తులారాశి వారికి ఈ సంవత్సరం ఇలా జరగవచ్చు | Libra-Tula-Rasi-Ugadi-Panchangam-2024 | Sakshi
Sakshi News home page

తులారాశి వారికి ఈ సంవత్సరం ఇలా జరగవచ్చు

Published Sun, Apr 7 2024 11:26 AM | Last Updated on Sun, Apr 7 2024 12:49 PM

Ugadi Panchangam 2024 - Sakshi

తులా రాశి

ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–1, అవమానం–5.
చిత్త 3,4 పాదములు (రా, రి)
స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా)
విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే)

గురువు మే 1 వరకు మేషం (సప్తమ)లోను తదుపరి వృషభం (అష్టమం)లోను సంచరిస్తారు. శని కుంభం (పంచమం)లోను రాహువు మీనం (షష్ఠం)లోను కేతువు (వ్యయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలాకాలం తరువాత మంచి అనుకూల కాలం ప్రారంభం అయింది. పాత సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. సమయం వృథా చేయవద్దని సూచన. ప్రతి కార్యంలోనూ మీకు ఎన్నో విఘ్నములు ఎదురవుతాయి. అయినా ఓర్పుగా వ్యవహరిస్తే, మీకు విజయం దక్కుతుంది. గురువు సంచారం మే వరకు అనుకూలం. రాహు ప్రభావంగా అన్ని విషయాలలోను చాలా ధైర్యంగా కాలక్షేపం చేస్తారు. ఇది ప్రత్యేక వరము అనే చెప్పాలి. ఉద్యోగ విషయాలలో అధికమైన పరిశ్రమ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. అధికారుల ద్వారా మీకు ప్రోత్సాహం, సహకారం చాలా అధికంగా  ఉంటుంది. మార్కెటింగ్‌ ఉద్యోగులకు బాగా అనుకూల స్థితి ఉంటుంది. శ్రమకొద్దీ లాభం అందుతుంది. వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా వరకు అనుకూల స్థితి ఉంటుంది.

కొన్ని సందర్భాలలో మీకంటే తక్కువ స్థాయి వారితో అవమానాలు, అవరోధాలు రాగలవు. జాగ్రత్తపడండి. కుటుంబ విషయాలు చూస్తే సంతతి విషయంలో బాగా చింతన ఎక్కువ అవుతుంది. జ్ఞాతి విషయంలో వ్యాజ్యాలు ఉన్నట్లయితే, అవి ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంటుంది. ఇతర అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది. పెద్దల సహకారం మీకు బాగా ఉంటుంది. తెలివిగా ప్రవర్తిస్తారు. పాత ఋణాలు, కొత్త ఋణాల విషయంలో మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే చాలా హెచ్చు తగ్గులు ఆదాయ విషయంలో గోచరిస్తాయి. తరచుగా శుభ కార్యాలలో పాల్గొనడానికి, అలంకరణ వస్తువులు కొనుగోలుకు ఖర్చు బాగా పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఆలోచనలు ఫలవంతం అవుతాయి. ఇతరులు కలిగించే ఇబ్బందులు ఒక్కోసారి మీకు లాభదాయకంగా మారడం వలన అమితోత్సాహంగా ఉంటారు. ఆరోగ్యవిషయంగా బహు శ్రద్ధ, జాగ్రత్తలు పాటిస్తారు. తద్వారా ఇబ్బంది లేని విధంగా జీవనం చేస్తారు. పాత ఆరోగ్య సమస్యలకు కూడా చాలా చక్కటి వైద్య సదుపాయం చేకూరుతుంది.

ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్యం బాగా అనుకూలం అవుతుంది. వీరు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బహు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై సుఖజీవనం సాగుతుంది. చాలా ప్రశాంత జీవనం చేస్తారు. షేర్‌ వ్యాపారులకు గురుబలం, రాహు అనుకూలత దృష్ట్యా మంచి ఆలోచనలు చేయడం ద్వారా లాభాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. సుఖంగా ఉంటారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి లాభదాయక కాలము. త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికం అయినా, పనులు సానుకూలం అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులకు గురుబలం బాగుంది. ప్రవేశ పరీక్షలలో కూడా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ. మంచి సలహాలు అందుతాయి. లాభాలు బాగా అందుతాయి.

చిత్త నక్షత్రం 3, 4 పాదముల వారికి ఆర్థిక సహకారం కొంచెం లోపిస్తుంది. బంధు మిత్రుల సహాయ సహకారాలు బాగుంటాయి. ఆరోగ్యం మీద దృష్టి ఉంచుతారు. స్వాతి నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్రానికి చెందిన స్త్రీలు అనుకోని లాభాలు అందుకుంటారు. సంతోషంగా కాలక్షేపం చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. విశాఖ నక్షత్రం 1, 2, 3 వారికి సకాలంలో ఋణ సౌకర్యం సమకూరుతుంది. కొత్త ప్రాజెక్ట్‌లు చేపడతారు. యోగ్యమైన జీవనం సాగిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు.

శాంతి మార్గం: తెలుపురంగు పుష్పాలతో జగదాంబను అర్చించండి. ప్రతి మూడు మాసములకు ఒకసారి నవగ్రహ హోమం చేయండి. రోజూ భువనేశ్వరీ సహస్రనామ పారాయణ చేయండి.

ఏప్రిల్‌: ప్రతి పనిలోనూ అవరోధాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక గౌరవం దక్కుతుంది. వ్యాపారలాభం, ప్రయాణ లాభం ఉన్నాయి. కొత్త పనులు చేపడతారు. భూ– ఆభరణ కొనుగోలు చేస్తారు. షేర్‌ వ్యాపారులు మంచి నిర్ణయాలతో లాభిస్తారు. ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్‌ విషయాలలో అధికారుల తోడ్పాటు బాగుంటుంది. విద్యార్థులకు అన్ని అంశాలూ అనుకూలిస్తాయి. గురువులను పూజ్యులను దర్శిస్తారు. శుభకార్య, సామాజిక కార్యక్రమాలలో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు బాగుంటాయి.

మే: ఈ నెల మధ్యలో కొన్ని కీలక విషయాల నిమిత్తం పెద్దలను సంప్రదిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో జాగరూకతతో ఉండాలి. అధికారయోగం ఉంది. స్త్రీలతో వివాదాలు వద్దు. చేయవలసిన పనులు వదిలి అనవసరమైనవి చేస్తుంటారు. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విదేశీ ప్రయత్నాలు సానుకూలం. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత తక్కువ.

జూన్‌: వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. కొన్ని విషయాలలో మాటపడవలసి వస్తుంది. స్థిరాస్తి పనులు కొంత ఆలస్యమవుతాయి. స్వాతీ నక్షత్రం వారికి తరచు ఆరోగ్య సమస్యలు, కలహాలు ఉంటాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు, షేర్‌ వ్యాపారులకు మంచి సూచనలు అందవు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. 

జులై: ఉద్యోగ వ్యాపారాలలో విశేష గౌరవం, లాభాలు ఉంటాయి. అధికారయోగం ఉంది. ఇతరుల విషయాలలో జోక్యం వలన ఇబ్బందులు కలుగుతాయి. 3వ వారం నుంచి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. అన్ని వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. రోజువారీ కార్యములు అస్తవ్యస్తంగా ఉంటాయి. స్వాతీ నక్షత్రం వారు కలహాలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు, ఋణ సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తలు పాటించాలి.

ఆగస్ట్‌: వృత్తిలో రాణిస్తారు. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు దక్కుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వాహన కొనుగోలుకు అనుకూలం. ఇంట్లో శుభాలు జరుగుతాయి. కొత్త పరిచయాలు, ప్రయాణాలు లాభిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి లావాదేవీలలో జాగ్రత్త అవసరం. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు.

సెప్టెంబర్‌: దైవదర్శనం చేసుకుంటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వస్త్రాభరణ లాభం ఉంది. చిత్త నక్షత్రం వారు తెలివిగా సమస్యలను అధిగమిస్తారు. ఆదాయం సరిగా ఉండదు. ఖర్చులు, ఋణాలలో యిబ్బందులు, పిల్లల వలన చికాకులు ఉంటాయి. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు కాలం ప్రతికూలం. విదేశీ ప్రయత్నాలలో అవరో«ధాలు ఎక్కువ. 

అక్టోబర్‌: మీ పనితీరులో మార్పులు చేస్తారు. ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. అనుకూల బదిలీలు ఉంటాయి. కుటుంబాభివృద్ధి, శుభకార్యాలు జరుగుతాయి. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు మంచికాలం.

నవంబర్‌: ఎక్కువ శ్రమ లేకుండానే పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగ సమస్యలను మీ ప్రతిభతో అధిగమిస్తారు. అధికార యోగం ఉంది. బదిలీలు అనుకూలం.  అలంకరణ వస్తువుల కొనుగోలు కారణంగా ఖర్చు పెరుగుతుంది. షేర్‌ వ్యాపారులకు అధిక లాభములు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు కాలం పరిపూర్ణంగా అనుకూలం.

డిసెంబర్‌: ఈ నెల అత్యంత అనుకూలం. విందు వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలం. స్వేచ్ఛగా ప్రవర్తిస్తారు. పుణ్య క్షేత్ర సందర్శన చేస్తారు. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. 

జనవరి: ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత. కొత్త పరిచయాలు లాభిస్తాయి. మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. కుటుంబంలో చికాకులు, ఆరోగ్య సమస్యలు వల్ల ఇబ్బందులు. భూ– గృహ– వాహన కొనుగోలుకు అనుకూలం. అధికారుల సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుంటారు. పాత ఆరోగ్య, ఋణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తపడండి. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఫిబ్రవరి: ఈనెల అంత అనుకూలంగా లేదు. ప్రతి పనిలోనూ జాప్యం వలన ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులు మీతో సన్నిహితంగా ఉన్నా, మీ జాగ్రత్తలో మీరుండాలి.

పెట్టు బడులు ఆశించిన లాభాన్ని ఇవ్వవు. ఇతరుల విషయాలలో జోక్యం వలన ప్రతికూలత పెరుగుతుంది. నవగ్రహ ఆరాధన మంచిది. రోజువారీ పనులు అకాలంలో పూర్తవుతుంటాయి. విద్యార్థులు విద్యా వ్యాసంగానికి దూరం అవుతారు. సాంఘిక కార్యక్రమాలలో జాగ్రత్త అవసరం. షేర్‌ వ్యాపారులకు అనుకూలం. రైతులకు శ్రమాధిక్యం. ఫైనాన్స్‌ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. మార్చి: కార్యజయం. ఆరోగ్య, ఋణ సమస్యలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. శత్రుబాధలు తగ్గుతాయి. రాజకీయరంగంలో అనుకూలత పెరుగుతుంది. స్త్రీవిరోధం వద్దు. లక్ష్మీస్తోత్ర పారాయణ మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement