మా చిన్నతనంలో చెంచులో.. మరెవరో.. నల్లమల అడవుల నుంచి ఎలుగుబంట్ల ముక్కుకు తాడు కట్టి తీసుకుని వచ్చేవారు. ఆ జీవి చుట్టూ జనం మూగేవారు. దాని వీపుపై తమ పిల్లలను సవారీ చేయించేవారు. దానిని తడిమేవారు, తట్టేవారు. అల్లరి మనుషులు కొందరు కర్ర పుల్లతో పొడిచేవారు, మరి కొంతమంది ఆ ఎలుగ్గొడ్డు వెంట్రుకలను పీక్కునేవారు.
ఆ వెంట్రుకలను దారంగా పేనుకుని కాలి బ్రోటన వేలుకు కట్టుకుంటే శుభమని భావించేవారు. లేదా దాని యజమానికి కాసిన్ని డబ్బులు ఇచ్చి అతనితోనే దాని వెంట్రుకలను పీకించే వారు. Duniyaa banaane wale, kyaa tere man me samaai ? Kaaheko duniyaa banaai? అని ఆడుగుతారు కవి శైలేంద్ర ఒక పాటలో. ఈ పాట తెలిసిన వాళ్ళే కాదు, తెలీని వాళ్ళు కూడా భగవంతుడిని ఈ మాట అడిగే ఉంటారు తమ తమ మూగభాషలో.
ఒక విధివంచితురాలి యథార్థ గాధ
20 ఏళ్ల సారా బార్ట్‌మాన్ 1810లో బతుకు తెరువు కోసమన్న తలంపుతో కేప్‌టౌన్ నుంచి లండన్‌కు బయలుదేరడానికి పడవ ఎక్కినప్పుడు, ఆమె ఇక తన ఇంటిని మళ్లీ చూడదని ఆమెకు తెలియదు. అక్కడి గాలిని, అక్కడి గడ్డిని, అక్కడి సూర్యుడి వెలుతురును ఇక తన జీవితకాలంలో మరెప్పుడు తాకలేదని ఆవిడకు తెలీదు. మా ప్రాంతాల ఎలుగుబంటి కన్నా అన్యాయమైన జీవితం ఆవిడకు సంప్రాప్తించినపుడు ఆవిడ పదే పదే అదే ప్రశ్న భగవంతుడిని అడుగుతూ ఉండి ఉండవచ్చు.
మా ఊరి ఎలుగు బంటిని నేను బోనులో చూడలేదు. కానీ మనిషి పుట్టుక పుట్టిన సారా బార్ట్‌మన్‌ని బోనులో నుండి బయటకు లాగేవారు. ధృఢమైన ఎలుగు శరీరాన్ని జనం పుల్లలతో తాకేవారు. సారా శరీరాన్ని, ఆవిడ వంటిని, ఆవిడ శరీర భాగాలను ఆడా మగ, పిల్లా జెల్లా, ముసలీ ముతక ప్రేక్షకులు అంతా తాకేవారు, గొడుగు మొనలతో పొడిచి పొడిచి పులకించి పోయేవారు.
ఎలుగుబంటి వెంట్రుకలతో తమ ధైర్య సాహాసాలని పెంచుకోవడానికి చూశారు. సారా బార్ట్‌మన్ శరీరాంగాలను చూసుకుంటూ లండన్ సభ్య సమాజం, ఇంగ్లీష్ నాగరిక ప్రపంచం ప్రేరేపణలో మునిగి తేలారు. అచ్చు ఎలుగుబంటి మీద స్వారీ చేసినట్లు నల్ల పిల్ల, అఫ్రికా అమ్మాయి సారాబార్ట్‌మన్ మీద ఊరేగింది మానవజాతి. దునియా బనానే వాలే, క్యా తేరే మన్ మే సమాయి? కాహికో దునియా బనాయి తూనే, కాహికో దునియా బనాయి?
మనుష్యులు కాదు.. రాక్షసులు
ఇరవై ఆరు సంవత్సరాల వయస్సులో మానవ ఉన్మాద హింసతో మరణించింది సారా బార్ట్‌మన్. మరణించినా ఆమె శరీరాన్ని విడిచిపెట్టలేదు జాత్యహంకారం. 1815 నుండి ఆమె మెదడు, ఆమె తాలూకు శరీర తోలు తిత్తి బొమ్మ , ఆమె శరీర భాగాలను 1974 వరకు పారిస్ మ్యూజియంలో ప్రదర్శనలో పెట్టారు. సారా బార్ట్‌మన్ జీవితాన్ని 2010 బ్లాక్ వీనస్ అనే సినిమాగా తీశారు. సున్నిత మనస్కులు, మానవ జాతి మీద ప్రేమ, గౌరవం, ఔన్నత్యం కలవారు ఎవరూ ఈ సినిమా భరించలేరు.
-అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి.
'మానవ జూ'ల ఏర్పాటులో భాగంగా యూరోపియన్ సమాజం సారా బార్ట్‌మన్ పట్ల వ్యవహరించిన తీరు అమానుషం. 1789లో జన్మించిన ఆమెను యూరప్‌లో దేశాల్లోని జాతరల్లో ప్రేక్షకుల ముందు ప్రదర్శించేవాళ్లు. 1815లో ఆమె చనిపోయారు. అయినప్పటికీ సారా అస్తిపంజరం, మెదడు సహా లైంగిక అవయవాలను పారిస్‌లోని ఓ మ్యూజియంలో 1974 వరకూ ప్రదర్శించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక 2002లో సారా అవశేషాలను తిరిగి సౌతాఫ్రికాకు అప్పగించినట్లు కథనాలు ఉన్నాయి.
చదవండి: Neena Rao: బిడ్డ మేధాశక్తిని గ్రహించండి! బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి..
Comments
Please login to add a commentAdd a comment