రేఖతో వినోద్ మెహ్రా
వినోద్ మెహ్రా.. పేరు చెప్పగానే నాటి (1970, 80ల) బాలీవుడ్ అభిమానులకు బిందియా గోస్వామి గుర్తొస్తుంది.. ఆ వెంటనే రేఖ మెరుస్తుంది. ఈ ఇద్దరితో అతను ప్రేమలో పడ్డాడు. కెరీర్‌లో స్టార్‌గా వెలిగిన వినోద్ మెహ్రా .. ప్యార్ కా సఫర్ (ప్రేమ ప్రయాణం) మాత్రం సంతోషాల మజిలీ చేరలేదు. విషాదాంతంగా ముగిసి తీరని వ్యథను మిగిల్చింది.. ఆ బాధను రేఖా అనుభవించింది. 1958లో వచ్చిన ‘రాగినీ’ అనే సినిమాలో బాలనటుడిగా నటించిన వినోద్ మెహ్రా తర్వాత ఒకట్రెండు చిత్రాల్లో కనిపించినా, చదువు మీదే శ్రద్ధ పెట్టాడు. చదువయ్యాక ‘గోల్డ్‌ఫీల్డ్ మర్కంటైల్’లో ఎగ్జిక్యుటివ్‌గా ఉద్యోగంలో ఒదిగిపోయాడు.. నటన విషయమే మరిచిపోయి. స్నేహితుల ప్రోద్బలంతో ‘ఆల్ ఇండియా టాలెంట్ కంటెస్ట్ (1965)’లో పాల్గొన్నాడు. ఫైనల్లో రాజేశ్ ఖన్నాతో పోటీపడ్డాడు.
రన్నరప్ టైటిల్‌తోపాటు సినిమా చాన్స్‌లూ అతని చెంత చేరాయి. ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. ‘ఏక్ థీ రీటా’ హీరోగా అతని మొదటి సినిమా. వినోద్‌ను ప్రేక్షకులు గుర్తుపట్టి.. నటుడిగా గుర్తించడంతో ఆగకుండా సాగింది అతని కెరీర్. ఆ సమయంలోనే వినోద్‌కు పెళ్లి సంబంధం తెచ్చింది వాళ్లమ్మ. వధువు మీనా బోక్రా. పెళ్లయింది. చేతినిండా సినిమాలు.. తోడుగా చేరిన భాగస్వామితో ఆనందంగా గడిచిపోతున్న సమయంలో అతనికి గుండెపోటు వచ్చింది. ఊహించని ఆ కుదుపుతో సినిమా ఆఫర్లు ఆగకపోయినా.. వైవాహిక జీవితంలో మాత్రం పగుళ్లు కనిపించాయి.
ఆఫ్టర్ ది బ్రేక్
ఆరోగ్యం కుదుట పడ్డా మీనా వ్యవహారం వినోద్‌ను కలవర పెట్టింది. అప్పుడే అతని సహనటి బిందియా గోస్వామితో స్నేహం కుదిరింది. అది ప్రేమగానూ మారింది. ఇంట్లోంచి వెళ్లిపోయి ఆమెతో హోటల్‌లో ఉండసాగాడు. ఈ విషయం భార్య మీనా ద్వారా ఆమె తండ్రికి తెలిసింది. అల్లుడిపై విరుచుకుపడ్డాడు. ఆ జంటను వేటాడడం మొదలుపెట్టాడు. ఈ నిజానికి కల్పనలు జోడించి మీడియా పండగ చేసుకోసాగింది. ఈ వ్యవహారానికి భయపడిపోయిన బిందియా గోస్వామి– తన స్నేహితుడు జేపీ దత్తా (రచయిత, దర్శకుడు, నిర్మాత) అండ కోరుకుంది. దాంతో వినోద్‌కు దూరమై జేపీ దత్తాకు చేరువైంది (ఆ తర్వాత అతణ్ణి పెళ్లీ చేసుకుంది బిందియా). ఈ పరిణామానికి కుంగిపోయాడు వినోద్. ఇటు అతని భార్య మీనా విడాకుల కోసం కోర్ట్‌లో కేసు వేసింది.
సెకండ్ లవ్..
బిందియా గోస్వామి వదిలేసి వెళ్లడం.. జీవిత భాగస్వామి విడాకులివ్వడం వినోద్‌ను కలత పెట్టాయి. ఆ టైమ్‌లో అతనికి ఊరటగా కనిపించింది రేఖ. మొదటి నుంచీ ఈ ఇద్దరూ మంచి మిత్రులు. వీళ్లు కలిసి చేసిన సినిమాలూ హిట్టే. హిట్ పెయిర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. నిజానికి అప్పటికి రేఖ మనసూ కకావికలమై ఉంది అమితాబ్‌తో బ్రేకప్ వల్ల. అలా ఇద్దరూ ఒకరికొకరు ఓదార్పయ్యారు. అది ఆ జంటను ప్రేమలోకి దింపింది. ఈ ముచ్చటనూ వదంతులుగా సెలబ్రేట్ చేసుకుంది పేజ్ త్రీ. పట్టించుకోలేదు ఆ ఇద్దరూ. మరింత కుతూహలం ప్రదర్శించాయి పత్రికలు. వినోద్, రేఖలు రహస్యంగా పెళ్లి చేసుకున్నారనీ ప్రచారం చేశాయి. దానికీ స్పందించలేదు వాళ్లు. ఈలోపు రేఖను తమ ఇంటికి తీసుకెళ్లి వాళ్లమ్మకు తమ ప్రేమ విషయం చెప్పాలనుకున్నాడు వినోద్. అనుకున్నట్టుగానే ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. పత్రికల్లో వీళ్ల పెళ్లి సంగతి చదివి ఉన్న వినోద్ తల్లి.. అలా వాళ్లిద్దరినీ జంటగా చూసేసరికి ఆ వదంతి నిజమే అనుకుంది. పట్టరాని కోపంతో రేఖ పట్ల దురుసుగా ప్రవర్తించింది. ఊహించని ఆ తీరుకి బిత్తరపోయింది రేఖ. వినోద్‌కూ నోట మాటరాలేదు. రేఖను బయటకు తీసుకెళ్లి ‘అమ్మ కోపం తగ్గేవరకు ఓపిక పడదాం’ అని చెప్పాడు. కాని ఆ సంఘటనను జీర్ణించుకోలేని రేఖ ఆ బంధాన్ని అక్కడితో తెంచేసుకోవాలనుకుంది. స్నేహాన్ని మాత్రం నిలుపుకుంది చివరి వరకు.
ఆఖరి ముడి
రేఖను మరిచిపోవడం అంత తేలిక కాలేదు వినోద్‌కు. ఆ ఎడబాటును తట్టుకోలేకపోయాడు. వ్యాకులతతో కుమిలిపోయాడు. కొడుకు పరిస్థితిని చూసి త్వరలో అతణ్ణి ఒక ఇంటివాడిని చేయాలని నిశ్చయించుకుంది వినోద్ తల్లి. కెన్యాలో స్థిరపడ్డ పంజాబీ వ్యాపార కుంటుంబంలోని అమ్మాయి కిరణ్‌తో వినోద్‌కు వివాహం జరిపించింది. ఇద్దరు పిల్లలూ పుట్టారు. అంతా సవ్యంగా ఉంది అని వినోద్ తల్లి ఊపిరి పీల్చుకుంటూండగా వినోద్ ఊపిరి ఆగిపోయింది.. రెండోసారి వచ్చిన గుండెపోటుతో. వందకు పైగా సినిమాలతో కెరీర్ గ్రాఫ్‌లో ముందుకు సాగి.. నలభై అయిదేళ్లకే జీవితాన్ని చాలించాడు. ప్రేమనే కాదు పెళ్లినీ సాఫల్యం చేసుకోలేకపోయాడు.
∙ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment