ఆనందంగా జీవించే వారికి వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. అచ్చం ఇలాగే.. ఏడు పదుల వయసు దాటిన తర్వాత కూడా బాడీ బిల్డర్‌గా రికార్డులు బద్దలు కొడుతోంది ఈ బామ్మ. ఈమె పేరు రెబెకా వూడీ. అమెరికాకు చెందిన రెబెకా అథ్లెట్స్ కుటుంబంలో జన్మించింది. తండ్రి, అన్నయ్య ఇద్దరూ గోల్డన్ గ్లోవ్స్ బాక్సర్స్. రెబెకా తండ్రికి ఒక కోచింగ్ సెంటర్ కూడా ఉంది. అక్కడ మగపిల్లలతో పాటు, ఆడపిల్లలు కూడా బాడీ బిల్డింగ్‌తో బాక్సింగ్, ఫుట్‌బాల్, బేస్ బాల్, బాస్కెట్ బాల్ వంటి క్రీడల్లో శిక్షణ తీసుకునేవారు. అలా వారిని చూసి, చిన్నప్పుడే తానూ బాడీ బిల్డర్ కావాలని నిర్ణయించుకుంది.
తండ్రి ప్రోత్సాహంతో బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలు సాధించింది. అయితే, తన నలభయ్యో ఏట చక్కెర వ్యాధి రావడంతో పోటీలకు స్వస్తి పలకాలని వైద్యులు ఆమెకు సూచించారు. అయినా తను బాడీబిల్డింగ్‌ని ఆపలేదు. ఇక తన 73వ ఏట అయితే, ఇకపై పోటీల్లో పాల్గొంటే ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారట. అప్పుడు కూడా ఆమె వెనుకడుగు వేయలేదు. వైద్యుల మాటను వమ్ము చేస్తూ.. 111 కిలోగ్రాముల పోటీలో పాల్గొని చాంపియన్‌గా నిలిచింది. ఇన్ని విజయాలు సాధించే ఈ బామ్మకు ఇప్పటికీ పిజ్జా, మెక్సికన్ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. ‘ఇష్టమైన ఆహారం తీసుకుంటూ, ఆనందంగా జీవిస్తే ఏ అనారోగ్యమూ మిమ్మల్ని ఏమీ చేయలేదు’ అంటోంది ఈ బాడీబిల్డర్ బామ్మ.
చదవండి: 127 గంటలు.. డ్యాన్స్!
Comments
Please login to add a commentAdd a comment