కర్మ తప్పక వెంటాడుతుంది.. తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు | Ugadi 2023 Sri Shobha Kruth Nama Samvatsaram Navagraha Anugraham | Sakshi
Sakshi News home page

Ugadi 2023-Karma Phalam: కర్మ తప్పక వెంటాడుతుంది.. తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు

Published Tue, Mar 21 2023 1:51 PM | Last Updated on Tue, Mar 21 2023 2:18 PM

Ugadi 2023 Sri Shobha Kruth Nama Samvatsaram Navagraha Anugraham - Sakshi

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి భోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ధృతరాష్టుడ్రి దుఃఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు.

‘అన్నీ తెలిసినా, మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు?’ అని నిలదీస్తాడు. అందుకు కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.

‘ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి. ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద గువ్వల జంట ఒకటి వాటి గూట్లో గుడ్లతో నివసిస్తోంది.

వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా, అప్పటికే సహనం నశించినవాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అవి చూస్తూ ఉండిపోయాయి.

ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుణ్ణి చేసి కర్మబంధం నుంచి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు‘ అని అంటాడు. 

ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. ‘కర్మ అంతగా వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు?’ అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ‘ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి.

ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది’ అని వివరిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు. మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడి అంతరార్థం. 

1.చంద్రుడు : అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం. అందుకే అద్దంలో దిగంబరముగా చూసుకోవడం, వెక్కిరించడం వంటి చేష్టలు చేయకూడదు.

2.గురువు : సర్వ శాస్త్రాలు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువును కించపరచితే గురుదేవునికి ఆగ్రహం కలుగుతుంది. గురువులను పూజిస్తే బృహస్పతి అనుగ్రహం కలిగుతుంది.

3.బుధుడు : బుధుడికి చెవిలో వేలు పెట్టి తిప్పుకుంటే కోపం. అందునా బుధవారం ఈ పని అస్సలు చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా, జ్ఞానం ఉంది కదా అని విర్రవీగినా బుధుడు ఆగ్రహిస్తాడు.

4.శని : శనికి పెద్దలను కించపరచినా, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపం. తల్లిదండ్రులను చులకన చేసినా సహించడు. సేవక వృత్తి చేసిన వారిని శని కాపాడతాడు.

5.సూర్యుడు : పితృదేవతలని దూషిస్తే రవికి కోపం. సూర్యుడు నమస్కార ప్రియుడు. తర్పణ గ్రహీత. సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన, దంతావధానం చేయకూడదు.

6.శుక్రుడు : శుక్రుడికి భార్య భర్తనుగాని, భర్త భార్యనుగాని కించపరిస్తే కోపం. శుక్రుడు ప్రేమ కారకుడు. లకీ‡్ష్మ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు, మనుషులు నచ్చరు, గొడవలు లేని ఇల్లు ఇష్టం.

7.కుజుడు : అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపం. వ్యవసాయపరంగా మోసం చేస్తే ఊరుకోడు.

8.కేతువు : జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనుకాడితే కేతువు ఆగ్రహిస్తాడు, మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరం చేయవలసిన కార్యాలు చేయకపోతే కోపిస్తాడు. ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది.

9.రాహువు : వైద్యవృత్తి పేరుతో మోసగించినా, సర్పాలకు హాని చేసినా రాహువు ఆగ్రహిస్తాడు. భ్రమకు, మాయకు రాహువు కారకుడు. 

శివదీక్ష నవగ్రహానుగ్రహము
శ్రీమన్నారాయణునిచే శ్లాఘించబడిన మహత్తరమైన శాశ్వత శుభత్వమును కలుగజేయునదే శివదీక్ష. పార్వతీమాత పరమశివుని అనుగ్రహము కొరకు, స్వామిని వివాహము చేసుకోవడానికి కఠోరమైన శివార్చన నిర్వహించినది. లోకమాత పార్వతి మండువేసవిలో పంచాగ్నుల మధ్య, శీతకాలములో తడి వస్త్రము ధరించి, వర్షాకాలమందు జడివానలో సదాశివుని స్మరించి, శివదీక్ష నిర్వర్తించి, స్వామి కటాక్షము పొందినది.

అర్ధ శరీరమును పొందగలిగినదా గౌరీ మనోహరి. శివదీక్షాపరులకు పరమేశ్వరుని అనుగ్రహము నిశ్చయము. శుభయోగమును అనేక సంవత్సరములు పొందగలరు. శివదీక్షను స్వీకరించిన కార్తికేయుడు సర్వదేవతా సేనాధిపతి అయినాడు. అర్జునుడు పాశుపతాస్త్రమును శివముఖతః పొందగలిగాడు. శివదీక్ష మానవునికి వంశానుగత శాశ్వత శుభయోగమునిస్తుంది.

ఏలిననాటి శని శివదీక్షపరునికి అధికార ప్రాప్తిని, రాహువు ఆకస్మిక ధనమును, విదేశీ వ్యవహారములయందు విజయప్రాప్తిని, కుజుడు భూ సంపదలను, రవి ఆరోగ్యమును, గురువు ఉన్నత విద్య, సువర్ణ ఆభరణములను, కీర్తి ప్రతిష్ఠలను, శుక్రుడు  కళత్ర వాహన సౌఖ్యములను, కేతువు  విఘ్నములను హరించి అమృత యోగమును ఇస్తారు. చంద్రుడు జల సంపదలను, మనోబలమును ప్రసాదిస్తాడు. నవగ్రహములు, ద్వాదశ ఆదిత్యులు, నక్షత్ర మండలములు, శివాజ్ఞను అనుసరించి సంచరించును. శివదీక్ష స్వీకరించి తరించండి ! దీక్షా నియమములను సక్రమముగా పాటించండి.


  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement