Trolley
-
10 ఏళ్లుగా వ్యవసాయం..బైక్ ట్రాలీ వాడకంతో తగ్గిన కూలీల ఖర్చు
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన జుజ్జవరపు సతీశ్ గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కొబ్బరి తోటలో ఐదంచెల సాగు ద్వారా ఎకరానికి ఏటా రూ.1,05,000 నికరాదాయం పొందుతున్నారు. మోటార్ బైక్‌తో నడిచే ట్రాలీని, బైక్‌తో నడిచే స్ప్రేయర్‌ను తానే తయారు చేయించుకోవటం ద్వారా కూలీల ఖర్చును భారీగా తగ్గించుకోవటం ఆయన ప్రత్యేకత. రైతుసాధికార సంస్థలో మాస్టర్ ట్రైనర్‌గా పనిచేస్తూ ఇతర రైతులకు మార్గదర్శకుడిగా మారారు. ఆయన స్ఫూర్తితో కురుకూరు గ్రామానికి చెందిన సుమారు పాతిక మంది రైతులు 300 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. రిటైర్డ్ ఐసిఏఆర్ ఉద్యోగుల సంఘం సి.హెచ్. రవీందర్‌రెడ్డి బెస్ట్ ఫార్మర్ అవార్డుతో సతీశ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో సత్కరించటం విశేషం. కొబ్బరి తోటలో ఐదంచెల అంతర పంటలను ఆయన సాగు చేస్తున్నారు. మొదటి లేయర్‌గా 27“27 అడుగులకు కొబ్బరి, రెండో లేయర్‌గా కొబ్బరి చెట్ల మధ్యలో 13.5“10 అడుగులలో కోకో సాగు చేస్తున్నారు. మూడో లేయర్లో 7“7 అడుగులలో వక్క మొక్కలు వేశారు. నాలుగో లేయర్లో వక్క మొక్కలకు మిరియాలు పాకిస్తున్నారు. ఐడో లేయర్ గా ఎండ పడే చోట ఫైనాపిల్ మొక్కలు నాటారు. కొబ్బరి మొక్కలు లేని చోట్ల జాజికాయ మొక్కలు నాటారు. ప్రతి 10 రోజులకు జీవామృతం డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. పిచికారీ కోసం టైప్ 2 సూపర్ జీవా మృతం వాడుతున్నారు. సాధారణంగా జీవామృతం తయారీకి ప్రతి సారీ ఆవు పేడ, మూత్రం అవసరం ఉంటుంది. అయితే, టైప్ 2 జీవామృతం తయారీకి ఒకసారి పేడ, మూత్రం వాడితే చాలు, ఆ తర్వాత 6 నెలల వరకు ఆ అవశేషాలకు 200 లీటర్ల నీటికి లీటరు జీవన ఎరువులతో పాటు బెల్లం జోడిస్తూ మళ్లీ మళ్లీ జీవామృతాన్ని తయారు చేసుకొని వాడటం వల్ల అదే ఫలితాలు వస్తున్నాయన్నారు. జీవామృతం వడపోతకు తాను రూపొందించిన ఆటోమేటిక్ ఫిల్టర్ సిస్టమ్‌ను మరో 20 మంది రైతులు 200 ఎకరాల తోటల్లో వాడుతున్నారని సతీశ్ (90107 42459) తెలిపారు. బైక్ ట్రాలీ ఖర్చు రూ. పది వేలు ద్విచక్ర మోటారు వాహనానికి వెనుక కట్టుకొని బరువులు లాక్కెళ్లేందుకు వీలుగా ఐదేళ్ల క్రితం సతీశ్ బైక్ ట్రాలీని సొంత ఆలోచనతో తయారు చేయించుకొని వినియోగిస్తున్నారు. ఎరువులు వేయటం వంటి పనులకు ఎకరానికి 8–10 మంది కూలీలు అవసరమవుతారని బైక్ ట్రాలీ ఉండటం మూలాన ఇద్దరు కూలీలతోనే వేగంగా పని పూర్తవుతోందని సతీశ్ తెలిపారు. బైక్ ఇంజన్‌తోనే జీవామృతం, పంచగవ్య, ఇతర ద్రావణాలు, కషాయాలను సైతం సులువుగా పిచికారీ చేయగలుగుతున్నానని తెలిపారు. బైక్ ట్రాలీ తయారీకి రూ. పది వేలు ఖర్చయ్యిందని, ఈ ఐదేళ్లలో దాని ద్వారా దాదాపు రూ. 2 లక్షల వరకు డబ్బు ఆదా అయ్యిందన్నారు. దీని ద్వారా ప్రకృతి వ్యవసాయం సులువు కావటం వల్ల ఇతర రైతులు సైతం స్ఫూర్తిని పొందుతున్నారన్నారు. తనను చూసి పాతిక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టారన్నారు. జీవామృతాన్ని ఫిల్టర్ చేయటం, పిచికారీ చేయటం వంటి పనుల్లో కూడా మనుషుల ప్రమేయం తగ్గించే ఫిల్టర్ వ్యవస్థను నిర్మించటం వల్ల వడకట్టే పని సులువైపోయిందని, పిచికారీ చప్పున పూర్తవుతోందన్నారు. బైక్ స్ప్రేయర్ ద్వారా ఎకరంలో అర గంటలోనే పిచికారీ పూర్తవుతోందన్నారు. టైప్ 2 సూపర్ జీవామృతం తయారీ పద్ధతి రైతులకు వెసులుబాటుగా ఉందన్నారు. సేంద్రియ సాగుపై రైతు సదస్సులు ‘నాబార్డు’ సహకారంతో ‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో సేంద్రియ సాగు పద్ధతులు, కషాయాలు/ ద్రావణాల తయారీ, విలువ జోడింపుపై తెలంగాణలో రైతులకు అవగాహన సదస్సులు జరగనున్నాయి. 9న కరీంనగర్ జిల్లా చొప్పదండి మం., పెద్దకురుంపల్లిలోని మల్లిఖార్జున రెడ్డి తోటలో, 10న జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లోని ఎడమల మల్లారెడ్డి తోటలో, 11న పెద్దపల్లి జిల్లా రామగిరి మం., కల్వచర్లలోని యాదగిరి శ్రీనివాస్ తోటలో (ఉ.10 గం.–సా. 4 గం.) సదస్సులు జరుగుతాయి. పాల్గొనదలచిన రైతులు తప్పనిసరిగా ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు.. 70939 73999 (వెంకట్‌రెడ్డి). అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. -
కురమయ్య.. నీ ఆలోచన బాగుందయ్యా!
మద్దిపాడు: గొర్రెల కాపరికి తన జీవాలంటే ప్రాణం. వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే కదా! తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం, చింతగుంట గ్రామానికి చెందిన కురమయ్య సుమారు వెయ్యి గొర్రెల మందకు కాపరి. అన్ని జీవాలకు మేత కావాలి కదా! అందుకే వాటిని మేపుకుంటూ ప్రస్తుతం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి, గుండ్లాపల్లి పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు. ఇతనితో పాటు మరో ముగ్గురు కూడా మందకు రక్షణగా ఉంటారు. ఇంత పెద్ద సమూహంలో పిల్లలు పుట్టడం సహజమే. అయితే అవి నడవలేవు కాబట్టి వాటి కోసం బాడుగ వాహనం కావాలి. అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో కురమయ్యకు ఓ ఐడియా వచ్చింది. చిలకలూరిపేటలో ఓ ఆటోమొబైల్ గ్యారేజీకి వెళ్లి 38వేల రూపాయలు ఖర్చు చేసి ఇనుప గ్రిల్స్‌తో ట్రాలీ తయారు చేయించాడు. దానిని తన ద్విచక్రవాహనానికి అమర్చడంతో ట్రాలీ వాహనంలా మారిపోయింది. ప్రస్తుతం 60 మేక పిల్లలను ఎంత దూరమైనా సులువుగా తీసుకువెళుతున్నామని దీనివలన ఖర్చు తగ్గిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. (క్లిక్ చేయండి: సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం) -
ట్రాలీ బ్యాగులో ప్రేయసిని కుక్కేసి.. అడ్డంగా దొరికిపోయాడు
ప్రేయసితో తన గదిలో రాత్రంతా సరదాగా గడపాలన్న ఓ కుర్రాడి ప్రయత్నం బెడిసి కొట్టింది. మాస్టర్ ప్లాన్ వేసి గర్ల్‌ఫ్రెండ్‌ను రూమ్‌కి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. కాస్తుంటే.. గదికి చేరుకునేవాడే. ఇంతలో.. కర్ణాటక మణిపాల్ హాస్టల్లో మంగళవారం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి.. అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థినితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆమెను తన గదికి తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు. ఓ పెద్ద ట్రాలీ బ్యాగులో ఆమెను కుక్కేసి.. హాస్టల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏం ఎరగనట్లు వెళ్తున్న అతనిపై హాస్టల్ వార్డెన్‌కు అనుమానం వచ్చింది. అంతపెద్ద లగేజ్ ఏంటని ప్రశ్నించాడు. దీంతో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులు అంకుల్.. అంటూ తడబడుతూ సమాధానం ఇచ్చాడు ఆ కుర్రాడు.దాంతో ఆ వార్డెన్ అనుమానం మరింత బలపడింది. బ్యాగ్ ఓపెన్ చేయాలని కోరడంతో.. పగిలిపోయే ఐటెమ్స్ ఉన్నాయని, వద్దని రిక్వెస్ట్ చేశాడు. అయినా కుదరదని బలవంతంగా ఆ ట్రాలీ బ్యాగ్ జిప్ ఓపెన్ చేయడంతో.. అందులోంచి ఆ కుర్రాడి గర్ల్‌ఫ్రెండ్ బయటకు వచ్చింది. ఆపై గట్టిగా ప్రశ్నించడంతో హాస్టల్లో గడిపేందుకు తీసుకొచ్చానని నిజం ఒప్పుకున్నాడు. ఈ ఇద్దరూ ఒకే కాలేజ్ స్టూడెంట్స్ కావడంతో సస్పెండ్ చేసి..ఇళ్లకు పంపించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ టైంలో మంగళూరుకు చెందిన ఓ స్టూడెంట్.. తన ఫ్రెండ్‌ను ఇదే తరహాలో అపార్ట్‌మెంట్‌కు తెచ్చుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మణిపాల్‌కు సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది Manipal Academy of Higher Education. The funniest video I've seen today 😬 Apparently, a Manipal Univ. student was smuggling his gf out in a trolley bag. Someone's watching too much Netflix. pic.twitter.com/RQLkAfj9vB — 𝙋𝙧𝙚𝙧𝙣𝙖 𝙇𝙞𝙙𝙝𝙤𝙤 (@PLidhoo) February 2, 2022 -
వజ్రాల గాజు మిస్సింగ్.. వెలకట్టలేని నిజాయతీ
బెంగళూరు: రోడ్డుపై వంద రూపాయలు దొరికితే జేబులో వేసుకునేవారు కొందరైతే, ఎవరో పడేసుకున్నారని వెతికి సొంతదారుకు ఇచ్చేవారు మరికొందరు. వజ్రాలు పొదిగిన చేతి గాజు దొరికితే ఒక కార్మికుడు ఎంతో నిజాయతీగా యజమానికి ఇచ్చేసిన సంఘటన మంగళూరు ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విమానంలో మంగళూరుకు బంధువుల ఇంటికి వచ్చిన మహిళ ఒక చేతికున్న వజ్రాల గాజును పోగొట్టుకుంది. అష్రఫ్ మొయిద్దీన్ అనే ట్రాలీ కూలీకి దొరకడంతో దానిని అధికారులకు ఇచ్చాడు. కొంతసేపటికి బాధిత మహిళ ఎయిర్‌పోర్టుకు ఫోన్ చేసి గాజు పోయిన విషయం చెప్పింది. వెంటనే ఆమెను పిలిపించి అష్రఫ్ చేతనే గాజును అందజేశారు. -
Scooter Trolley: ఐడియా అదిరింది
రోజువారీ రవాణా ఖర్చులు పెరుగుతుండటంతో ఈ యువ రైతు కొత్తగా ఆలోచించాడు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నాగల్‌కడ్మూర్‌కు చెందిన జానకి రాంరెడ్డి తమకున్న ఆరెకరాల పొలంలో బొప్పాయి తోటను సాగు చేశాడు. ఈ పండ్లను అమ్మడానికి అమరచింత, ఆత్మకూర్‌కు రావడానికి ఆటోకు రోజుకు రూ.600 చెల్లించేవాడు. ఇది భారంగా మారింది. అతను స్వతహాగా బైక్ మెకానిక్ కావడంతో దాన్నుంచి బయటపడే ఆలోచన చేశాడు. స్కూటర్‌కు ట్రాలీని జతపరిచాడు. తన భార్యతో కలిసి బొప్పాయిలను విక్రయిస్తున్నాడు. – అమరచింత పరుగో పరుగు జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో భవానీమాత జాతర సందర్భంగా ఆదివారం నిర్వహించిన శునకాల పరుగుపందెం పోటీలు ఆకట్టుకున్నాయి. మొదటి బహుమతిని గద్వాలకు చెందిన శునకం దక్కించుకుంది. – గద్వాల (గట్టు) చిలుకమ్మ పలికింది.. విజయవాడ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన డాగ్ షోలో రెండు చిలుకలు సందడి చేశాయి. ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన తోకటూ(తెల్ల రంగులో ఉన్నది), అమెరికా నుంచి తెచ్చిన మకావ్ చిలుకలు సందర్శకుల మాటలకు బదులిస్తూ వారిని ఆశ్చర్యచకితులను చేశాయి. దీంతో డాగ్‌షోకు వచ్చిన పలువురు ఈ చిలుకలతో సరదాగా మాట కలిపి ఆనందంలో మునిగితేలారు. – సాక్షి, విజయవాడ -
చిన్న కోరిక...పెద్ద మనసు!
నిత్యామీనన్ది భిన్నమైన మనస్తత్వం. ఈ కారణంగానే పలు సందర్భాల్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచారామె. ఇటీవల ఓ సినిమా షూటింగ్లో నిత్య వింత చర్య అందర్నీ ఆశ్చర్యానికి లోను చేసిందని సమాచారం. వివరాల్లోకెళ్తే... లొకేషన్లో ట్రాలీ నెట్టాలనే వింత కోరిక నిత్యకు కలిగిందట. అయితే... సదరు విభాగం వారు మాత్రం అందుకు ససేమిరా అన్నారట. దాంతో బుంగమూతి పెట్టుకొని ఓ మూల కూర్చున్నారట నిత్య. చేసేదేం లేక వారే దిగొచ్చి.. ‘ట్రాలీ నెట్టండి.. అయితే... రాత్రికి మా పార్టీకి అయ్యే అయిదు వేల రూపాయల ఖర్చును మీరే భరించాలి’ అని నిబంధన విధించారట. ‘ఓకే’ అని ఉత్సాహంగా ట్రాలీ నెట్టేశారట నిత్య. వెంటనే ఏటీఎం నుంచి ఓ ఇరవై వేలు తెప్పించి వారికిచ్చి ‘పార్టీని ఓ రేంజ్లో ఎంజాయ్ చేయండి’ అన్నారట సంతృప్తిగా నవ్వుతూ. చిన్న పిల్ల లాంటి ఆ మనస్తత్వం చూసి యూనిట్ సభ్యులందరూ నవ్వుకున్నారని సమాచారం.. -
ట్రాలీ ఆటో ఢీకొని ఒకరి మృతి
ఇల్లెందు, న్యూస్‌లైన్: మద్యం మత్తులో నిర్లక్ష్యంగా ట్రాలీ ఆటోను నడపడంతో ఓ సైక్లిస్టు మృతి చెందిన సంఘటన మండలంలోని వేములవాడలో సోమవారం చోటు చేసుకుంది. వేములవాడకు చెందిన నక్కా విశ్వనాధం(48) రోడ్డు వెంట సైకిల్‌పై వెళుతుండగా ట్రాలీ ఆటో వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విశ్వనాధంను ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.