
గాయని మధుప్రియ గళంతో మధువులొలికిస్తుంది! ఆ స్వర ప్రయాణం ఆమె మాటల్లోనే...‘నేనసలు సంగీతం నేర్చుకోలేదు. అమ్మ, నాన్న, తాతయ్య పాడతారు. ఆ కళ వాళ్ల దగ్గర నుంచే వచ్చింది. నా గురువు మా అమ్మే! నాకు ఆరేళ్లున్నప్పటి నుంచే పాడటం స్టార్ట్ చేశా. స్కూల్లో, ఫంక్షన్స్‌లో పాడేదాన్ని. ఆ తర్వాత మెల్లమెల్లగా జానపదాలు, తెలంగాణ ఉద్యమగీతాలు పాడటం మొదలుపెట్టా. తెలంగాణ మూవ్‌మెంట్ టైమ్‌లో గద్దర్ తాతతో కలిసి పాడటం అదృష్టంగా ఫీలవుతాను. నా పాటల ప్రయాణంలో సూపర్ సింగర్‌లో పాల్గొనడం చెప్పుకోదగ్గ మలుపు.
వాళ్ల బాధ చూసి రాసిన పాట...
నాకు గుర్తింపునిచ్చిన పాట ‘ఆడపిల్లనమ్మా..పాటే! మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం. ‘ముగ్గురూ ఆడపిల్లలే’ అని అమ్మా నాన్న బాధపడటం చూసి నా చిన్నప్పుడే రాసుకున్న పాట అది. నా స్టోరీ. ఒకరకంగా ప్రతి ఆడపిల్ల కథ. అందుకే ఎంతోమంది అమ్మాయిలు ఆ పాటతో కనెక్ట్ అయ్యారు. అందుకే అదంత పాపులర్ అయింది. అదొక్కటే కాదు నేను రాసి, పాడిన పాటలన్నీ ఆడపిల్లల గురించే ఉంటాయి.
‘అమ్మా నీ మనసు గొప్పదిలే..’ అంటూ అమ్మ మీదా ఎన్నో పాటలు పాడాను. ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకున్నాను. ఈ మదర్స్ డేకి ‘ఆడపిల్లనమ్మా..’ వీడియో ఆల్బమ్‌ను తీసుకొస్తున్నాను. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి, దేశభక్తి, జానపదాలు.. ఏవైనా నూటికి తొంభై తొమ్మిది శాతం మెసేజ్ ఓరియెంటెడ్ పాటలే పాడుతూంటాను. వాటితో నాకెన్ని డబ్బులొస్తున్నాయి అనేకంటే నా పాటలు ఎంతమందికి చైతన్యాన్నిస్తున్నాయనేదే చూస్తాను.
అభిమానాన్ని పొందాలి...
ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి గోదారి గట్టు పాట వరకు చాలానే ఫేస్ చేశాను. ఎంతవరకు నిలబడ్డాను అనేదే పరిగణనలోకి తీసుకుంటాను.
నా గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, ఇబ్బంది పెట్టినా.. పట్టించుకోను. మహా అయితే రెండు నిమిషాలు బాధపడతానేమో అంతే! తర్వాత నా పనిలో పడిపోతాను. నేర్చుకోవాల్సిన విషయాల మీద దృష్టిపెడతాను. ఎలాంటి పరిస్థితులెదురైనా నవ్వుతూ ఎదుర్కొంటాను. అదే నా స్ట్రెంగ్త్. ఇంకా చాలా పాటలు రాయాలి.. పాడాలి.. జనాల అభిమానాన్ని పొందాలి.. అదే నా లక్ష్యం’’ అంటూ ముగించింది మధుప్రియ.
– శిరీష చల్లపల్లి
Comments
Please login to add a commentAdd a comment