అమ్మకు మతిమరుపు ఎక్కువవుతోంది. అమ్మలో అయోమయం పెరుగుతోంది. అమ్మలో ఆ మార్పు ఎందుకు? అల్జైమర్స్ కావచ్చు.
World Alzheimer Day 2022: ఒక వయసు దాటాక అమ్మా నాన్నల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్నల కంటే అమ్మలే ఎక్కువగా అల్జైమర్స్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటి సందర్భంలో వారితో ఎలా మెలగాలి? వారికి ఎలాంటి సపోర్ట్ అందించాలి? పెద్దల మీద ఒక కన్ను వేసి వారికి వచ్చే ఈ ఇబ్బందిని సకాలంలో ఎలా గుర్తించాలి?తెలుసుకోక తప్పదు.
‘అల్జైమర్స్ అండ్ రిలేటెడ్ డిజార్డర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా’ (ఏ.ఆర్.డి.ఎస్.ఐ) ప్రకారం 2030 నాటికి 75 లక్షల మంది భారతదేశంలో అల్జైమర్స్ బారిన పడి ఉంటారు.
అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే 65 ఏళ్లు దాటిన తర్వాత ఆరుమంది మహిళలలో ఒకరికి ఈ రుగ్మత సోకే అవకాశం ఉంటే పురుషులలో 11 మందిలో ఒకరికి దీని ప్రమాదం పొంచి ఉంటుంది. అంటే స్త్రీలలోనే ఎక్కువమంది అల్జైమర్స్ బారిన పడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయే. స్త్రీలే ఎందుకు?
ఇవీ కారణాలు:
►డిప్రెషన్‌కు, అల్జైమర్స్‌కు నేరుగా సంబంధం ఇంకా తేలాల్సి ఉన్నా డిప్రెషన్ స్త్రీలలో ఎక్కువ కనుక వారికి ఈ రుగ్మత సోకుతున్నదనేది నిపుణుల పరిశీలన. డిప్రెషన్ వల్ల జ్ఞాపకశక్తికి కారణమయ్యే మెదడు రసాయనాలు ప్రభావితమయ్యి మతిమరుపు, జ్ఞాపకాలు నశించడం జరుగుతున్నదని అంటున్నారు.
►అలాగే వ్యాయామం లేకపోవడం. పురుషుల కంటే స్త్రీలకు వ్యాయామం తక్కువ కావడం కూడా అల్జైమర్స్‌కు కారణం. పురుషులు ఎంతో కొంత వ్యాయామం కోసం బయటకు వెళతారు. కాని స్త్రీలు ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. వారికి వ్యాయామం చేసే సమయం కూడా ఉండదు.
►ఆరోగ్యకరమైన శరీరం మెదడును కూడా చురుగ్గా ఉంచుతుంది కనుక అల్జైమర్స్ పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఇంట్లో బాధ్యతలు కూడా స్త్రీలను తెలియని ఒత్తిడికి గురి చేస్తాయి. కుటుంబ సభ్యులలో ఎవరి ఆరోగ్యం బాగలేకపోయినా వారిని చూసుకోవాల్సిన, ఎవరికి ఏ సమస్య వచ్చినా దాని గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత స్త్రీలలో ఎక్కువ కనిపిస్తుంది.
►వారికి తప్పని ఈ పని వల్ల కూడా మెదడుపై అనవసర ఒత్తిడి పడి అల్జైమర్స్‌కు కారణం కావచ్చు. ఇవి కాకుండా స్త్రీలలో రెండు ‘ఎక్స్’ క్రోమోజోములు ఉంటాయి. ఇందువల్ల కూడా అల్జైమర్స్ వస్తున్నదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
►మెదడు నిర్మాణం కూడా పురుషులకు, స్త్రీలకు కొద్దిపాటి వ్యత్యాసమూ ఒక కారణం కావచ్చు. మరో విషయం ఏమంటే చురుగ్గా ఉండే మెదడు కలిగిన వారికి అల్జైమర్స్ తక్కువగా వస్తుంది. అంటే మెదడు నిరంతరం పని చేసేవారికి ఈ రుగ్మత సమస్య తక్కువ.
►కాని తరాల వెంబడి స్త్రీలను విద్యకు దూరం చేయడం, వారి ఆలోచనలు పరిమితం చేయడం, కూరా నారకు మాత్రమే ఆలోచిస్తే చాలు అన్నట్లుగా చూడటం వల్ల కూడా స్త్రీలకు ఈ రుగ్మత వస్తున్నదని అంటున్నారు.
►పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం జీవించడం వల్ల కాలం గడిచే కొద్ది ఈ రుగ్మత బారిన వీరు పడుతుండటం మరో అనివార్యత. కాబట్టి 65 ఏళ్లు దాటాక పురుషుల గురించి కంటే అల్జైమర్స్ విషయంలో స్త్రీల గురించి మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రమాదాన్ని ఎలా నివారించవచ్చు?
►యాభైలకు సమీపిస్తున్నప్పుడే జీవన విధానాలను మార్చుకోవడం, కళాత్మకమైన పనుల్లో నిమగ్నమవడం, పజిల్స్ నింపడం, సమతుల ఆహారం తీసుకోవడం, బరువు పెరక్కుండా చూసుకోవడం, మంచి పోషకాలుండే పండ్లు తినడం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం.
►నిద్రలేమి మెదడు పై ప్రభావం చూపుతుంది. ఏ వయసులో అయినా ఏదో ఒక కోర్సు చదవడం. లేదా ఏదో ఒక క్లాసుకు (ఇంగ్లిష్, డాన్స్, పెయింటింగ్) హాజరు కావడం. బి.పి, డయాబెటిస్‌లను అదుపులో పెట్టుకోవడం. ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం, నలుగురితో ఎక్కువ కలవడం.
సహాయం
►ఈ రుగ్మత ఉన్నవారిని కనిపెట్టుకుని ఉండటమే అసలైన సహాయం. వైద్యపరంగా చేసేది పెద్దగా లేకపోయినా చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల, వాళ్లున్న గదుల్లో పోస్టర్లు ఫొటోలు పెట్టడం వల్ల, బాత్‌రూమ్‌లో సూచనలు అంటించడం వల్ల, అలారంలు పెట్టి వారిని ఒక క్రమపద్ధతిలో పనులు చేసుకునేలా చేయడం వల్ల, పగటి పూట ఎండలో తిప్పుతూ నిద్ర తక్కువ పోయేలా చేసి రాత్రిళ్లు త్వరగా నిద్రపోయేలా చేయడం వల్ల ఇలాంటి బాధితులకు కొద్దిగా ఉపశమనం లభిస్తుంది.
►అల్జైమర్స్ అంటే పెద్దలు మళ్లీ పసిపాపలుగా మారడం. పిల్లలు వారికి తల్లిదండ్రుల అవతారం ఎత్తడం. సమాధానం లేని ఈ రుగ్మతను ప్రేమ, బాధ్యతలతోనే జయించాలి.
ఎలా గుర్తించాలి? అల్జైమర్స్ సూచనలు ఎలా గమనించాలి?
అల్జైమర్స్ వచ్చిన వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.
►తరచూ మతిమరుపు
►స్థలకాలాల ఎరుక తగ్గుతుంది.
►మూడ్స్ తరచూ స్థిరంగా మారుతుంటాయి.
►ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో తికమక
►నలుగురితో కలవకపోవడం
►రోజువారి పనులు చేసుకోవడంలో కూడా అయోమయం
చదవండి: Urinary Problems: గర్భసంచి జారిందన్నారు.. ఆపరేషన్ లేకుండా మందులతో తగ్గుతుందా?
Comments
Please login to add a commentAdd a comment