శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది : గ్రహాలు వాటి స్వభావాలు | Ugadi 2023 Sri Shobhakruth Nama Samvatsara Graha Swabhavalu | Sakshi
Sakshi News home page

Ugadi 2023-Graha Swabhavalu: గ్రహ స్వభావాలు

Published Tue, Mar 21 2023 2:33 PM | Last Updated on Wed, Mar 22 2023 1:08 PM

Ugadi 2023 Sri Shobhakruth Nama Samvatsara Graha Swabhavalu - Sakshi

రవి ఏకాదశ రుద్రులలో ఒకడైన సూర్యభగవానుడు నవగ్రహాలకు నాయకుడు. అధిపతి. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలకు అధిపతి. సింహరాశ్యాధిపతి. సూర్యునకు అతి సమీపంలోకి గురు, శుక్ర గ్రహాలు వచ్చినప్పుడు మౌఢ్యమి ఏర్పడుతుంది. రాహువు, కేతుగ్రస్తమైనా రవి గ్రహణం ఏర్పడుతుంది.

రవి దశ నడుస్తున్నవారు; సింహరాశి వారు; కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల వారు శివాలయంలో సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించాలి. ఆరోగ్యానికి, అధికారానికి, దర్పమైన జీవితానికి, సమాజంలో భయభక్తులు గల మానవులుగా జీవించడానికి రవి కారకుడు. విష జ్వరాలకు, కంటిరోగాలకు రవి కారకుడు.

సూర్యారాధనలో తర్పణం ముఖ్యమైనది. ఉదయం, సాయంత్రం, సూర్యాస్తమయంలోపు సూర్యునకు అర్ఘ్యప్రదానం చేయాలి. రవి ప్రభావం చేత జాతకునకు అనువంశికంగా వచ్చే ప్రయోజనాలు, దుర్నిమిత్తాలు సంభవిస్తాయి. తరతరాలుగా వస్తున్న సిరిసంపదలకు సూర్యుడే కారకుడు. భూదాన గుణం, అనువంశిక, వృత్తి, వైద్యం, పదవి, ప్రజాప్రాతినిధ్యం సూర్యగ్రహం వలనే సంప్రాప్తిస్తాయి. ఆత్మగౌరవానికి, అహంకారానికి, మితిమీరిన ఆత్మవిశ్వాసానికి రవి కారకుడు. రవి జాతకులు ఇష్టంలేని వాస్తవాలను గ్రహించరు. పొగడ్తలకు పొంగిపోతారు. నిజాయితీపరులు వీళ్ళ పక్కన ఉండలేరు. భజనపరులకే చోటు ఉంటుంది. కుజ, గురు, చంద్ర, బుధులతో మిత్రత్వం కలిగిన వాడు, శుక్ర, రాహు, కేతువులు, శత్రువులు.

కుమారుడైన శనితో బద్ధవైరం కలిగినవాడు. స్థిరమైన భావాలకు, సంప్రదాయాలకు రవి కారకుడు. ఉన్నా లేకపోయినా గంభీరంగా ఉంటారు. విశేషమైన ఖర్చులు చేస్తారు. వీటిల్లో చాలావరకు అపాత్రదానం అవుతాయి. వీళ్ళ పేరు మీద విద్యాసంస్థలు, చెరువులు, బావులు, అన్నదాన సత్రాలు, కళ్యాణ మండపాలు, సేవా సదనాలు ఉంటాయి. సుదీర్ఘ రాజకీయ జీవితానికి రవి గ్రహమే కారణం. ప్రజలతో సంబంధాలు ఉంటాయి గాని, వాళ్ళతో కలిసిపోరు. పూర్వీకుల నుంచి వస్తున్న ప్రజాబలం వల్లనే గెలుస్తారు. రాజకీయ పదవిని కూడా ప్రభుత్వ ఉద్యోగం మాదిరి చేస్తారు. ఉద్యోగం నిజాయితీగా చేస్తారు. నేరస్తులను వ్యక్తిగత శత్రువులుగా భావిస్తారు. ప్రభుత్వ ధనాన్ని వృథా చేయరు. పై అధికారుల మాట, మంత్రుల మాట వినరు. భార్య విషయంలోనూ వీళ్ళు స్వతంత్రంగానే వ్యవహరిస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మొత్తం పోగొట్టుకొని అప్పుల పాలయినా చెక్కు చెదరరు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వైద్యవృత్తిలో ఉన్నవారికి అనుకూలమైన సూర్యగ్రహ ప్రభావం చేత అపర ధన్వంతరిగా పేరు గాంచుతారు. వైద్య విధానంలో నూతన విషయాలు కనుగొంటారు. మూలికల మీద, చెట్లమీద మంచి పరిజ్ఞానం ఉంటుంది. అల్లోపతిలో కూడా అద్భుతంగా రాణిస్తారు.

బీద కుటుంబంలో పుట్టినా, కష్టపడి చదివి అధికార పదవి చేపట్టడానికి రవి గ్రహం కారణం. నైపుణ్యాని కన్నా స్నేహానికి ప్రాధాన్యమిస్తారు. గుప్త దానాలు చేస్తారు. కళాసాహిత్య రంగాలలో ప్రఖ్యాతి సాధిస్తారు. వీళ్ళు ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి న్యాయం చేస్తారు. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉంటారు. జీవిత చరమాంకంలో అన్ని రకాల ఐహిక సుఖాలను పరిత్యజిస్తారు.

రవి గ్రహ (సూర్యుని) లక్షణాలు : క్రమశిక్షణకు, ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తారు. ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలని సుఖం లేకుండా శ్రమ జీవితాన్ని గడుపుతారు. వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యమిస్తారు. కులగౌరవం, వంశగౌరవం పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారు. ఆర్థిక విషయాల్లో గట్టి మనుషులుగా ప్రఖ్యాతి వహిస్తారు. చేసిన దానధర్మాలకు, మంచి పనులకు పెద్దగా ప్రచారం రాదు. కఠినంగా వ్యవహరించే వ్యక్తులుగా పేరు వస్తుంది. సన్నిహిత, సేవకవర్గం ఏ పని అయినా కొంత ఆలస్యంగానయినా చేయించుకో గలుగుతారు. వీళ్లను భయపెట్టి లొంగదీసుకునే యత్నాలు ఫలించవు. బంధువుల వల్ల సన్నిహిత రక్త సంబంధీకుల వల్ల, పర స్త్రీల వల్ల నష్టం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా కొంతకాలం అజ్ఞాత వాసం, అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు. వైద్య, సాంకేతిక, వ్యాపార రంగాల్లో రాణిస్తారు.

రాజకీయ రంగంలో ప్రారంభం నుంచే ఆధిక్య స్థితి ఉంటుంది. ఉన్నత స్థానాలలో ఉండి సామాన్యులను దూరం చేసుకుంటారు. సామాన్య స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత స్థానాలలోని వారికి దూరం అవుతారు. శిరోవేదన, పార్శ్యపు నొప్పి, కీళ్ళ నొప్పులు ఇబ్బంది కలిగిస్తాయి. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా కృషి చేస్తారు. లేక అనేక ఉద్యోగుల పట్ల, వారి వారి విధుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. స్థాయి లేని వ్యక్తుల్ని మీకు పోటీగా నిలిపి వాళ్ళను బలవంతులను చేసి, మీకు పోటీగా నిలపాలనే యత్నాలు అత్యున్నత స్థానాలలోని వ్యక్తులు చేస్తారు. ఇందుకు మీ సొంత ధనం, ప్రోత్సాహం కూడా తోడవుతుంది. కొనుగోలు చేసిన ఆస్తులు వివాదాస్పదం కావచ్చు. రవి, కుజ, రాహు, గురు మహర్దశలు బాగా రాణిస్తాయి. శనిదశ కూడా మంచిగానే ఉంటుంది. స్నేహితులు చేసే సహాయ సహకారాలు జీవితంలో మరువలేనివిగా ఉంటాయి. మహోన్నత ఆశయ సాధన ఉంటుంది. విదేశీ వ్యవహారాలు లాభించడం, జీవితంలో చెప్పుకోదగిన అంశం. సిద్ధ గంధంతో శివార్చన, ఆంజనేయస్వామి ఆరాధన వల్ల మరింత వృద్ధి సాధించ గలుగుతారు. మే నెల సాధారణంగా బాగుంటుంది. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉంటే జీవితంలో మరింత అభివృద్ధి సాధిస్తారు. సంతానం వల్ల మంచి ప్రఖ్యాతి వస్తుంది. శ్లో: జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరవ్‌ మీ జాతకంలో రవి అనుకూలంగా ఉన్నాడా? లేక ప్రతికూలంగా ఉన్నాడా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకోవడానికి శ్రీమతి ములుగు శివజ్యోతిగారిని సంప్రదించండి.

శుక్రుడు శుక్రుని ఆరాధించడం వలన అపమృత్యుభయం ఉండదు. విలాస జీవితం, స్త్రీ, వివాహ సౌఖ్యం, సుఖనిద్ర, విలాస వస్తువుల సేకరణ, అధునాతనమైన భవంతి, బహు వాహనాలు, నవనాగరికతకు తగిన వేషభాషలు, సౌందర్య ఆరాధన– ఇలాంటివన్నీ శుక్రగ్రహ అధీనంలో ఉంటాయి. సర్వ ఐహిక సుఖకారకుడు శుక్రుడు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ శుక్ర నక్షత్రములు, వృషభరాశి, తులారాశి శుక్రగ్రహ స్వరాశులు, మీనరాశి, శుక్రునకు ఉచ్చక్షేత్రము, కన్యారాశి నీచక్షేత్రము. స్త్రీ సంతానానికి శుక్రుడే కారకుడు. పురుష జాతకంలో కళత్ర కారకుడు, స్త్రీ జాతకంలో భర్తృకారకుడు. శుక్ర జాతకులు తమ జీవితంలో స్త్రీలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. వీరి జీవితంలో యోగావయోగాలు స్త్రీలపై ఆధారపడి ఉంటాయి. భార్య, ప్రేయసి, స్నేహితురాళ్లు గ్రహస్థితిని బట్టి ఎవరో ఒకరు జీవితంలో ప్రధానమైన మార్పులకు కారకులవుతారు. వివాహానంతరం గొప్ప స్థితి, ధనం, సౌందర్యం కలిగిన స్త్రీ భార్యగా లభించడం శుక్రగ్రహ ప్రభావమే! శుక్రగ్రహ జాతకులు పదుగురిలో గుర్తింపు పొందే ప్రవర్తన, వేష భాషలు, రూపం కలిగి ఉంటారు.

మద్యం సేవించినట్లయితే అసభ్యంగా ప్రవర్తించి, గౌరవం పోగొట్టుకుంటారు. రాజకీయాలు లేనిచోట కూడా రాజకీయాలు నడపడం, తన మాట వినని వారి పతనం కోరుకోవడం, తన పరోక్షంలో సమాజం తన గురించి ఏమి చెప్పుకుంటుందో వాకబు చేయడం, నిఘాలు వేయడం, హితవు చెప్పే వాళ్ల మీద పగ పెంచుకోవడం, భజనపరులను చేరదీయడం, స్థాయి దిగజార్చుకొని పరులను పొగడడం, సన్మాన, సత్కార సభలు జరపడం, తనకు మళ్ళీ జరిపించుకొనడం వీరి దైనందిన జీవితంలో ఒక భాగం. సినీ కళాకారుల జాతకంలో శుక్ర గ్రహస్థితి ముఖ్యమైనది. రాజకీయ రంగంలో కొంతకాలం మాత్రమే రాణించగలరు. పరస్త్రీలతో రహస్య ప్రవర్తనం, శారీరక శ్రమ చేయకపోవడం, మేధస్సుతోనే మంత్రాంగం, సౌఖ్యమైన వృత్తి, ఉద్యోగాలు వీరికి సంప్రాప్తిస్తాయి. తల్లితో, సహోదరీ వర్గంతో అనుబంధం ఎక్కువ. ఆడవాళ్ళతో కలిసిపోయి వాళ్ళకు తగినట్లుగా ప్రవర్తించడం, జనులు హేళన చేసినా, అదీ ఓ గుర్తింపుగా భావించి పొంగిపోవడం, స్త్రీ దేవతా భక్తి, పిసినారితనం, సామాజిక న్యాయంపై చులకన, తన స్థాయివారిని కించపరచడం, తనకన్నా అధికులను కాకా పట్టడం, పూల మొక్కలు పెంచడం, కళాత్మకమైన వస్తు సేకరణ, అలంకరణ, ఓర్పు తక్కువ, క్రమశిక్షణ లేకుండుట, ఒకేసారి రెండుమూడు పనులు చేయడం, ఎదుటివారి మనస్సులోని మాట గ్రహించగలగడం, అబద్ధాలు చెప్పడం, సౌఖ్య విలాస జీవితాన్ని గడపడం, వీరి యోగ కారక లక్షణాలు. వీరికి ఉన్న పుత్రికా వాత్సల్యం చెప్పనలవికానిది. కొడుకుల పట్ల సామాన్యమైన అనుబంధమే. జాతక చక్రప్రకారం శుక్రుడు, శత్రు, నీచక్షేత్రాలలో ఉన్నట్లయితే కళత్ర వియోగం.

ద్వికళత్ర యోగం, త్రికళత్ర యోగం, ప్రేమ వివాహం వల్ల అపఖ్యాతి, అవయోగం, అన్యస్త్రీ బానిసత్వం, వ్యసనం, బద్దకం పరాకాష్టకు చేరి స్త్రీ సంపాదన మీద జీవించుట, వృత్తి, ఉద్యోగం లేకుండా బిజీగా తిరుగునట్లు నటించడం వంటి లక్షణాలు కలుగుతాయి. నీచక్షేత్ర శుక్రస్థితి వల్ల భార్యతో అన్యోన్యత లేకుండుట, ప్రేమ వివాహ వైఫల్యం, విడాకులు రాకపోవడం, స్త్రీలు జీవితాన్ని పాడుచేయడం, చిన్నచిన్న గుడ్డలతో సంకోచం లేకుండా నలుగురిలో తిరగడం వంటి లక్షణాలు సంప్రాప్తిస్తాయి. స్త్రీ జాతకంలో యోగకారక శుక్రుని ఫలితంగా అతి సౌందర్యవతి, అహంభావం, శారీరక బలహీనత, ఉన్నత విద్య, వైద్యవృత్తి, సినిమా, మోడలింగ్‌ రంగాల్లో రాణించగలరు. భర్త, పిల్లలపైన నియంత్రణ సాధించి బద్దకంతో పనిచేయక, అనారోగ్య లక్షణాలు వల్లెవేస్తుంటారు. సమాజసేవ, సాహిత్య, సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో మాత్రం ఉత్సాహంగా పాల్గొంటారు. భర్తను అత్తమామల నుండి విడదీయడం, అర్థంలేని సామాన్లు కొని డబ్బు నాశనం చేయడం, భర్తకు తెలియకుండా అప్పులు చేయడం, కోడళ్లను వేధించడం, నడుంనొప్పి, రక్తస్రావం, పచ్చకామెర్లు, లోబీపీ వీరి రోగ లక్షణాలు. భర్త, పిల్లల వల్ల సౌఖ్యం, గౌరవం. పుట్టినింట్లో సామాన్య స్థితి, వివాహానంతరం గొప్ప స్థితి, రుచికరమైన వంటలు చేయలేకపోవుట, సంకుచిత స్వభావం, మంచి జ్ఞాపకశక్తి వీరి లక్షణాలు.

శుక్రగ్రహ లక్షణాలు :– జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ఎత్తులకు పైఎత్తులు వేయడంలో అందెవేసిన చేయి. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణతో ముడిపడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాల్లో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. స్థిరాస్తుల వృద్ధి జరుగుతుంది. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పుచేసి అభివృద్ధి చేస్తారు. అలంకార ప్రియులు, ఎక్కువమంది అభిరుచి ఎలా ఉంటుందో తేలిగ్గా తెలుసుకోగలరు. కళా సాహిత్య రాజకీయ రంగాల్లో రాణిస్తారు. యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. వ్యక్తిగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు.గతం మరచి ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటారు. విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి. సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు. నూనె, అపరాలు, విత్తనాలు, యంత్ర, వాహన వ్యాపారాల్లో రాణిస్తారు. ముఖ్యంగా శని మహర్దశ రాజయోగాన్నిస్తుంది. సాహసోపేత నిర్ణయాలు కలిసివస్తాయి. విలాసవంతమైన జీవితానికి ఎక్కువగా ఖర్చు చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. పడమటి, దక్షిణ దిక్కులు లాభిస్తాయి. శుక్రమౌఢ్యమి కాలంలో జాగ్రత్త వహించాలి. దీపావళి అమావాస్య నాడు లక్ష్మీదేవీ పూజ కలిసి వస్తుంది. ప్రజాబలం, సంఘంలో మంచిపేరు, సన్నిహిత సహచర వర్గం అండదండలు అనుసరించి నడిచే వర్గం ఉంటారు. అత్యున్నత స్థానంలోని వారితో పోరాటం చాలా సందర్భాలలో తప్పకపోవచ్చు. మేధస్సు, స్వీయవిద్య, సాంకేతిక పరిజ్ఞానం, అక్కరకు వస్తాయి. బాల్యంలో మిశ్రమ ఫలితాలు.

శ్లో: హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం తం భార్గవం ప్రణమామ్యహవ్ మీ జాతకంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడా? లేక ప్రతికూలంగా ఉన్నాడా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకోవడానికి శ్రీమతి ములుగు శివజ్యోతిగారిని సంప్రదించండి. గురువు (బృహస్పతి) ఇంద్రునికి అన్ని విధాలా తోడ్పడటం, అవసరమైన సమయాలలో సలహాలను ఇచ్చి దేవతలను ఆదుకోవడం దేవగురువు బృహస్పతి కార్యక్రమాలు. శుభకార్యాలకు, ముహూర్తాలకు బృహస్పతి బలం చాలా ప్రధానం. గురువు రాశి మారినప్పడల్లా ఒక్కొక్క నదికి పుష్కరాలు సంప్రాప్తిస్తాయి. గురువు ధన కారకుడు. జీవితంలో స్థిరత్వానికి, హోదా కలిగిన ఉద్యోగానికి, అందానికి ఈ గ్రహమే కారణం. సమస్త శుభకార్యాలకు గురుబలం కలిగిన ముహూర్తం అవసరం. తరతరాల విద్య, విజ్ఞాన పాండిత్యాలు, సనాతన సంప్రదాయాలు, తరగని స్థిరాస్తులు లభించడానికి గురువే కారణం. అనువంశిక అధికారానికి, కీర్తిప్రతిష్ఠలకు ఈ గ్రహమే కారణం. సమాజంలో మంచిని ప్రోత్సహించడం, అబద్ధాలను సహించ లేకపోవడం ఈ గ్రహం వల్లనే సంప్రాప్తిస్తాయి. బంగారానికి గురువు అధిపతి. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు బృహస్పతి అధిపతి. గురుగ్రహ జాతకులు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తాము నమ్మే సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. అపార శాస్త్ర పరిజ్ఞానం, జ్ఞానం వంటివి గురుగ్రహ అనుకూలత వల్ల సంప్రాప్తిస్తాయి. న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా ప్రఖ్యాతి సాధిస్తారు. ప్రలోభాలకు లొంగకుండా తన స్థానానికి న్యాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో వీళ్ళకు అందరూ సమానమే!

గురుగ్రహ జాతకులు వాక్పటిమ, తేజస్సు కలిగి ఉంటారు. గురుగ్రహ లక్షణాలు: నిజాయితీ, సామర్థ్యం, పరిజ్ఞానం వీళ్ళ జీవితంలో ఓ భాగంగా నడుస్తుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, తగిన సలహాలు ఇస్తారు. నిర్ణయాలు తీసుకునే బాధ్యత వాళ్ళకే వదిలేస్తారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళరు. తన మాట కాదన్న వాడిని జీవితాంతం శత్రువులుగానే చూస్తారు. ధనం దానికదే వస్తుంది. వీళ్ళ క్రమశిక్షణా పద్ధతులు, జీవన విధానం ఆచరించాలంటే కలియుగంలో సాధ్యపడదు. దేశభక్తి, దైవభక్తి, వృత్తి ఉద్యోగాల పట్ల అంకితభావం ఉంటుంది. ఇన్ని మంచి గుణాలు ఉన్నా, వీళ్ళకు కుటుంబపరంగా మనశ్శాంతి ఉండదు. భార్యతో విభేదాలు, సంతానంతో తెగదెంపులు సంభవిస్తాయి. కుటుంబ సభ్యుల వల్ల పరువు–ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. సంతానం ‘పండిత పుత్రః పరమ శుంఠః’ సామెతను నిజం చేస్తారు.

బంధువుల ఎదుట వినయ విధేయతలు నటించి కావలసిన పనులు చక్కబెట్టుకుంటారు. పక్కకు వెళ్ళి తిట్టుకుంటారు. సహోదర, సహోదరీ వర్గానికి ధర్మబుద్ధితో వీళ్ళు చేసే సహాయం పూర్తి వ్యతిరేక ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యులు సృష్టించే హీన చరిత్రలో బంధువులు భాగస్వాములవుతారు. 16 వేలు గురుగ్రహ జపం–శనగలు దానం ఇవ్వాలి. నిత్యం వైష్ణవ దేవతార్చన చేయాలి. మంచి లాభాలు, పేరు సంపాదిస్తారు. సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. భూ సంబంధ వ్యాపారాలు కలసివస్తాయి. ఆస్తి విలువ పెరగడమే ధనవంతులు కావడానికి కారణం అవుతుంది. వ్యాపార కూడలి ప్రదేశాలు అద్దెకు ఇచ్చి, అమ్మే అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానం వల్ల కుటుంబ ప్రతిష్ఠ పెరుగుదల ఎలా ఉన్నా వాళ్ళ స్థితి మాత్రం బాగుంటుంది. వాళ్ళ మనస్తత్వం, పద్ధతులు ఏవిధంగా ఉన్నా అదృష్టం కలసి వస్తుంది. జీవిత ప్రారంభంలో తెలిసీ తెలియక చేసిన నిర్ణయాలు, పనులు మంచిగా మలుపు తిరుగుతాయి. చిన్న పాటి వ్యక్తుల కూటమిని బలోపేతం చేస్తారు. జీవితంలో ఘన విజయాలు సాధిస్తారు. అసమర్థులను జాలిపడి అందలం ఎక్కిస్తారు. ఆ అసమర్థులే అఖండులై, బలమైన ప్రత్యర్థులుగా తయారవుతారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయబడిన శక్తి ఉంటుంది. స్వయంకృతాపరాధాలను సరిదిద్దుకోలేరు.

సొమ్ము, పదవి, ప్రయోజనాలు కొన్ని సందర్భాలలో కోల్పోయినా, ఇతురులు మీ వల్లనే వాటిని పొందారన్న పేరు సమాజంలో వినిపిస్తుంది. హస్తవాసి మంచిదని అందరూ మెచ్చుకుంటారు. ఫిబ్రవరి, అక్టోబరు నెలల్లో ప్రారంభించే వ్యాపార, వ్యవహారాలు బాగుంటాయి. భాగస్వామ్యంలో కొంతకాలం మాత్రమే లాభపడతారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత కష్టకాలం ఎదుర్కొంటారు. సహోదర, సహోదరీ వర్గం బాధ్యతలు మోయాల్సి వస్తుంది. పై అధికారుల వల,్ల కిందిస్థాయి సిబ్బంది వల్ల ఏకకాలంలో సమస్యలు వస్తాయి. ఋణాల విషయాల్లో అసత్య ప్రచారాలు చోటు చేసుకుంటాయి. కోర్టు వ్యవహారాలలో నెగ్గుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా, ఆధ్యాత్మికంగా అనేక రంగాలలో అనుభవం సాధిస్తారు. మనుషుల మనస్తత్వం తెలుసుకోవడంలో విజయం సాధిస్తారు. మీకంటే వెనుక వచ్చిన వాళ్ళు మిమ్ములను దాటి ముందుకు పోయినా, వాళ్ళకన్నా ఆధిక్యాన్ని దీర్ఘకాలంలో సాధించగలుగుతారు. పెద్దలు స్థిరాస్థులు పోగొట్టినా, స్వయం శక్తితో సాధించుకోగలుగుతారు. శత్రువర్గంపై విజయం సాధిస్తారు. సొంత వాళ్ళ వల్ల ఎదురయ్యే సమస్యలతోనే ఇబ్బందులు ఎదుర్కొంటారు. పడమర, దక్షిణం, ఉత్తరం దిశలు అనుకూలము. కుబేర కంకణ ధారణ వల్ల ఆర్థిక, వృత్తిపరమైన స్థిరత్వం కలుగుతుంది.

శ్లో: దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతివ్‌ు మీ జాతకంలో గురువు అనుకూలంగా ఉన్నాడా? లేక ప్రతికూలంగా ఉన్నాడా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకోవడానికి శ్రీమతి ములుగు శివజ్యోతి గారిని సంప్రదించండి. శని నవగ్రహాలలో శనైశ్చరుని స్థానం ప్రత్యేకమైనది. శని ఇచ్చే ఫలితాలు శుభఫలితాలైనా, అశుభఫలితాలైనా విపరీతంగా ఉంటాయి. శనికి ప్రత్యధిదేవత ఈశ్వరుడు. శని రాజ గ్రహాలతో ప్రబల విరోధం గలవాడు. రాజరికానికి, నియంతృత్వానికి వ్యతిరేకి. శ్రమ జీవితం, వైరాగ్యం, సమధర్మం శనిగ్రహ లక్షణాలు. తమ్ముడు తనవాడయినా న్యాయం అందరికీ సమానమేనన్న వర్తన కలిగినవాడు. ప్రజా సంబంధాలు, ప్రజాదరణ, ఖండాంతర ఖ్యాతి, అధికారం, సాంకేతిక విద్యలు, ఉద్యమాలకు నాయకత్వం, జీవితాశయ సాధనకు సౌఖ్యాలను త్యాగం చేయుడం, సామూహిక మేలు కోసం పోరాడటం శనిగ్రహ లక్షణాలు. శని ఆయుర్దాయ కారకుడు. అనేక రంగాల్లో అత్యున్నత స్థితి, భోగభాగ్యాలు అనుభవించడానికి, శాశ్వత కీర్తివంతుడు కావడానికి శని కారకుడు. శని విశేష రాజయోగం ఇవ్వగలడు. శని దుష్ప్రభావాలు మాత్రమే ఇస్తారన్న ప్రచారం సరియైనది కాదు. ఉత్తరాభాద్ర, పుష్యమి, అనూరాధ నక్షత్రాలకు శని అధిపతి. కుంభ, మకర రాశులకు శని అధిపతి. ఏలిననాటి శని నడుస్తున్నప్పుడు ఎన్నో బాధలు వస్తాయని, దివాలా తీస్తారని, సర్వనాశనం జరుగుతుందని కొందరు ప్రచారం చేస్తుంటారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. ఏలిననాటి శని కాలంలో రాజయోగం పట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారు.

ఆయుష్కారకుడైన శని బలాన్ని పరిశీలించిన తర్వాత జాతకాలలో ఇతర అంశాలు పరిశీలించాలి. విశేషమైన జనాకర్షణ, రాజకీయ అధికారం, ప్రజా సంబంధాలు స్వయంశక్తి, ఆయుర్దాయం, రహస్య జీవనం, సన్యాసం, నైతిక ధర్మం, చట్ట ఉల్లంఘన, ఈశత్వం, ప్రాప్తి, ప్రతీకారం మొదలైనవి శనైశ్చరుని స్థితిననుసరించి, జాతకునికి సంప్రాప్తిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, విశేష జననాశనం, ప్రజా ఉద్యమాలు శని సంచార స్థితిననుసరించే ఉంటాయి. ఎవ్వరికైనా ఏల్నాటి శని ప్రభావం తప్పదు. శని దశ, అంతర్దశ, ఏల్నాటి శని కాలాలలో శని స్వతంత్రించి మహరాజయోగాన్ని, సిరి సంపదల్ని, రాజకీయ అధికారాన్ని, గొప్ప యోగం ఇవ్వగలడు. ఏల్నాటి శని కాలంలో, శని మహర్దశ, అంతర్దశలలో ఎందరో మంత్రులు, ధన అధికార మదాంధులు, సామాన్య మానవుడు సైతం అనుభవించని దుర్భర కష్టాలు అనుభవించి నహుషభ్రష్టత పొందారు. ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రాలకు శని కారకుడు. కలియుగంలో నవగ్రహాలలో శనికి మించి అధిక శుభయోగం ఇవ్వగల గ్రహం మరొకటి లేదు.

జాతకచక్రంలో తానున్న స్థితిని అనుసరించి, వివిధ రంగాలలో యోగాన్ని, తన దశ, అంతర్దశలలో, ఏల్నాటి శని కాలంలో ఇస్తాడు. జాతకరీత్యా శని యోగకారకుడైనప్పుడు అధికారం, సిరిసంపదలను ఇచ్చినా, తానున్న భావం సరిగా లేనప్పుడు, జాతకుడు తనకంటే పెద్దదైన స్త్రీని పెళ్ళి చేసుకోవడం, లేక కులాంతర వివాహం చేసుకుని, అయిన వాళ్ళకు శత్రువై దూరంగా జీవించడం, భార్యావియోగం, ఏకాంత జీవితం, అనేక మంది సేవకుల మధ్య ఉన్నా, ఒంటరితనం అనుభవిస్తారు. ఇది కళత్ర విషయంలోనే గాదు, ఏ భావానికైనా, సహోదరులు, దాయాదులు, బంధువులు, ధైర్యసాహసాలు, పరువు–ప్రతిష్ఠలు, సంతానం, ఆరోగ్యం, పదవి, కీర్తి–కోర్టు వ్యవహారాలు దేనిమీదనైనా తన ప్రభావం, యోగాన్ని వృద్ధి చేసి భావాన్ని దెబ్బతీస్తాడు.

శని తానున్న భావాన్ని వృద్ధి చేస్తాడా, చెడు చేస్తాడా అనేది వ్యక్తిగత జాతకచక్రంలో స్థితిని బట్టి ఉంటుంది. శనిగ్రహ జాతకులు నైతిక ధర్మానికి ప్రాధాన్యమిస్తారు. చేసిన మేలు మరువరు. పదేపదే కృతజ్ఞతలు తెలుపుతుంటారు. అపకారం చేసిన వాళ్ళకు పదింతలు చెరుపు చేయనిదే వాళ్ళు విశ్రమించరు. కుంభ నిక్షిప్త భుజంగంలా సమయం కొరకు వేచి దెబ్బతీస్తారు. శత్రువుల పట్ల క్షమాగుణం ఉండదు. వీరి జ్ఞాపకశక్తి వీళ్ళ శత్రువులకు శాపం. వృద్ధుల పట్ల, స్త్రీల పట్ల శ్రద్ధ వహించి కులమత భేదాలు లేకుండా ప్రవర్తిస్తారు.

ప్రత్యర్థులు వీరిని ఏమి చేయలేరు. నిద్రలేమిని భరిస్తారు. అన్నపానాదులు లేక శ్రమిస్తారు. శని దశలో లేక ఏలినాటి శని నడుస్తున్నప్పుడు అధికమైన శుభ సంబంధిత రాజయోగం లేక తత్సమానమైన యోగాన్ని అనుభవిస్తారు. శని కాలభైరవ ఉపాసకుడు. శని గ్రహ సాధారణ లక్షణాలు :– శనిగ్రహ జాతకులు జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా అపార అనుభవాన్ని మేధస్సును సొంతం చేసుకుంటారు. ఎక్కువగా వింటారు, మంచి మాటకారితనం ఉంటుంది. ఎదుటి వాళ్ళు మోసం చేయనంత వరకూ ఇతరులను మోసం చేద్దామన్న ఆలోచనే రాదు. బంధుప్రీతి, స్నేహితుల పట్ల అవ్యాజమైన అనుబంధం వీరి లక్షణం. తన లోపం తెలుసుకున్నాక చేసిన పొరపాటును తిరిగి చేయరు. తన తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. అందరిని సమభావంతో ప్రేమగానే చూస్తారు. తాను ద్వేషించే వ్యక్తులను అభిమానించే వారిని శత్రువులుగానే చూస్తారు. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. సాత్విక స్వభావం, మాటమీద నిలబడే తత్వం ఉంటుంది. నైతిక బాధ్యతలకు ప్రాముఖ్యతనిస్తారు. నమ్మిన వాళ్ళ కోసం పరిశ్రమిస్తారు.

సాధారణ శరీర సౌష్టవం. అమితమైన జ్ఞాపకశక్తి, రచనా వ్యాసాంగం, పరిశోధన, నటన, కళా సంబంధమైన వృత్తి, ఉద్యోగాలలో విశేషమైన నిపుణత ఉంటుంది. వీళ్ళు చేసే ఏ పనికీ ఇతరులు ప్రత్యామ్నాయం అని చెప్పలేని విధంగా ఉంటుంది. అయితే వీళ్ళ మేధస్సు ఆలోచనలు శ్రమ ఎక్కువ కాలం దోచుకోబడతాయి. ధనం ఏదో రూపంలో సర్దుబాటు అయి అవసరాలు గడుస్తాయి. అభిమానించే ప్రజానీకం, నమ్మిన అనుచర వర్గం ఉంటారు. స్త్రీల వలన అదృష్టం కలసి వస్తుంది. దాంపత్య జీవితంలో టీ కప్పులో తుపాను వంటి సంఘటనలు ఏర్పడతాయి. అంతకుమించి ఇబ్బంది కలగదు. బంధువర్గం కన్నా బయటి వారి సహాయ సహకారాలు బాగా అందివస్తాయి. జీవిత మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు వంటివి ఇబ్బంది పెడతాయి.

శ్లో: నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజవ్‌ ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరవ్‌ మీ జాతకంలో శని అనుకూలంగా ఉన్నాడా? లేక ప్రతికూలంగా ఉన్నాడా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకోవడానికి శ్రీమతి ములుగు శివజ్యోతి గారిని సంప్రదించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement