కుంభ రాశి
ఆదాయం–14, వ్యయం–14, రాజయోగం–6, అవమానం–1
ధనిష్ఠ 3,4 పాదములు (గుూ, గే)
శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు)
పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా)
గురువు మే 1 వరకు మేషం (తృతీయం)లోను తదుపరి వృషభం (చతుర్థం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (జన్మం)లోను రాహువు మీనం (ద్వితీయం)లోను కేతువు (అష్టమం)లోను సంచరిస్తారు. రోజూవారీ కార్యక్రమాలలో ఆలస్యం బాగా చోటు చేసుకుంటుంది. ఏలినాటి శని వలన సహజంగా ఉండే ఇబ్బందులు ఉంటాయి. కానీ భయభ్రాంతులను చేసే స్థాయి కాదు అని గమనించాలి. ప్రతిపనీ రెండవసారి, మూడవసారి ఓర్పుగా వెంబడిస్తే లాభిస్తుంది. ఇది మీరు ప్రత్యక్షంగా గమనించవచ్చు. ప్రాకృత ధర్మంలో ఉన్న వారికి సమస్యలు రావు. వేరే మార్గంలో మీ ప్రవృత్తిని మార్పు చేసుకొనేవారు మాత్రమే ఇబ్బంది పొందుతారు. శని ఆలస్యం చేస్తాడు కానీ పనులు పాడు చేయడు. ఇది నిజం.
ఉద్యోగ విషయాలలో భయపడవద్దు. మార్పు తీసుకోవద్దు. వృత్తి మార్పుకు ఇది మంచి కాలం కాదు. చేస్తున్న ఉద్యోగంలో ఉంటూ కొత్త ఉద్యోగ అన్వేషణ చేయండి. ఇబ్బంది ఉండదు. చేస్తున్నది మానేసి కొత్త ప్రయత్నం చేస్తే అది వికటిస్తుంది. చేస్తున్న పనిలో సరైన గుర్తింపు రాలేదని బాధపడవద్దు. స్థానచలన ప్రయత్నాలు స్వయంగా సమీక్షించుకోకపోతే మీకు సానుకూలత లేని ప్రదేశం చేరుకోవలసి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు తక్కువ స్థాయి ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్తపడండి.
తరచుగా శుభవార్తలు వింటుంటారు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా ఇబ్బందులు రాగలవు. అలాగే మీ పిల్లల ద్వారా మీకు ఉన్న ఆశలు, కోరికలు సరిగా పూర్తి అవకపోవడం చేత కొంచెం మానసికంగా చికాకులు ఉంటాయి. మీ ముఖంలో తేజస్సు తగ్గే అవకాశం ఉంటుంది. మీ వాక్కులు బాగా కఠినంగా వస్తుంటాయి. నియంత్రించండి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనం వృథాగా ఖర్చు చేసే సందర్భాలు ఎన్నోసార్లు వస్తుంటాయి. ఆదాయం సమయానికి తగిన విధంగా అందకపోవచ్చు. ఆదాయం అందుతుంది. అయితే ఆలస్యంగా అందుతుంది. ఋణాలు కూడా అవసరానికి తగిన రీతిగా సమయానికి అందవు. మీరు ఆర్థిక విషయాలలో ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. మీరు వాగ్దానాలను, హామీలను నెరవేర్చలేరు.
వాహన ఖర్చులు అధికం అవుతాయి. ఆరోగ్య విషయంగా, పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టే అవకాశాలు ఉన్నాయి. నరాలు, చర్మం, ఎముకలు, గుండెజబ్బులు వంటి పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది ఉంటుంది. కొత్త సమస్యలు కూడా రాగలవు. ఈ రాశికి చెందిన స్త్రీలకు తరచుగా ఆలోచనలు స్థిరత్వం కోల్పోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి. తద్వారా కుటుంబ విషయాలకు ఉద్యోగ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితిలో ఉంటారు. జాగ్రత్తపడండి. గర్భిణీ స్త్రీల విషయమై జాగ్రత్తలు చాలా అవసరం. వైద్య సలహాలు చాలా బాగా అనుసరించవలసి ఉంటుది. షేర్ వ్యాపారులకు స్థిరబుద్ధి అవసరం.
ఇతరులతో పోలిక, ఇతరుల సూచనలు తీసుకున్నా మీ బుద్ధినే వాడండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు మందగిస్తాయి. ఒకటి లేదా రెండు సార్లు కూడా వైఫల్యం రావచ్చును. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఎవరినీ నమ్మి ఏ పనులు చేయవద్దని సూచన. కార్య సాఫల్యం తక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి బహు జాగ్రత్తలు అవసరం. స్వబుద్ధి వికాసం ఈ విషయంలో అవసరం. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. బుద్ధి స్థిరం కోల్పోవు అవకాశాలు ఉన్నాయి. అయితే మంచి ఫలితాలు ఉంటాయి. రైతుల విషయంలో మే తరువాత గురువు అనుకూలమే కాబట్టి పంటలకు ఇబ్బంది రాదని అనుకోండి.
ధనిష్ఠ నక్షత్రం 3, 4 వారు తొందరపాటు ధోరణితో చికాకులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపార, ఋణ వ్యవహారాలను ఓర్పుగా నిర్వహించండి. శతభిష నక్షత్రం వారు ఆరోగ్యపరంగా జాగ్రత్త పడవలసిన కాలం. విద్యార్థులు మందగొడిగా అధ్యయనం సాగిస్తుంటారు. శుభకార్యాల పనులు వేగంగా సాగుతాయి. పూర్వాభాద్ర నక్షత్రం 1,2,3 వారు పరిధి దాటి ఋణాలు చేసి స్థిరాస్తి కొనుగోలు చేయు స్థితి ఉంటుంది. తరచుగా సంఘంలో పెద్దలను కలుసుకుంటారు. ఖర్చులు అదుపు తప్పుతాయి.
శాంతి మార్గం: రోజూ ఆంజనేయుని దేవాలయంలో ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. శని, గురువులకు జపం దానం చేయండి. గోపూజ చేయడం శ్రేయస్కరం.
ఏప్రిల్: పనులు శరవేగంగా పూరవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉన్నతాధికారులను సందర్శిస్తారు. బదిలీలు అనుకూలిస్తాయి. వ్యాపారం బాగుంటుంది.
బంధు మిత్రులతో జాగ్రత్త అవసరం. విష్ణు ఆరాధన మంచిది. 15వ తేదీ తరువాత అనుకూలంగా ఉంటుంది. దూరప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆరోగ్య రక్షణ మీద దృష్టి ఉంచుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. షేర్ వ్యాపారులు, రైతులు, మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతారు.
మే: ఈనెల ప్రతి విషయం ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం మంచిది. బంధువర్గంతో విభేదాలు. చివరి వారం మంచి వార్తలు వింటారు. మీ కృషికి తగిన గౌరవం లభించదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార పెట్టుబడులు, నూతన వాహనాల కొనుగోలుకు సమయం అనుకూలము కాదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్, వ్యాపారులకు, విద్యార్థులకు చివరి వారం అనుకూలం.
జూన్: ఈ నెల అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా చేయగలరు. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు సర్దుకుంటాయి. స్థిరాస్తి వ్యవహారం అనుకూలిస్తుంది. ద్వితీయార్ధంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట సరిపడని పరిస్థితి ఉంటుంది. శతభిషా నక్షత్రం వారికి అవమానకర ఘటనలు ఎదురవుతాయి. షేర్, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు సమస్యలను అధిగమిస్తారు.
జులై: ఈ నెల ప్రథమార్ధంలో ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకం. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఋణ సమస్యలు తగ్గుతాయి. ద్వితీయార్ధంలో నిందలపాలవుతారు. నవగ్రహ ఆరాధన మంచిది. ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు అధిక జాగ్రత్తలు పాటించాలి. రైతులు, విద్యార్థులకు అనుకూలత తక్కువ.
ఆగస్ట్: దాంపత్యంలో అన్యోన్యత తగ్గుతుంది. ఇంటా బయట చికాకులు. వ్యర్థ ప్రయాణాల వలన శారీరక శ్రమ, ప్రయోజనం శూన్యంగా ఉంటుంది. నవగ్రహారాధన శుభప్రదం. వృత్తిలో అధికారుల ఒత్తిడి ఉంటుంది. ఋణ, ఆరోగ్య, ప్రయాణ విషయాలలో జాగ్రత్త అవసరం. వస్తువులు చౌర్యానికి గురవుతాయి.
సెప్టెంబర్: ఈ నెల కొంత ఒదిగి ఉండటం మేలు. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఒక శుభం జరుగుతుంది. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. షేర్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు. ఋణ, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల వలన ఇబ్బంది ఉంటుంది.
అక్టోబర్: పనులకు ఆటంకాలు వచ్చినా, వాటిని అధిగమిస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై జాగ్రత్తలు అవసరం. శతభిషా నక్షత్రం వారు కొన్ని సందర్భాలలో తెలివిగా ప్రదర్శించి విజయాలు అందుకుంటారు. ధనం సర్దుబాటు ఇబ్బందికరమైనా, ప్రతి పనికీ ధనం సాధించుకుంటారు. షేర్ వ్యాపారులకు సాధారణ ఫలితాలు. ఫైనాన్స్ వ్యాపారులకు, రైతులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.
నవంబర్: ఈ నెల అంతా అనుకూలమే. సమస్యలు తొలగుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు. శత్రుబాధలు తొలగుతాయి. అవసరానికి తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. దూరప్రాంత ప్రయాణాలు అధికంగా చేస్తారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలు.
డిసెంబర్: ఇంటా బయటా అన్నింటా కార్యజయం. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. విశేష అధికారయోగం. ఆదాయం పెరుగుతుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. భూ– వస్తు– వాహన– ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనాలతో జాగ్రత్త అవసరం. ఆటోమొబైల్ రంగం వారికి చికాకులు వస్తుంటాయి. వ్యాపారాలు మందగమనమే అయినా, అనుకున్న లాభాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులు తొందరపాటు విడనాడాలి.
జనవరి: తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తిలో విశేష గౌరవం. ఆరోగ్యం అనుకూలం. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్త్ర– ఆభరణ– గృహలాభం ఉంది. కొత్త ప్రయోగాలు చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి ప్రయత్నాలను తెలివిగా సానుకూలం చేసుకుంటారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఫిబ్రవరి: కుటుంబంలో అందరూ ఉన్నతస్థానంలో ఉంటారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి. తరచు ప్రయాణాలవల్ల శారీరకశ్రమ. మోసపూరిత వాతావరణం ఉంటుంది. విష్ణు స్తోత్ర పారాయణ మంచిది. 19వ తేదీ నుంచి ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. పిల్లల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తారు. పెద్దల ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచుతారు. షేర్, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు విశేష ఫలితాలు. విదేశీ ప్రయత్నాలకు సానుకూలం.
మార్చి: శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం అభివృద్ధి చూసి ఆనందిస్తారు. వ్యాపారం మిశ్రమంగా సాగుతుంది. శివారాధన మంగళప్రదం.
Comments
Please login to add a commentAdd a comment