అందానికి కొలతలెందుకు? | Varshita Thatavarthi: Vizag Plus Size Model | Sakshi
Sakshi News home page

సౌందర్యాన్ని టేప్‌తో కొలవకండి

Published Wed, Dec 16 2020 2:13 PM | Last Updated on Wed, Dec 16 2020 5:11 PM

Varshita Thatavarthi: Vizag Plus Size Model - Sakshi

మోడలింగ్‌ ప్రపంచం పొడవైన, సన్నగా ఉండేవారినే అందంగా పరిగణిస్తుంది. ఇది ప్రాచీన కాలం నుండి అందం ప్రమాణాలుగా పరిగణించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది మహిళలను ‘మేమిక మోడలింగ్‌కి పనికిరాము’ అనే నిరాశలో ముంచేసింది. అందం అంటే ఇన్నాళ్లుగా కొనసాగుతూ వస్తున్న మూస పద్ధతులను విచ్ఛిన్నం చేసింది వైజాగ్‌ అమ్మాయి వర్షిత తటవర్తి. అందానికి కొలతలెందుకు? అని ప్రశ్నించడమే కాదు... అందుకు తగిన సమాధానమూ ఇచ్చింది. వర్షిత చిన్నప్పటి నుంచీ బొద్దుగానే ఉండేది.

కానీ ఆమెకు మోడలింగ్, సినీ రంగం అంటే అమితమైన ఇష్టం. కోరుకున్న రంగాల్లో తన ప్రతిభను చాటాలనుకుంది. కానీ, చుట్టూ ఉన్నవారు లావుగా ఉంటే అవకాశాలు రావు అన్నారు. అందుకు, 15 కిలోల బరువు తగ్గి మరీ మోడలింగ్‌కు సంబంధించిన పోర్ట్‌ఫోలియోను తయారు చేసి, ఏజెన్సీలలో ఇచ్చింది. ‘కానీ, నా నడుము భాగం సరిగ్గా లేదని, మోడలింగ్‌కు సరిపోనని రిజక్ట్‌ చేశారు’ అని పాతికేళ్ల వర్షిత పేర్కొనడం చూస్తే అందం అంటే కొందరు నిర్దేశించిన కొలతల్లో స్త్రీ తనను తాను హింసించుకుంటూ ఇమిడి పోవాల్సిందేనా? అనిపించకమానదు.

అన్నింటా తిరస్కారాలే..
ఆమె దక్షిణాది సినిమాల్లో ముఖ్యంగా టాలీవుడ్‌లో ప్రతిభ కనబరచాలనుకొని కొన్ని ఏజెన్సీలను, దర్శకులనూ కలిసింది. కానీ, ‘దక్షిణాది అమ్మాయిగా కనిపిస్తున్నావ’నే తిరస్కారాలను ఎదుర్కొన్నాను అని’ ఆమె వెల్లడించింది. బరువు తగ్గి, ఫెయిర్‌నెస్‌ చికిత్స తీసుకోమని సలహాలు ఇచ్చేవారు ఎందరో. ఆ పాట్లన్నీ పడింది వర్షిత. విశాఖపట్నంలో పుట్టి ఢిల్లీలో పెరిగిన వర్షిత మణిపాల్‌లో డిగ్రీ చేసింది. మణిరత్నం సినిమాలపై పెంచుకున్న ప్రేమ 2017లో ఆమెను చెన్నైకి తీసుకెళ్లింది. కానీ, అక్కడా ఆమెకు నిరాశే ఎదురయ్యింది.

ఆభరణాల ప్రదర్శనలో వరించిన అదృష్టం
మనసులో గట్టిగా అనుకుంటే ఏదో ఒకరోజు అవకాశం మనల్ని తప్పక వరిస్తుంది అనడానికి నిదర్శనం ఓ రోజు వర్షిత జీవితం లో జరిగింది. వర్షిత ఫ్రెండ్‌ చెన్నైలోని ఒక ఆభరణాల ప్రదర్శనకు డిజైనర్‌ సబ్యసాచిని ఆహ్వానించాడు. ‘సబ్యసాచి ఆ ప్రదర్శనలో ఉన్నారని తెలుసుకున్న వర్షిత అక్కడకు వెళ్లి, అతని డిజైన్స్‌కు అభిమానని చెప్పింది. ‘సబ్యసాచితో కలిసి ఒక ఫొటో తీసుకున్నాను. దానిని నా ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేసాను. రెండు నెలల తరువాత, సబ్యసాచి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ ‘ఫొటో షూట్‌లో పాల్గొనడానికి రమ్మని.’ ఆ రోజు నా ఆనందం అంతా ఇంతా అని చెప్పలేను’  అని పేర్కొన్న వర్షిత అప్పటినుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. మోడలింగ్‌లో వర్షిత బ్యూటీ ఐకాన్‌ గా మారింది. ప్రశంసల వెల్లువ మొదలయ్యింది.

ఆ‘కట్టు’కున్న ఆత్మవిశ్వాసం
కిందటేడాది సబ్యసాచి రూపొందించిన అందమైన ఎర్రని పెళ్లి లెహంగాలో వేదికపై నడిచినప్పుడు ఆమె ఆత్మ విశ్వాసం ఆ ర్యాంప్‌ షోలో చాలామందిని ఆకట్టుకుంది. దీంతో చాలా ఆఫర్లు ఆమెను వరించాయి. ‘సబ్యసాచి కూడా ఎప్పుడూ ప్లస్‌సైజ్‌ మోడల్‌గా పేర్కొనలేదు. ఇతర మోడళ్ల మాదిరిగానే గుర్తించాడు’ అని అభిమానం వ్యక్తం చేస్తారు వర్షిత. చాలామంది ‘ప్లస్‌ సైజ్‌’ మోడల్‌గా సంబోధించినప్పుడు అది ఒక అవకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా మోడల్‌ అనగానే సన్నగా ఉండే మోడల్స్‌నే సూచిస్తారు. ఇది శరీర వివక్ష. నా శరీరం అపఖ్యాతి పాలైన పరిశ్రమలోనే ‘ఆమోదయోగ్యమైనది’ అనే ప్రయత్నం చేశాను’ అని అభిప్రాయపడ్డారు వర్షిత.

ప్రకటనలతో దారుణాలు
బాల్యం నుంచి బొద్దుగా ఉండే వర్షిత తన శరీరం సన్నగానే ఉండాలనే నియమం ఎప్పుడూ పెట్టుకోలేదంది. ‘ఉదయం లేచింది మొదలు టీవీల్లోనూ, సోషల్ ‌మీడియాలోనూ ‘ఫెయిర్‌ నెస్‌ క్రీములు, పౌడర్ల’ గురించి ప్రకటనలు విరివిగా వస్తుంటాయి. స్కూల్‌కెళ్లే అమ్మాయిలు వాటిని చూసి అవే సరైనవని అనుకుంటారు. దీంతో ‘శరీరాన్ని ఒక మూసలో సర్దుబాటు చేసుకోవాలనే ఆలోచన అంత చిన్నవయసులోనే నాటుకుంటుంది. లేదంటే, అనాకారిని’ అనే ఆత్మన్యూనతలో అమ్మాయిలు పడిపోవాల్సిన దుస్థితి మారాల’నే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు ఈ మోడల్‌.


    
కిందటేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వర్షితతో సబ్యసాచి చేసిన ఫోటోషూట్‌ మీడియా వేదికగా తెగ వైరల్‌ అయ్యింది. అందానికి నిబంధనలు లేవని నిరూపించారంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురిపించారు. శరీర కొలతలతో పని లేకుండా సిసలైన అందానికి చిహ్నంగా కొనసాగుతున్నందున వర్షితను నెటిజన్లు అభినందనలు తెలిపారు. ఆమె ఇన్‌బాక్స్‌ ప్రపంచవ్యాప్తంగా మహిళల ప్రశంసలు, సందేశాలతో ఇప్పటికీ నిండిపోతూనే ఉంది. వర్షిత కథ ప్రతి స్త్రీకి ప్రేరణగా నిలుస్తుంది. కాలక్రమంలో అధిక బరువు వల్ల వచ్చే నష్టాలను గమనించి, ఇప్పుడు స్లిమ్‌గా మారింది వర్షిత. ఏదేమైనా ఓవర్‌ వెయిట్‌ మోడల్స్‌ అనే కొత్త ట్రెండ్‌కి దక్షిణాది మోడల్‌గా వర్షిత నిలిచిపోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement