భారీ గుమ్మడిపండును డొల్లగా చేసి, దానినే పడవగా మార్చుకున్నాడు. గుమ్మడిపండు డొల్లలో కూర్చుని, తెడ్డు వేసుకుంటూ నదిని దాటేసి, గిన్నిస్ రికార్డు సాధించాడు. విచిత్రమైన ఈ రికార్డు సాధించిన వ్యక్తి వయసు అరవయ్యేళ్లు. అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రానికి చెందిన డ్యుయానే హాన్సెన్ ఆగస్టు 26న తన అరవయ్యో పుట్టినరోజు సందర్భంగా ఈ సాహసకృత్యానికి సిద్ధపడ్డాడు.
పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న మరుసటి రోజునే మిసోరీ నది వద్దకు చేరుకుని, ఆగస్టు 27 ఉదయం 7.30 గంటలకు గుమ్మడి తెప్పలో ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ భారీ గుమ్మడి తెప్ప విస్తీర్ణం 146 అంగుళాలు. ఇందులో ఇంచక్కా కూర్చుని, తెడ్డు వేసుకుంటూ ముందుకు సాగాడు. మధ్యాహ్నం 2.52 గంటలకు విజయవంతంగా 38 మైళ్ల ప్రయాణం పూర్తిచేసుకున్నాడు.
అయోవా రాష్ట్ర సరిహద్దుల్లోని అవతలి ఒడ్డుకు చేరుకుని, గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. ఇదివరకు రిక్ స్వెన్సన్ అనే వ్యక్తి ఇలాగే గుమ్మడి తెప్పలో 25.5 మైళ్ల దూరం ప్రయాణించాడు. రిక్ 2016లో మిన్నెసోటాలోని నార్త్ డకోటా నుంచి బ్రెకెన్‌రిడ్జ్ వరకు ప్రయాణించి నెలకొల్పిన రికార్డును డ్యుయానే హాన్సెన్ తిరగ రాశాడు. ఈ రికార్డు కోసం డ్యుయానే చాలానే కష్టపడ్డాడు. తన పెరటితోటలో పదేళ్లు శ్రమించి, 384 కిలోల భారీ గుమ్మడిని అపురూపంగా పెంచి, దానిని జాగ్రత్తగా డొల్లగా మార్చి, తెప్పలా తయారు చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment