
నిద్రమాత్ర వేసుకోకపోతే ఆ రాత్రికి ఇక నిద్ర లేనట్లే అన్న పరిస్థితిలో చాలామంది తమకు తెలియకుండా నిద్రమాత్రలకు బానిసవుతుంటారు. ఈ మాత్రలు మెదడు, కేంద్ర నాడీవ్యవస్థల పనితీరుపై ప్రభావం చూపి, ఆందోళనను తగ్గించి నిద్రపట్టేలా చేస్తాయి. అయితే వీటి వాడకం ఎక్కువైతే ఎదురయ్యే సైడ్‌ఎఫెక్ట్స్ చాలా శక్తిమంతమైనవి. పగలు కూడా నిద్ర ముంచుకొస్తున్నట్లు, మెదడు పని చేయడానికి సహకరించక బద్దకంగా అనిపించడం, తల తిరగడం, అయోమయం, చూపు అస్పష్టంగా మారడం, తలంతా పట్టేసినట్లు ఉండడం, మానసిక ఆందోళన అంతలోనే ఉద్వేగం వెంటనే ఆనందం ఇలా క్షణక్షణానికీ మారడం (మూడ్ స్వింగ్స్), జ్ఞాపకశక్తి లోపించడం వంటి సమస్యలను కొనితెచ్చుకున్న వాళ్లమవుతాం.
నిద్రమాత్రలను వరుసగా రెండువారాలు వాడితే దేహం వాటికి అలవాటు పడిపోతుంది. ఆ తర్వాత డోస్ పెంచాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. నిద్రమాత్ర వేసుకోకపోతే మానసిక ఆందోళన, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రదశకు చేరితే మూత్రవిసర్జన కష్టం కావడం, ఇతర మూత్ర సంబంధ సమస్యలు, నోరు పొడిబారిపోవడం వంటి లక్షణాలకు దారి తీస్తుంది.
మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు స్లీపింగ్ పిల్స్ వాడకాన్ని డాక్టర్లు ఎందుకు సూచిస్తారంటే... అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో తగుమాత్రం డోస్‌ను సూచిస్తారు. వాటి వాడకం ఆ సమస్య నుంచి బయటపడే వరకు మాత్రమే పరిమితం చేస్తారు. ప్రిస్క్రిప్షన్‌లో నిద్రమాత్రలను రాసినట్లు తెలియనివ్వరు. తెలిస్తే ఎవరికి వారు తరచూ వాడి ఇతర సమస్యలు కొనితెచ్చుకుంటారనే ఉద్దేశంతోనే ఈ జాగ్రత్త.