ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే | Leo-Simha-Rasi-Ugadi-Panchangam-2024 | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

Published Sun, Apr 7 2024 11:44 AM | Last Updated on Sun, Apr 7 2024 12:46 PM

Ugadi Panchangam 2024 - Sakshi

సింహ రాశి

ఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–2, అవమానం–2.
మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే)
పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ)
ఉత్తర 1వ పాదము (టే)

గురువు మే 1 వరకు మేషం (నవమం)లోను తదుపరి వృషభం (దశమం)లోను సంచరిస్తారు. శని కుంభం (సప్తమం)లోను రాహువు మీనం (అష్టమం)లోను కేతువు (ద్వితీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో సమయపాలన లేకపోవడం మిమ్మల్ని బాగా లాభ ఫలితాలకు దూరం చేస్తుంది. ఉద్యోగ విధి నిర్వహణకు కూడా ఎన్నోసార్లు ఆలస్యంగా వెళతారు. అనవసర ఆలోచనలు, తద్వారా భయాందోళనలు ఎక్కువ అవుతాయి. మీరు ఎంత పద్ధతిగా ఉంటే అంత లాభాలు వచ్చే కాలం. ఇబ్బందులు పోగొట్టుకోవడం మీ ప్రయత్నాలలోనే ఉన్నది. వృథా కాలక్షేపాలు చేయవద్దు. సప్తమ శని వల్ల అన్ని పనులూ ఆలస్యం అవుతుంటాయి. అయితే స్వక్షేత్ర శని అయిన కారణంగా నష్టం ఉండదు. ఉద్యోగ విషయాలలో అధికారుల ద్వారా ఒత్తిడి బాగా పెరగగలదు.

మే నుంచి సంవత్సరాంతం వరకు మీ తోటివారు, మీ కింద స్థాయి ఉద్యోగుల ద్వారా కూడా సహకారం తగ్గగలదు. అందరితోనూ స్నేహభావం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళండి. వ్యాపార లావాదేవీలు బాగానే జరుగుతాయి. నూతన వ్యాపారం ఆలోచనలు కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంటాయి. అదే రీతిగా నూతన ఉద్యోగ ప్రయత్లాలో కూడా సానుకూలత ఉంటుంది. అష్టమ రాహువు వలన మీరు అందరినీ అనుమానించడం, మీరు తరచుగా అవమానాలకు గురికావడం జరుగుతుంది. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. కుటుంబ అవసరాలు తీర్చే పనిలో మీరు అలసత్వం ప్రదర్శిస్తారు. అది ఇబ్బందికరం అవుతుంది. మీకు, కుటుంబ సభ్యులకు మధ్య కార్య నిర్వహణ విషయంగా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి. మనస్తాపం పెరుగుతుంది. బంధువులతో తరచుగా ఇబ్బంది ఉంటుంది. 

జ్ఞాతివైరం ఉన్నవారికి ఈ సంవత్సరం ఆ వైరం పెరగగలదు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం బాగానే ఉంటుంది. అయితే ఆలస్యంగా అందుతుంది. ఖర్చులను నియంత్రించలేని స్థితిలో ఉంటారు. ఋణ సౌకర్యం కూడా ఆలస్యంగా ఉంటుంది. పాత కొత్త ఋణాలు ప్రారంభంలో ఇబ్బందులు సృష్టించినా, క్రమంగా సానుకూలం అవుతుంటాయి. వృథాగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. విద్యా విజ్ఞాన విహార యాత్రల విషయంగా ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. తీసుకుంటారు కూడా. చర్మవ్యాధులు, జీర్ణ సంబంధమైన ఇబ్బంది, రక్తపోటు ఉన్నవారు బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. గమనించండి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువ అవుతుంటుంది.

ఉద్యోగం, కుటుంబం విషయాలలో సమన్యాయంగా వ్యవహరించేందుకు అవకాశాలు ఉండవు. ప్రతి పనీ ఆలస్యం అవుతుండటం వలన మీకు ఆగ్రహావేశాలు పెరుగుతుంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు చాలా అవసరం అనే చెప్పాలి. వైద్య సలహాలు జాగ్రత్తగా పాటించండి. షేర్‌ వ్యాపారులకు దూకుడు తగ్గించమని సూచన. మే నెల తరువాత మీరు వేరే వారితో పోలిక లేకుండా ముందుకు సాగండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ఏ పనీ సవ్యంగా సాగదు. నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు చేయండి. కోర్టు వ్యవహారములలో ఉన్నవారికి చికాకులు పెరిగే అవకాశం ఉంటుంది. పనులు వ్యతిరేకం కాకుండా జాగ్రత్త తీసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి దారి తప్పించేవారు ఎక్కువ అవుతారు. అవకాశం ఉంటే కొనుగోలు వాయిదా వేయండి. విద్యార్థులకు మానసిక వ్యవస్థ విద్యా వ్యాసంగముల కంటే ఇతర అంశాల మీదకు ఎక్కువగా ప్రసరిస్తుంది. రైతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా ఆశించిన ఫలితాలు అందవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ.

మఘ నక్షత్రం వారు పనులు వాయిదా వేయడం వలన సమస్యలు ఎదుర్కొంటారు. షేర్‌వ్యాపారులు, మార్కెటింగ్‌ ఉద్యోగులు సందర్భానుసారంగా ప్రవర్తించక గడ్డు పరిస్థితులు తెచ్చుకుంటారు. అవసరానికి తగిన ధనం సర్దుబాటు అవుతుంది. పుబ్బ నక్షత్రం వారు వృథా కాలక్షేపం చేస్తారు. విద్యా, విజ్ఞాన కార్యక్రమాలలో పాల్గొంటారు. ద్వితీయార్ధంలో ధైర్యంగా అనేక విజయాలు సాధిస్తారు. బంధు మిత్రులు సహకరిస్తారు. ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు పుణ్య, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి విషయాలలో సమస్యలు తీరతాయి.

శాంతి మార్గం: శని, రాహు గ్రహశాంతి చాలా అవసరం. ప్రాతఃకాలంలో నిత్యం ఆంజనేయస్వామి వారి దేవాలయంలో రామనామం చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదోష కాలంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం.

ఏప్రిల్‌: ఈ నెల ప్రతివిషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇతరులపై పనిభారం మోపి, నిద్రావస్థలో ఉంటే నష్టపోతారు. అహంభావంతో ఇబ్బందుల్లో పడతారు. ఖర్చులు, ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. షేర్‌ వ్యాపారులు జాగ్రత్త కనబరచాలి. విద్యార్థు్థలకు, రైతులకు ఆశించిన ఫలితాలు అందవు.

మే: ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు చూస్తారు. ఋణబాధల నుంచి విముక్తి. ఉన్నత పదవులు చేపడతారు. అధికారుల మెప్పు పొందుతారు. కుటుంబ వాతావరణం ఆనందం కలిగిస్తుంది. కుజశాంతి శుభప్రదం. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం శూన్యం. రైతులకు అనుచిత సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత లేదు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు పనులు వాయిదా వేయడం శ్రేయస్కరం.

జూన్‌: వృత్తిలో రాణిస్తారు. విశేష ధనలాభం. బదిలీలు అనుకూలం. రాజకీయ రంగంలో వారికి మంచి పదవులు దక్కుతాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. నెలాఖరున ఒక శుభవార్త అనందం కలిగిస్తుంది. భవిష్యత్‌ కార్యాచరణ కోసం కృషి చేస్తారు. విద్యార్థులకు, రైతులకు, షేర్‌ వ్యాపారులకు ఈ నెల రోజులు అనుకూలం. పుబ్బా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు తప్పవు. 

జులై: నేర్పుతో పనులన్నీ సునాయాసంగా పూర్తిచేస్తారు. శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. శత్రుబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. సాంఘిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫైనాన్స్, వ్యాపారులు, షేర్‌ వ్యాపారులకు 16వ తేదీ తరువాత చికాకులు ఉంటాయి. ఆగస్ట్‌: పనిఒత్తిడి పెరిగినా, సకాలంలో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఖర్చులకు తగిన ఆదాయం లభిస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. 18వ తేదీ నుంచి మఘ నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు రాగలవు. విద్యార్థులు అధిక శ్రమ చేయాలి. రైతులకు అనుకూలత తక్కువ. సెప్టెంబర్‌: ఆర్థిక లాభాలు, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. ఉన్నత పదవులు చేపడతారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఉత్సాహం కోల్పోకుండా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తుంది.

13వ తేదీ వరకు పుబ్బ నక్షత్రంవారికి పనులు ఇబ్బందికరం కాగలవు. షేర్‌ వ్యాపారులు మంచి తెలివి, ధైర్యం ప్రదర్శించి కాలం అనుకూలం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. సకాలానికి ఋణాలు అందుతాయి. అక్టోబర్‌: ఉన్నతాధికారులను సందర్శిస్తారు. విశిష్ట బాధ్యతలు చేపడతారు. శత్రుబాధల నుంచి విముక్తి. ఈనెల నుంచి ఊహించని ఖర్చులు, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, దాంపత్యసౌఖ్యం లోపించడం జరుగుతాయి. కుజశాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్‌ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు ఇబ్బందికరం అవుతాయి. నవంబర్‌: పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. çసంతానం రాణింపు ఆనందం కలిగిస్తుంది. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.

మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. పనులు ఆలస్యం అవుతుంటాయి. దూరప్రాంత ప్రయాణాలు విరమించండి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ. డిసెంబర్‌: ఈ నెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉన్నది. మీ తప్పు లేకున్నా నిందలు పడవలసి వస్తుంది. స్త్రీ విరోధం, దాంపత్య విభేదాలు కలుగుతాయి. మౌనం మంచిది. విద్యార్థులకు సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. షేర్‌ వ్యాపారులు ఇబ్బందికి గురవుతారు. కోర్టులు, స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి. 

జనవరి: ఇతరుల విషయాలలో జోక్యం లేకుండా, మీ పనులలో శ్రద్ధవహిస్తే లక్ష్యాన్ని సాధించ గలుగుతారు. ఋణ– రోగ– శత్రు బాధల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలం. షేర్‌ వ్యాపారులు తొందరపాటుతనం తగ్గించాలి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో సానుకూలత తక్కువ. ఫిబ్రవరి: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. అకాల భోజనం, వ్యర్థ ప్రయాణాల వలన ఆరోగ్య సమస్యలు. వృత్తిలో ఊహించని మార్పులు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పుబ్బ నక్షత్రం వారు విశేష లాభాలు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలం. షేర్‌ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులు, రైతులు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మార్చి: భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు. పనులు నత్తనడకన సాగుతాయి. స్థిరాస్తుల విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement