ల అదే ఫలితాలు వస్తున్నాయన్నారు. జీవామృతం వడపోతకు తాను రూపొందించిన ఆటోమేటిక్ ఫిల్టర్ సిస్టమ్‌ను మరో 20 మంది రైతులు 200 ఎకరాల తోటల్లో వాడుతున్నారని సతీశ్ (90107 42459) తెలిపారు. బైక్ ట్రాలీ ఖర్చు రూ. పది వేలు ద్విచక్ర మోటారు వాహనానికి వెనుక కట్టుకొని బరువులు లాక్కెళ్లేందుకు వీలుగా ఐదేళ్ల క్రితం సతీశ్ బైక్ ట్రాలీని సొంత ఆలోచనతో తయారు చేయించుకొని వినియోగిస్తున్నారు. ఎరువులు వేయటం వంటి పనులకు ఎకరానికి 8–10 మంది కూలీలు అవసరమవుతారని బైక్ ట్రాలీ ఉండటం మూలాన ఇద్దరు కూలీలతోనే వేగంగా పని పూర్తవుతోందని సతీశ్ తెలిపారు. బైక్ ఇంజన్‌తోనే జీవామృతం, పంచగవ్య, ఇతర ద్రావణాలు, కషాయాలను సైతం సులువుగా పిచికారీ చేయగలుగుతున్నానని తెలిపారు. బైక్ ట్రాలీ తయారీకి రూ. పది వేలు ఖర్చయ్యిందని, ఈ ఐదేళ్లలో దాని ద్వారా దాదాపు రూ. 2 లక్షల వరకు డబ్బు ఆదా అయ్యిందన్నారు. దీని ద్వారా ప్రకృతి వ్యవసాయం సులువు కావటం వల్ల ఇతర రైతులు సైతం స్ఫూర్తిని పొందుతున్నారన్నారు. తనను చూసి పాతిక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టారన్నారు. జీవామృతాన్ని ఫిల్టర్ చేయటం, పిచికారీ చేయటం వంటి పనుల్లో కూడా మనుషుల ప్రమేయం తగ్గించే ఫిల్టర్ వ్యవస్థను నిర్మించటం వల్ల వడకట్టే పని సులువైపోయిందని, పిచికారీ చప్పున పూర్తవుతోందన్నారు. బైక్ స్ప్రేయర్ ద్వారా ఎకరంలో అర గంటలోనే పిచికారీ పూర్తవుతోందన్నారు. టైప్ 2 సూపర్ జీవామృతం తయారీ పద్ధతి రైతులకు వెసులుబాటుగా ఉందన్నారు. సేంద్రియ సాగుపై రైతు సదస్సులు ‘నాబార్డు’ సహకారంతో ‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో సేంద్రియ సాగు పద్ధతులు, కషాయాలు/ ద్రావణాల తయారీ, విలువ జోడింపుపై తెలంగాణలో రైతులకు అవగాహన సదస్సులు జరగనున్నాయి. 9న కరీంనగర్ జిల్లా చొప్పదండి మం., పెద్దకురుంపల్లిలోని మల్లిఖార్జున రెడ్డి తోటలో, 10న జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లోని ఎడమల మల్లారెడ్డి తోటలో, 11న పెద్దపల్లి జిల్లా రామగిరి మం., కల్వచర్లలోని యాదగిరి శ్రీనివాస్ తోటలో (ఉ.10 గం.–సా. 4 గం.) సదస్సులు జరుగుతాయి. పాల్గొనదలచిన రైతులు తప్పనిసరిగా ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు.. 70939 73999 (వెంకట్‌రెడ్డి). అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. -
కూలీ నంబర్ 1
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ప్రాజెక్ట్ హీరో యాప్‌లో 5 లక్షల మంది వర్కర్లు నమోదై ఉండగా.. ఇందులో హైదరాబాద్ నుంచి 12,285 మంది ఉన్నారు. యాప్‌లో రిజిస్టరైన 1.4 లక్షల ఉద్యోగ పోస్టింగ్‌లు, వాటి వినియోగ డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. కరోనా కంటే ముందుతో పోలిస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిర్మాణ కూలీ 5 నుంచి 8% పెరిగితే.. హైదరాబాద్‌లో ఏకంగా 20% వృద్ధి చెందింది. నగరంలో పెద్ద ఎత్తున వాణిజ్య, ఆకాశహర్మ్యాల నిర్మాణాలు జరుగుతుండటం అత్యధిక కూలీ చెల్లింపులకు కారణం. పీఎఫ్, ఈఎస్ఐలు దక్కడం లేదు.. దేశంలోని ప్రధాన నగరాలలో ప్రభుత్వం నిర్ధేశించిన దినసరి కూలీ దక్కడం లేదని ప్రాజెక్ట్ హీరో ఫౌండర్ అండ్ సీఈఓ సత్యవ్యాస్ తెలిపారు. కేవలం 8.6 శాతం మంది కూలీలకు మాత్రమే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), 7.1% మందికి ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) కవరేజ్‌లు అందుతున్నాయని పేర్కొన్నారు. యూపీ నుంచే వలసలెక్కువ.. ప్రస్తుతం దేశంలో 5.1 కోట్ల మంది నిర్మాణ కూలీలు ఉన్నారు. అత్యధికంగా కూలీలు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వలస వస్తున్నారు. ఇక్కడి నుంచి 42% మంది దేశంలోని వివిధ నగరాల్లోని నిర్మాణ రంగంలో పనిచేసేందుకు వస్తున్నారు. బిహార్ నుంచి 16%, పశ్చిమ బెంగాల్ నుంచి 10%, ఒడిశా నుంచి 9%, మహారాష్ట్ర నుంచి 6% కూలీలు వలస వస్తున్నారు. కరోనా తొలి దశలో నిర్మాణ రంగ కార్మికుల వెతలు, వలసలు ఇంకా కళ్లముందే కదలాడుతున్నాయి. క్రమంగా నిర్మాణ రంగం పుంజుకోవటంతో ఇప్పుడిప్పుడే కూలీలు గాడినపడుతున్నారు. ఈ విషయంలో దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ బెటరనే చెప్పాలి. ఎందుకంటే కూలీలకు దినసరి వేతనాలు అందుతుంది ఇక్కడే కాబట్టి! నగరంలో భవన నిర్మాణ కార్మికులకు రోజుకు సగటున రూ.584 నుంచి రూ.1,035 మధ్య కూలీ గిట్టుతుంది. చిట్ట చివరి స్థానంలో నిలిచిన ఢిల్లీ–ఎన్సీఆర్లో రూ.515 నుంచి 925 మధ్య మాత్రమేనని కన్స్ట్రక్షన్ టెక్నాలజీ యాప్ ప్రాజెక్ట్ హీరో అధ్యయనంలో వెల్లడైంది. సమయానికి వేతనాలు చెల్లిస్తేనే.. గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయడానికే నగర డెవలపర్లు ప్రాధాన్యం ఇస్తారు. అలా చేయాలంటే కూలీలకు, ఉద్యోగస్తులకు సమయానికి వేతనం చెల్లించాల్సి ఉంటుంది. కరోనా తొలి దశలో దేశవ్యాప్తంగా నిర్మాణ పనులు నిలిచిపోవటంతో లక్షలాది ని ర్మాణ కూలీలు పొట్టచేత పట్టు కొని సొంతూళ్లకు వెళ్లిపోయా రు. ఆ సమయంలో మా అన్ని ప్రాజెక్ట్‌లలోని 3 వేల మంది కూలీలను సుమారు 3 నెలల పాటు ఆహారం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తదితర అవసరాలను సొంతంగా ఏర్పాటు చేశాం. – నరేంద్రకుమార్ కామరాజు, ఎండీ, ప్రణీత్ గ్రూప్ -
చెట్లకు పాదులు చకచకా!
పండ్ల చెట్లకు పాదులు చేయటం అధిక శ్రమ, ఖర్చుతో కూడిన పని. చెట్ల చుట్టూ మట్టి కట్టలు వేసి పాదులు చేయటానికి ఎకరానికి ఐదుగురు కూలీలు అవసరమవుతారు. కూలీల కొరత కారణంగా సమస్య తీవ్రంగా ఉండటంతో విస్తారంగా పండ్ల తోటలు సాగు చేసే రైతులు తమ తోటల్లో చెట్లకు పాదులు చేయించడానికి చాలా రోజుల సమయం పడుతూ ఉంటుంది. అయితే, గుంటూరు జిల్లాలో బత్తాయి సాగు చేస్తున్న ఓ వైద్యుడు చక్కటి ఆవిష్కరణతో ఈ సమస్యకు ఎంతో సులువైన పరిష్కారాన్ని కనుగొన్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన డాక్టర్ యరగూటి సాంబశివారెడ్డి వృత్తి రీత్యా వైద్యులు. గుంటూరు నగరం అరండల్‌పేటలోని సాయి భాస్కర ఆసుపత్రి సీఈవోగా ఉన్నారు. నకరికల్లు మండలం చేజర్ల గ్రామ పరిధిలో 12 ఎకరాల్లో ఐదేళ్ల వయసు బత్తాయి తోట ఉంది. వీరి తోటలో 20 అడుగులకు ఒక చెట్టు చొప్పున 1300 చెట్లు ఉన్నాయి. అయితే, ప్రతి ఏటా చెట్లు మొదలు చుట్టూతా కూలీలతో పాదులు చేయిస్తూ ఉంటారు. ఎకరానికి 5గురు కూలీలు అవసరం అవుతారు. కూలీల కొరత వేధిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి రోజుకు రూ. 900 నుంచి వెయ్యి వరకు చెల్లించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బత్తాయి తోటలో చెట్లన్నిటికీ పాదులు చేయించడం అంటే అది అంత తేలిగ్గా అయ్యేపని కాకుండా పోయింది. ఖర్చుకు ఖర్చే కాకుండా ఈ పనుల పర్యవేక్షణ కోసం చాలా రోజుల సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. గొర్రుతో సాలు, ఇరవాలు వేస్తే చాలు డా. సాంబశివారెడ్డి ఇటీవల తమ బత్తాయి తోటలో పాదులు చేయించే సమయంలో కూలీల కొరత సమస్యను అధిగమించడానికి గొర్రుతో ఏదైనా ప్రయత్నం చేయవచ్చా అని ఆలోచన చేశారు. ఒకటి, రెండు విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలోనే చక్కటి పరిష్కారం దొరకటంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. తన తోటలో ట్రాక్టర్ ద్వారా అంతరసేద్యం చేయడానికి ఉపయోగించే ఇనుప గొర్రుకు స్థానికంగా ఉన్న వెల్డింగ్ షాపు వారి తోడ్పాటుతో స్వల్ప మార్పు చేయించారు. గొర్రు కుడి వైపున, రెండు వరుసల్లో ఉన్న రెండు గొర్రు పాయింట్లను కలుపుతూ.. 2 ఎం.ఎం. మందం ఉన్న రేకును.. ఏటవాలుగా వెల్డింగ్ చేయించారు. ఇంట్లో వృథాగా ఉన్న అడుగున్నర వెడల్పు, రెండు అడుగుల పొడవు ఉన్న రేకును ఇలా వినియోగించారు. ఆ రేకు పటిష్టంగా ఉంటే మన్నిక బాగుంటుందన్న భావనతో దాని కింది భాగాన రెండు అంగుళాల ఇనుప బద్దను వెల్డింగ్ చేయించారు. ఈ రేకును మరింత ఏటవాలుగా అమర్చడం కోసం గొర్రుకు ముందు వరుస పైన ఉండే సాడీని కొంచెం లోపలికి జరిపారు. ఆ తర్వాత గొర్రును ట్రాక్టర్‌కు అనుసంధానం చేసి.. బత్తాయి తోటలో చెట్ల మధ్య సాలు, ఇరవాలు వేశారు. అంతే.. చెట్లకు నలువైపులా మట్టికట్టలతో కూడిన పాదులు ఏర్పడ్డాయి. వర్షపు నీరు చక్కగా ఇంకిపోయేలా కట్టలు తగినంత ఎత్తున ఏర్పడ్డాయి. ఒకే ఒక్క రోజులో కేవలం రూ. 500 ఖర్చుతో రేకును గొర్రుకు అమర్చడంతో ఈ ఆవిష్కరణ జరిగిందని డా. సాంబశివారెడ్డి సంతోషంగా తెలిపారు. తమ తోటలో ఒకే ఒక్క రోజులో ఎంతో సులువుగా, అతి తక్కువ ఖర్చుతో బత్తాయి చెట్లకు పాదులు చేయటం పూర్తయిందన్నారు. పాదులు చేయటం పూర్తయిన తర్వాత.. గొర్రులోని రెండు పాయింట్లకు వెల్డింగ్ చేసిన ఈ రేకును ఆ పాయింట్లతో పాటు ఊడదీసి దాచి పెట్టుకోవచ్చు. రూ. 200 ఖర్చుతో రెండు పాయింట్లు తెచ్చి గొర్రుకు అమర్చుకుంటే గొర్రును మామూలుగా ఉపయోగించుకోవచ్చు అన్నారాయన. బాగా ముదురు తోటల్లో పెద్ద ట్రాక్టర్ నడవని పరిస్థితి ఉంటే.. చిన్న ట్రాక్టర్‌కు ఉండే గొర్రుకు కూడా ఈ విధంగా రేకును అమర్చి.. ఏ పండ్ల చెట్ల చుట్టూతా అయినా పాదులు చేసుకోవచ్చని డా. సాంబశివారెడ్డి (83339 79899) ‘సాక్షి’తో చెప్పారు. -
కరెంట్ తీగను మింగేశారు!
లైన్ మార్చకుండానే.. మార్చినట్లు రికార్డు ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల చేతివాటం ఎన్పీడీసీఎల్ సొమ్ము దుర్వినియోగం హన్మకొండ : కాంట్రాక్టర్ల లాభాపేక్ష, అధికారుల అక్రమార్జన వెరసి.. అటు వినియోగదారులు, ఇటు ఎన్పీడీసీఎల్ సంస్థకు నష్టం జరుగుతోంది. కొత్తగా విద్యుత్ లైన్ల నిర్మాణం, పాత లైన్ల మార్పు, లూజ్ లైన్లను సరిచేసేందుకు మిడిల్ పోల్స్ ఏర్పాటు, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు తదితర పనులను ఎన్పీడీసీఎల్ కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తోంది. అయితే, ఈ పనుల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా.. ఎన్పీడీసీఎల్లోని ఇంజనీర్లు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇక ఎంతో కొంత చేసిన పనిలో నాణ్యత లోపించ డం వంటి అంశాలను పక్కన పెడితే.. అసలు పనే చేయకున్నా చేసినట్లు సామగ్రి తీసుకుని, లేబర్ చార్జీలు విడిపించుకున్న ఘటన ఒకటి వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లైన్ మార్చేందుకు నాలుగేళ్లు... హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌లో బూర నరేందర్‌కు వెంకటరమణ ఆటో గ్యాస్ పేరు తో ఆటో గ్యాస్ డీలర్షిప్(బంక్) మంజూ రైంది. ఆయన బంక్ మంజూరు చేయాలనుకున్న స్థలంలో విద్యుత్ లైను ఉండగా.. దాన్ని మారిస్తేనే బంక్ ఏర్పాటుకు అనుమతిస్తామని సంబంధిత కంపెనీ స్పష్టం చేసింది. దీంతో లైన్ మార్చడానికి అయ్యే ఖర్చులు రూ.34 వేలను డీడీ ద్వారా 2011 ఏప్రిల్‌లో ఎన్పీడీసీఎల్కు చెల్లించారు. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు విద్యుత్ లైన్ మార్చకపోవడంతో విసిగిపోయిన నరేందర్.. లైన్ మార్చకపోవడంతో తన గ్యాస్ డీలర్ షిప్ రద్దయ్యే ప్రమాదముం దని, దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకువెళ్లారు. దీంతో రంగంలోని దిగిన ఓ ఉన్నతాధికారి విచారణ జరపగా విస్తుపోయే నిజం బయటపడింది. ఎల్లాపూర్‌లో విద్యుత్ లైన్ మార్చేందుకు మూడు విద్యుత్ స్తంభాలు, దీనికి సరిపడా విద్యుత్ వైర్‌ను స్టోర్ నుంచి డ్రా చేయడమే కాక, మెటీరియల్ తరలింపు, లైన్ మార్చేందుకు లేబర్ చార్జీల కింద రూ.7వేలు 2012 నవంబర్‌లో డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉండడాన్ని ఆయన గుర్తించారు. అసలు లైనే మార్చనప్పుడు మెటీరియల్, లేబర్ చార్జీలు ఎవరికి చెల్లించారంటూ ఆయన ఆరా తీయగా.. చింతగట్టులో గతంలో పని చేసి ప్రస్తుతం కన్స్ట్రక్షన్కు బదిలీ అయిన ఎన్పీడీసీఎల్ ఏఈ దీనికి బాధ్యుడిగా తేలింది. ఈ మేరకు సదరు ఏఈపై చర్యలు తీసుకోవాలని విచారణ అధికారి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం. అయితే, సదరు ఏఈపై మరికొన్ని ఆరోపణలు ఉన్నాయని, పూర్తిస్థాయిలో తనిఖీలో చేస్తే అవి బయటపడతాయని సంస్థలోని కొందరు అధికారులే చెబుతుండడం గమనార్హం. కాగా, ఎల్లాపూర్‌లో లైన్ మార్పు కోసం తీసుకువెళ్లిన సామగ్రిని ఆ ఏఈ ఏం చేశాడనేది తేలాల్సి ఉంది. ఇక.. డీడీ చెల్లించిన నాలుగేళ్లయినా లైన్ చెల్లించని ఎన్పీడీసీఎల్ సంస్థపై ఆటో గ్యాస్ డీలర్ న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు అధికారులు రంగంలోకి దిగి దిద్దుబాటు చేస్తూనే డీలర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.