గ్రహస్థితిని అనుసరించి మంచి, చెడు ఫలితాలు ఉంటాయని జ్యోతిష శాస్త్ర సిద్ధాంతము. అన్ని శాస్త్రాలకెల్లా వేదం గొప్పది. ఈ వేదానికి ధర్మం, న్యాయం, సత్యం అనునవి మూలాధార స్తంభాలు. ధర్మాన్ని అనుసరించి ఎవరికీ వారు సక్రమంగా నడుచుకుంటే ప్రపంచస్థితి, దేశస్థితి ఇప్పటికంటే భిన్నంగా ఉండేది.
మార్పు ఎక్కువ మందిలో కలిగితేనే సమాజంలో మంచి అయినా, చెడు అయినా ప్రభావం చూపుతాయి. ధర్మం ప్రస్తుతం ఒంటి కాలుమీద కూడా నడవడం లేదు. పూర్తిగా చతికిల బడిపోయింది. స్వార్థం, కోరికలు, విలాసాలు, క్షణికావేశం అనే అగ్నిజ్వాలలు ధర్మాన్ని చుట్టుముట్టాయి. అందుకే ప్రపంచంలో అశాంతి, అరాచకం అధికమయ్యాయి. మన దేశం గురించి చెప్పాలంటే ధర్మం చాలా రంగాల్లో క్షీణించింది. ఆ ప్రభావం ప్రకృతి రూపంలో, మహమ్మారి వ్యాధుల రూపంలో మనదేశాన్ని బాధించింది, బాధిస్తుంది.
సామూహిక బాధలు, భయాలు, వ్యక్తిగత బాధలు, మానసిక ఒత్తిడి అధికం అవుతున్నాయి. వీటన్నింటికీ కారణం కేవలం గ్రహస్థితి ఒక్కటే కాదు, మానవులు నిర్వర్తిస్తున్న కార్యక్రమాలు, ప్రవర్తన, ధర్మాతిక్రమణ కూడా కారణం. ఎక్కడ చూసినా స్వార్థం, సంకుచిత స్వభావం, అసూయ, అధికమయ్యాయి. నైతిక ధర్మానికి తిలోదకాలు ఇచ్చారు అనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. కృతజ్ఞత అనేది కుందేటి కొమ్ములా వెదికినా కనిపించనిది. వ్యక్తుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, సంస్థల పట్ల కృతజ్ఞత లేకపోవడం, ఈ రకమైన స్వార్థం పెరిగిపోవడం తప్పక పరిశీలించదగినది.
పెద్దంతరం, చిన్నంతరం దాదాపుగా మృగ్యమైపోయింది. ధర్మాన్ని, నైతిక ధర్మాన్ని మానవుడు విస్మరించి అశాంతిని కొని తెచ్చుకుంటున్నాడు.
గ్రహస్థితి బాగాలేదని బాధపడడానికి, దేవుడు దయచూపలేదని విమర్శించే వారికి ముందు ఆత్మపరిశీలన అవసరం. చూడలేని ప్రతి అంశానికి గ్రహస్థితిని, దేవుడిని అడ్డం పెట్టడం అవకాశవాదం అవుతుంది. భగవంతుడు, గ్రహాలు మనకిచ్చిన విజ్ఞానంతో మనం ఏ మేరకు ధర్మాన్ని రక్షించి సక్రమంగా ప్రవర్తించామో పరిశీలించుకోవలసిన సమయం ఆసన్నమైంది.
మన చేతలు, బుద్ధులు కూడా అనుకూల ఫలితాలకు కారణం అవుతుందన్న విషయం గ్రహించుట మేలు. స్వదేశాన్ని, స్వజనులను, భగవంతుడిని, తల్లిదండ్రులను మరచిపోకుండా చేతనయినంతలో నీ ధర్మాన్ని నీవు సక్రమంగా నిర్వర్తించు. ఈ విధమైన చైతన్యం అందరిలో కలిగినప్పుడు ధర్మం నిలబడుతుంది. ధర్మం నిలబడితే ప్రకృతి శాంతిస్తుంది. గ్రహ బాధలు తగ్గి, దుస్సంఘటనలు దూరం అవుతాయి. మానవుని స్వార్థం అధికమైనప్పుడు, మేధస్సు వికటించినప్పుడు చేదుఫలితాలే దక్కుతాయి. ఇందుకు దైవాన్ని, జాతకులను, గ్రహాలను విమర్శించడం, విశ్లేషించడం వృథా. ధర్మో రక్షతి రక్షితః
Comments
Please login to add a commentAdd a comment