నీనా గుప్తా.. నటనకు నిర్వచనం!
వివియన్ రిచర్డ్స్.. క్రికెట్ సంచలనం!
ఆమె అతని ఫ్యాన్.. అతని జీవన సహచరిగా కూడా కావాలనుకుంది.. కుదరలేదు.. ఆ వైఫల్యం మనసు నిండా బాధను నింపింది.. ఆ ప్రేమ ఇచ్చిన గుర్తును గుండెకు హత్తుకొని ముందుకు సాగింది..
అలా మొదలైంది..
1980ల నాటి సంగతి.. ఇండియాతో సిరీస్ ఆడ్డానికి వెస్ట్ ఇండీస్ టీమ్ ఇక్కడికి వచ్చింది. ఆ సమయంలో వెస్ట్ ఇండీస్ టీమ్ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్. ఆటగాడిగా ఎంత ఫేమస్సో లేడీస్ మన్‌గానూ అంతే పాపులర్. మ్యాచ్ షెడ్యూల్లో భాగంగా ముంబై చేరుకుందా టీమ్. ఒకరోజు పేజ్ త్రీ పార్టీకి హాజరయ్యాడు రిచర్డ్స్. ఆ పార్టీకి నీనా గుప్తా కూడా వచ్చింది. రిచర్డ్స్ అంటే వెర్రి అభిమానం ఆమెకు. అక్కడ అతను కనిపించేసరికి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. అంతలోనే నీనా సన్నిహితులు ఆమెను రిచర్డ్స్‌కు పరిచయం చేశారు ‘మీ అభిమాని’ అంటూ. తనను చూసినప్పుడు నీనా కళ్లల్లో మెరిసిన మెరుపు అతణ్ణి కట్టిపడేసింది. నీనా అభిమానం ఆమె ముందు నుంచి కదలనివ్వకుండా చేసింది. ఆ ఇద్దరి మధ్య స్నేహం ఇంకా నిలదొక్కుకోకముందే ఆకర్షణ ఆ జంటను ప్రేమలోకి తోసింది.
అప్పటికే రిచర్డ్స్ ఇద్దరు పిల్లల తండ్రి కూడా..
రిచర్డ్స్ అప్పటికే వివాహితుడు.. ఇద్దరు పిల్లల తండ్రి కూడా! ‘నువ్వంటే ఇష్టం.. నిన్ను ప్రేమిస్తున్నాను’ అని నీనా అన్నప్పుడే తనకు పెళ్లయిన విషయం చెప్పేశాడు అని అంటారు ఆ జంట లవ్ స్టోరీ తెలిసిన సన్నిహితులు. అయినా నీనా .. రిచర్డ్స్ ప్రేమను ఆస్వాదించింది. సిరీస్ అయిపోయాక రిచర్డ్స్ స్వదేశం వెళ్లిపోయాడు. షూటింగ్స్ లేని ఖాళీ సమయాలను రిచర్డ్స్‌తోనే వెచ్చించింది.. అతని దేశంలో. ఆ సమయంలో రిచర్డ్స్ తన భార్యకు దూరంగా.. విడాకుల ఆలోచనలో ఉన్నాడని.. అయినా నీనా, రిచర్డ్స్‌ల మధ్య పెళ్లి ప్రస్తావన రాలేదని అప్పటి మీడియాలో వార్త. రిచర్డ్స్ ప్రేమలో ప్రపంచాన్ని మరచిపోయింది. ఆ సంతోషంలో ఆమె గ్రహించిన విషయం.. తాను తల్లిని కాబోతున్నానని. సంబరపడాల్సిందే కానీ.. పెళ్లి కాకుండా .. కరెక్ట్‌కాదు.. అన్నారు నీనా కుటుంబ పెద్దలు.
మసాబా పుట్టింది..
రిచర్డ్స్ నుంచి ఏదైనా అనుకూలమైన నిర్ణయం వస్తుందేమోనని చూసింది నీనా. రాలేదు.. ‘పెళ్లి చేసుకోలేను’ అనే మాటను మార్చలేదు రిచర్డ్స్. అది నీనా మనసును కష్టపెట్టింది. అతని తీరు చూసి నీనా స్నేహితులూ హెచ్చరించారు..‘నువ్వు నీ గురించే ఆలోచించుకుంటున్నావ్ తప్ప పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించట్లేదు. పుట్టబోయే ఆ బిడ్డను సఫర్ చేయడం తప్ప నువ్వేం సాధించలేవు’ అని. వినలేదు నీనా. బిడ్డను కనాలనే తీర్మానించుకుంది. మసాబా పుట్టింది. సింగిల్ పేరెంట్.. ఒంటరి తల్లిగానే మసాబాను పెంచింది. ఆ ప్రయాణంలో నీనా తండ్రి ఆమెకు అండగా ఉన్నాడు. అయినా చాలా సమస్యలు ఎదుర్కున్నారు ఇటు నీనా.. అటు మసాబా కూడా.
42ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమ
పండిట్ జస్‌రాజ్ కొడుకు శారంగ్‌దేవ్ పండిట్ నీనాతో ప్రేమలో పడ్డాడు. నిశ్చితార్థమూ జరిగింది. కానీ ఎందుకో అది పెళ్లిదాకా రాలేదు. దాంతో నీనా చాలా కుంగిపోయింది. ఇంక పెళ్లి గురించి ఆలోచించలేదు. కానీ.. తన 42వ ఏట.. అంటే 2002లో ఢిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మిశ్రా.. నీనాతో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్లు కొనసాగిన ఆ ప్రేమ 2008లో పెళ్లిగా మారింది. ఆ వైవాహిక బంధం సంతోషంగా సాగిపోతోంది.
ఒకసారి ముంబై మిర్రర్ ప్రతినిధి నీనా గుప్తాను ‘గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల్లో దేని గురించైనా పునరాలోచించాల్సివస్తే దేన్ని పరిగణనలోకి తీసుకుంటారు?’ అని అడిగితే.. ‘పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది. ప్రతి బిడ్డకు తల్లి, తండ్రి ఇద్దరి ఆప్యాయత, సంరక్షణ అత్యంతవసరం. సింగిల్ పేరెంట్‌గా నేను ఏలోటు రానివ్వకుండా మసాబాను పెంచినా చెంత తండ్రి లేకుండా తనెంత సఫర్ అయిందో నాకు తెలుసు’ అని చెప్పింది.
నాకు అమ్మ, నాన్న ఇద్దరి పట్లా అంతే ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఇద్దరు ఎవరికి వారే గొప్ప వాళ్లు. నా చిన్నప్పుడు నాన్నతో స్పెండ్ చేసిన టైమ్ ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం. ఆయనతో మేము, మాతో ఆయన ఉండిపోలేదు కానీ సెలవుల్లో మాత్రం నాన్న దగ్గరకు వెళ్లి ఆయనతో గడిపేవాళ్లం.
– మసాబా గుప్తా
జీవితంలో నాకు రిగ్రెట్స్ ఉన్నాయి. పెళ్లి కాకుండా బిడ్డను కనేకంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సింది. అలా చేసుంటే నా జీవితం ఇలా ఇన్ని మలుపులు తిరిగుండకపోయేది!
– నీనా గుప్తా
‘సచ్ కహూ తో’ అనే తన ఆత్మకథలో నిర్భయంగా, నిజాయితీగా చాలా విషయాలనే రాసింది నీనా గుప్తా.
∙ఎస్సార్
చదవండి: శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రాలపై పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు
'స్పిరిట్'కు ప్రభాస్ రికార్డు స్థాయి పారితోషికం!
Comments
Please login to add a commentAdd a comment