కంచెలు తెంచేశాం. హద్దులు చెరిపేశాం. ఆంక్షలు తుడిచేశాం. అవరోధాలు ఎదిరించాం. నేల, నింగి, నీరు, ఊరు... కొలువు, క్రీడ, కార్మిక వాడ... గనులు, ఓడలు, రోదసి యాత్రలు.. పాలనలో.. పరిపాలనలో.. ఆర్థిక శక్తిలో.. అజమాయిషీలో సైన్యంలోన సేద్యంలోన అన్నీ మేమై... అన్నింటా మేమై... అవకాశం కల్పించుకుంటాం. అస్తిత్వం నిలబెట్టుకుంటాం. స్త్రీని గౌరవించే సమాజం.. స్త్రీని గౌరవించే సంస్కారం.. ప్రతి ఇంటి నుంచి మొదలవ్వాలి. ప్రతి రంగంలో పాదుకొనాలి.
తెలుగుతేజమైన గొంగడి త్రిష ఉమన్ క్రికెటర్‌గా మనందరికీ పరిచయమే. భద్రాచల వాసి త్రిష అండర్–19 వరల్డ్ కప్– 2023 ఫైనల్లో టీమిండియాను జగజ్జేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించింది. ‘సీనియర్ ఉమన్ క్రికెట్ టీమ్‌లో చోటు దక్కించుకోవడమే నా నిరంతర కృషి’ అని చెబుతోంది త్రిష.
ఫిట్‌నెస్ కోచ్ అయిన తండ్రి రామిరెడ్డి ద్వారా మూడేళ్ల వయసులోనే క్రికెట్‌లో ఓనమాలు దిద్దిన త్రిష ఎనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ అండర్–16 జట్టులో చేరింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు కూతుర్ని హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అకాడమీలో చేర్చారు.
అక్కడ నుంచి ఆమె క్రికెటర్‌గా తనను తాను మెరుగుపరుచుకుంటూ భారతజట్టులో స్థానం దక్కించుకుంది. తెలంగాణ అమ్మాయిగా భారత క్రికెట్ జట్టులో విజయకేతనం ఎగురవేస్తున్న త్రిష తన ఆసక్తులను, భవిష్యత్తు కలను ఇలా వివరించింది...
‘‘నేను మహిళల అండర్–19 కేటగిరిరీలో టీ20 వరల్డ్ కప్‌కి ఆడాను. రాబోయే రోజుల్లో ఇండియన్ సీనియర్ ఉమెన్ క్రికెట్ టీమ్‌లో చోటు సంపాదించాలన్నది నాకల. ఆ లక్ష్యం సాధించడానికే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక తపస్సులా ప్రాక్టీస్ చేస్తున్నాను. గెలుపు ఓటమి గురించి కూడా ఆలోచించకుండా లక్ష్యం కోసం చేసే ప్రయత్నంలో ఏదీ ఒత్తిడిగా అనిపించదు.
ఇతర అభిరుచులు...
నాకున్న మరో అభిరుచి స్విమ్మింగ్. ఎంతసేపైనా వదలాలనిపించదు. అమ్మాయిలకు స్విమ్మింగ్ తప్పనిసరిగా వచ్చితీరాలని. నాకు స్విమ్మింగ్ చేసిన ప్రతీసారి అనిపిస్తుంటుంది. మంచి రిలాక్సేషనిస్తుంది స్విమ్మింగ్.
చదువూ ముఖ్యమే..
ఇప్పుడు 12వ తరగతి చదువుతున్నాను. చదువు, ఆటలు కొనసాగిస్తూ వెళ్లడమే. ఎందుకంటే నా ఎదుగుదలకు ఈ రెండూ ముఖ్యమే అని భావిస్తాను. అయితే, ఎక్కువ సమయం క్రికెట్ సాధనను కేటాయించినప్పటికీ ఎగ్జామ్స్‌కి ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతుంటాను.
ఇష్టాలు ఏవైనా కల తర్వాతే..
నాకు స్నేహితులు చాలా తక్కువ. కొందరు క్రికెట్ ఫ్రెండ్స్ ఉన్నారు. కోచ్‌లు సూచించిన డైట్‌ని కచ్చితంగా ఫాలో అవుతాను. ఏ ఆహారం తీసుకుంటే నా హెల్త్‌కి మంచిదో, ఫిట్‌నెస్ పట్ల ఎంత శ్రద్ధ తీసుకోవాలో అవన్నీ పాటిస్తాను. పిజ్జా, బర్గర్ వంటివి ఇంట్రస్ట్ ఉన్నా సరే తీసుకోను. ప్రాక్టీస్‌లోని మా క్రికెట్ టీమ్ మెంబర్స్‌తోనే టైమ్ పాస్ అవుతుంది కాబట్టి, ఇతరత్రా ఆలోచనలు కూడా ఏవీ మైండ్‌లోకి రానివ్వను.
ప్రోత్సాహాన్నిచ్చేవి..
ఉమెన్ క్రికెటర్ మిథాలీరాజ్, ఎం.ఎస్ ధోనీలకు పెద్ద అభిమానిని. వారు ఆడుతున్న తీరును చూస్తూ పెరిగినదాన్ని కాబట్టి, వారు నాకు రోల్‌మోడల్స్. స్ఫూర్తిదాయకమైన వారి మాటలు నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకుంటాను’’ అని తెలియజేసిన త్రిష లక్ష్య సాధనలో ఎన్నో విజయాలు దక్కించుకోవాలని కోరుకుందాం.
– నిర్మలారెడ్డి
చదవండి: WPL 2023- Shabnam MD- GG: క్రికెట్.. బిర్యానీ.. అంతే..!: విశాఖ క్రికెటర్ షబ్నమ్
Comments
Please login to add a commentAdd a comment