కర్కాటక రాశి
ఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–6, అవమానం–6
పునర్వసు 4వ పాదము (హి)
పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా)
ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ)
గురువు మే 1 వరకు మేషం (దశమం)లోను తదుపరి వృషభం (లాభం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (అష్టమం)లోను రాహువు మీనం (నవమం)లోను కేతువు (తృతీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. సమయపాలనతో ఏ పనీ కూడా చేయరు. పుణ్యకార్యాలలో ఎక్కువ కాలక్షేపం జరుగుతుంది. అన్న, వస్త్ర, స్నానాది కార్యక్రమాలు కూడా ఆలస్యంగా చేయవలసి వస్తుంది. కొన్ని పనులను దాటవేసే ఆలోచనలు చేస్తారు. కొన్ని పనులను ధైర్యంగా సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. తరచుగా ‘నరఘోష’కు గురి అవుతుంటారు. తద్వారా చికాకు పడతారు. అష్టమ శని వల్ల అన్ని రంగాలలోనూ స్నేహితుల మధ్య, బంధువుల మధ్య కలహాలు తలెత్తుతాయి. జాగ్రత్తపడండి. ఉద్యోగ విషయాలు చాలా శ్రమాధిక్యం అవుతుంటాయి.
మీకు గురుబలం దృష్ట్యా అన్ని పనులు చేయడానికి తగిన ఆలోచనలు చేయగలిగినా, అమలు చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ప్రమోషన్‌కు తగిన అర్హతలు ఉన్నప్పటికీ అడ్డంకులు చాలా ఉంటాయి. నమ్మకంగా మీ పక్కనే ఉంటూ మీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేవారు అధికంగా ఉంటారు. వ్యాపారులకు వ్యాపారం బాగానే ఉన్నా, ప్రభుత్వ అధికారుల ద్వారా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి సలహాలు అందుతాయి. కుటుంబ విషయాలు చూస్తే మీ ప్రవర్తన కొన్ని సందర్భాలలో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు మీ బంధువులు బాగా సహకారం చేస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గురుబలం బాగా ఉన్న కారణంగా పిల్లల అభివృద్ధి కూడా బాగుంటుంది. తరచుగా ప్రయాణములు అధికంగా చేయడం తద్వారా ఆరోగ్య, ఆర్థిక చికాకులు పొందడం ఉంటుంది.
ఆర్థిక విషయాలు పరిశీలిస్తే లాభంలో మే 1 నుంచి గురువు సంచరించడం ప్రారంభించాక చాలా మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. ఆదాయం బాగా ఉన్నా, ఖర్చులు మీ ఇష్టానుసారం ఉండవు. పాత ఋణాలు తీర్చడానికి ఉంచిన ధనం కూడా ఇతర అవసరాలకు వినియోగిస్తారు. కొత్త ఋణాలు అవసరానికి తగిన రీతిగా అందుతాయి. వాహనాల కొనుగోలు ఆలోచనలు ఫలప్రదం అవుతాయి. ఆరోగ్య విషయంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. తద్వారా సమస్యలను దాటవేసే ప్రయత్నంలో సఫలం అవుతారు. కొత్త కొత్త సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే, ముందు జాగ్రత్తలతో దాటవేయగలరు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఎంత శ్రమించినా తగిన గుర్తింపు రాదు. అలాగని బాధపడక ముందుకు సాగుతారు. ఉద్యోగ, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం బాగుంది. కాబట్టి ఇబ్బందులు రావనే చెప్పాలి.
మానసిక ఆందోళన ఉంటుంది. షేర్ వ్యాపారులకు అనుకూలమైన సమయం గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. కానీ నష్టపడే కాలం కాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అవరోధాలు ఎక్కువ. విద్య నిమిత్తంగా వెళ్ళేవారు శ్రమతో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు చికాకులు చూపుతాయి. కలçహాలు కోర్టు విషయంగా పెరగగలవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనం సర్దుబాటు ఉన్నా, వస్తు నిర్ణయం విషయంలో శ్రమ ఎక్కువ. విద్యార్థులు విద్యా విషయంగా బాగుంటుంది. ఇతర, అనవసర విషయాలు తరచుగా ఇబ్బంది కలిగిస్తాయి. రైతుల విషయంలో తెలివిగా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అయినా కొన్నిసార్లు చేతికి వచ్చిన పంట చేజారుతుంది.
పునర్వసు నక్షత్రం 4 వారికి బంధు మిత్రులు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబానికి, వృత్తికి సమతూకంగా కాలం కేటాయించలేక అసహనం చెందుతారు. స్వయంగా పర్యవేక్షించే పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. పుష్యమి నక్షత్రం వారికి తరచు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాలు, స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అధిక వ్యయంతో సఫలమవుతాయి. ఆశ్లేష నక్షత్రం వారికి కొన్నాళ్లు అనుకూలం, కొన్నాళ్లు ప్రతికూలంగా సంవత్సరం అంతా గడుస్తుంది. కోర్టు వ్యవహారాలలో నమ్మినవారు మోసం చేసే అవకాశం ఉంది. సాంఘిక కార్యక్రమాలలో గౌరవభంగం జరగవచ్చు.
శాంతి మార్గం: శని, రాహువులకు జపం, దానం చేయించండి. ఆంజనేయస్వామి దేవాలయంలో ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి, తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి.
ఏప్రిల్: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తుపై స్పష్టత వస్తుంది. నూతన వస్త్రధారణ, ఆభరణ– వాహనాల కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువర్గంతో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ, సామాజిక వ్యవహారాల్లో మౌనం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. రైతులు, మార్కెటింగ్ ఉద్యోగులు, షేర్ వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించి మంచి ఫలితం అందుకుంటారు. మే: వృత్తి వ్యాపారాలలో ఊహించని అనుకూలత. ఆర్థిక లాభాలున్నా, ఖర్చులు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించును. అవరోధాలను అధిగమిస్తారు. ఋణాల విషయంలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి. రైతులకు అనుకూలం. జూన్: స్థానమార్పులు ఉంటాయి. పట్టుదలతో పనులన్నీ పూర్తిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. ఫైనాన్స్ షేర్ వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాలలో కిందిస్థాయి వారితో చికాకులు తప్పవు. అధికారుల అండదండలు ఉంటాయి. కోర్టు విషయాలు, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలం.
జులై: పనులు లాభదాయకంగా ఉంటాయి. ధనం నిల్వ చేయగలరు. ఊహించని ప్రయాణాల వల్ల ఇబ్బందులు. శుభవార్తలు వింటారు. భూ–గృహలాభం ఉంది. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. రైతులు, విద్యార్థులు శ్రమతో మంచి ఫలితాలు అందుకుంటారు.
ఆగస్ట్: ఈ నెల ఏ పని చేపట్టినా అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబ విషయమై డబ్బు నీళ్ళలా ఖర్చవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత లోపిస్తుంది. 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆశ్లేషా నక్షత్రం వారికి కుటుంబ సభ్యులతో సయోధ్య కుదరని సందర్భాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు అనుకూలం.
సెప్టెంబర్: మనోధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులను ప్రభావితం చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులు రాబోవు ఆరు మాసాలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య, ఆర్థిక, ఋణ వ్యవహారాలలో రాబోవు ఆరు మాసాలు ప్రతికూల స్థితి. శని కుజ గ్రహముల శాంతి చేయించండి.
అక్టోబర్: పనుల్లో ఆలస్యం, శారీరక రుగ్మతల బాధ పెరుగుతాయి. మనోధైర్యం తగ్గుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్తి వివాదాలు తలెత్తుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. మీకు లేదా మీ కుటుంబ పెద్దలకు వైద్యం అత్యావశ్యకం అవుతుంది. అతి శ్రమ చేస్తారు. షేర్ వ్యాపారులు, రైతులు, విద్యార్థులు తెలివి, ఓర్పుతో సమస్యలను అధిగమిస్తారు.
నవంబర్: రానున్న 5 నెలలు అనేక సమస్యలు ఉంటాయి. కుజ శాంతి చేసుకోవడం మంచిది. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఇతరులపై ఆధారపడకుండా వ్యవహరించాలి. మనస్పర్ధలు ఉంటాయి. మీరు చేయవలసిన పనులు ఆలస్యం కావడం వల్ల కుటుంబంలో చికాకులు మొదలవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అనుకూలతలు లేవు. షేర్ వ్యాపారులు నష్టపడకుండా బయటకు రావడం కష్టసాధ్యం. శుభకార్య ప్రయత్నాలు, అభివృద్ధి ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేయవద్దని సూచన.
డిసెంబర్: వృత్తిలో విశేష గుర్తింపు లభిస్తుంది. నిరాటంకంగా పనులు పూర్తవుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఉన్నతాధికారుల సందర్శనం, అనుకూల బదిలీలు ఉంటాయి. ఋణ సమస్యలు తగ్గుతాయి. దాంపత్యంలో ఇబ్బందులు, పిల్లల నుంచి సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫలితం తక్కువ. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించుకోవాలి. స్థిరాస్తి లావాదేవీలు, కోర్టు వ్యవహారాలలో వాయిదాలు శ్రేయస్కరం.
జనవరి: శారీరక శ్రమ పెరుగుతుంది. అకాల ప్రయాణాలతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో మనస్పర్థల వలన మనస్తాపం. బంధువర్గం సహకరిస్తారు. ఋణవిముక్తి కలుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పునర్వసు నక్షత్రంవారికి కలహ, ఋణ, ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండవచ్చు. షేర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు, రైతులకు బాగా అనుకూలం. ఫిబ్రవరి: మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులు కలుగుతాయి. పనులు ఆలస్యమైనా, సహనంతో పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. విష్ణు ఆరాధన మంచిది. బంధు మిత్రులకు సేవ చేయవలసిన పరిస్థితి వలన మీ దైనందిన కార్యక్రమాలు ఆలస్యం అవుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు ఫలితాలు బాగుంటాయి. ఫైనాన్స్ వ్యాపారాలకు, విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మార్చి: కుటుంబ పెద్దలకు స్వల్ప ఆరోగ్య సమస్యలు. తీర్థయాత్రలు చేస్తారు. వృత్తిలో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో మందగమనం. అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు.
Comments
Please login to add a commentAdd a comment