మరోసారి హాట్‌టాపిక్‌గా మార్లిన్‌ మన్రో జీవితం..! | Watch The Mystery of Marilyn Monroe These Things Probably Did Not Know | Sakshi
Sakshi News home page

మరోసారి హాట్‌టాపిక్‌గా మార్లిన్‌ మన్రో జీవితం..!

Published Thu, Sep 19 2024 4:55 PM | Last Updated on Thu, Sep 19 2024 5:56 PM

Watch The Mystery of Marilyn Monroe These Things Probably Did Not Know

పదహారు సంవత్సరాల వయసులో ఫ్యాక్టరీ కార్మికుడైన జేమ్స్‌ డొమెర్టీని పెళ్లి చేసుకుంది మార్లిన్‌ మన్రో. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భర్త  సీరియస్‌గా ఉద్యోగ విధుల్లో ఉన్నప్పుడు ఆమె మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది.

సినిమాల్లోకి అడుగు పెట్టాక, కెరీర్‌లో పైకి వెళుతున్న కొద్దీ మన్రో వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న మన్రో బేస్‌ బాల్‌ స్టార్‌ జో డిమాజియోతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవ లేదు. కెరీర్‌పై దృష్టి పెట్టిన మన్రో వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోలేదు. మత్తు పదార్థాలకు దగ్గర అయింది. 

కాలం గడుస్తున్న కొద్దీ ఆ వ్యసనం మరింత తీవ్రమైంది. ఆ తీవ్ర వ్యసనమే ఆమె పాలిట మృత్యువుగా మారింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీ బర్త్‌ డే పార్టీకి హాజరైన మార్లిన్‌ మన్రో బర్త్‌ డే సాంగ్‌ పాడింది. వీరిద్దరు కలిసి ఉన్న ‘ఫోటో’ ఆధారంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మన్రోకెనడీల గురించి రకరకాల కోణాలలో కథలు వినిపిస్తూనే ఉన్నాయి. కెనడీ బర్త్‌ డే పార్టీకి హాజరైన మూడు నెలలకే మన్రో చనిపోయింది.

తన మరణానికి కొన్ని గంటల ముందు మన్రోకు అప్పటి అమెరికా అటార్నీ జనరల్‌ రాబర్ట్‌ ఎఫ్‌ కెనడీతో తీవ్రంగా వాదోపవాదాలు జరిగాయని, అతడే ఆమెకు అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి ఉండొచ్చనే వెర్షన్‌ కూడా వినిపించింది. కెనడీ సోదరులు, వారి సర్కిల్‌ తాలూకు ప్రైవేట్‌ ప్రపంచంపై ‘ది ఫిక్సర్‌’ పుస్తకం దృష్టి సారిస్తుంది. 

మళ్లీ కెనడీ సోదరుల దగ్గరికి వస్తే....మార్లిన్‌ రెండవ భర్త జో డిమాజియో చెప్పిన దాని ప్రకారం మన్రో అంత్యక్రియలకు హాజరు కాకుండా కెనడీ సోదరులను నిషేధించారు.‘కెనెడీలంతా లేడీ కిల్లర్లే’ అంటూ ఘాటుగా తిట్టేవాడు జో డిమాజియో. ఫ్రెడ్‌ ఒటాస్‌ ఇన్వెస్టిగేషన్‌ ఫైల్స్‌ మాత్రమే కాకుండా ‘డెయిలీ  మెయిల్‌’ పత్రికలో వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ వచ్చిన ‘ఆస్క్‌ నాట్‌’  సీరియల్‌లోని సమాచారాన్ని కూడా ‘ది ఫిక్సర్‌’ రచయితలు జోష్‌ యంగ్, మాన్ఫ్రెడ్‌లు వాడుకున్నారు. మార్లిన్‌ మన్రోపై ఎన్నో సినిమాలు, వందలాది పుస్తకాలు వచ్చాయి.  ఎన్ని వచ్చినా, ఎప్పుడు వచ్చినా.... మార్లిన్‌ మన్రో జీవితం ఎప్పుడూ ఆసక్తికరమే.

(చదవండి: రోండా హిన్సన్‌.. 'అమ్మా రోమ్‌! నీకు ఏమైంది తల్లీ'?)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement