చైన్ డ్రాగింగ్ బోట్’.. రొయ్యల సాగులో రైతులకు ఉపయోగపడే ఒక ఆవిష్కరణ ఇది. ఆక్వా సాగులో శారీరక కష్టం, ఖర్చు, వ్యాధుల బెడద తగ్గించడంతో పాటు రొయ్యల నాణ్యత పెంపొందించేందుకు ఈ చైన్ డ్రాగింగ్ బోట్ ఉపయోగపడుతుంది.
చైన్ డ్రాగింగ్ అంటే?
రొయ్యల పట్టుబడి పూర్తయిన తర్వాత చెరువును ఎండగడతారు. ఎండి నెర్రెలుబారిన ఆ చెరువులో మళ్లీ రొయ్యల సాగు ప్రారంభించడానికి చెరువులో నీరు నింపిన తర్వాత.. నేలను సిద్ధం చేసే క్రమంలో ఇనుప గొలుసులు చెరువు అడుగున వేసి, ఇద్దరు మనుషులు నడుములోతు నీటిలో నడుస్తూ లాగుతారు. దీన్నే చైన్ డ్రాగింగ్ అంటారు. తద్వారా చెరువు అడుగు మట్టిలో వ్యర్థాలు, విషవాయువులు బయటకు వెళ్లిపోవటంతో పాటు రొయ్యలకు సహజ ఆహారమైన ప్లవకాలు వృద్ధి చెందుతాయి. అయితే, మనుషులు నీటిలో నడుస్తూ చైన్ డ్రాగింగ్ చేయటం వ్యయ ప్రయాసలతో కూడిన పని.
ఈ పనిని సులువుగా, తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో చేయడానికి ఉపయోగపడే వినూత్నమైన పడవకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడు డాక్టర్ తౌసీఫ్ అహ్మద్ రూపుకల్పన చేశారు. ఈ ‘చైన్ డ్రాగింగ్ బోట్’ఆక్వా రైతులకు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తోంది. గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతుల కోరిక మేరకు నాలుగేళ్ల క్రితం డాక్టర్ ౖతౌసీఫ్ పరిశోధనలు ప్రారంభించారు. ఈ క్రమంలో యూనివర్సిటీలోని త్రీడీ ఎక్స్‌పీరియన్స్ ల్యాబ్‌లో ‘చైన్ డ్రాగింగ్ బోట్’ను డిజైన్ చేశారు. ఈ ఆవిష్కరణకు భారతీయ పేటెంట్ సంస్థ 2020లో డిజైన్ పేటెంట్‌ను మంజూరు చేసింది.
'చైన్ డ్రాగింగ్ బోట్’ లీటరు పెట్రోల్‌తో 2 గంటలు పనిచేస్తుంది. దీనితో అర గంట సమయంలోనే 10 ఎకరాల్లోని రొయ్యల చెరువుల్లో చైన్ డ్రాగింగ్ పనిని పూర్తి చేయవచ్చని డా. తౌసీఫ్ తెలిపారు. మనుషులు చేసిన దానికంటే అధిక సామర్థ్యంతో స్లడ్జ్ వంటి వ్యర్థాలను తొలగించటం, చెరువు అడుగు నేలను గుల్లబరచటంలో ప్రయోజనకారిగా నిలుస్తోందన్నారు.
‘ఆంగ్రూ’ ప్రోత్సాహం
‘చైన్ డ్రాగింగ్ బోట్’కు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఏఎన్‌యూ ఇంజనీరింగ్ కళాశాలలోని త్రీడీ ఎక్స్‌పీరియన్స్ ల్యాబ్‌లో ప్రత్యేక డిజైన్‌ను రూపొందించిన డా. తౌసీఫ్ అహ్మద్.. అందుకు అనుగుణంగా మూడు ప్రత్యేక స్టీల్ ఫ్రేమ్‌లతో కూడిన బోట్‌ను తయారు చేయించారు. దానికి జీఎక్స్ 160 హోండా ఇంజన్‌ను, వెను చైన్‌ను అమర్చారు. పెట్రోల్‌తో నడిచే ఈ బోట్‌పై ఒకరు కూర్చుని నడపవచ్చు.
దీని తొలి బోట్‌ను రైతులకు ఇచ్చి వాడిన తర్వాత వారి సూచనల మేరకు తగు మార్పులు చేశారు. చైన్ డ్రాగింగ్ బోట్ ప్రాజెక్టుకు తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్విద్యాలయం (ఆంగ్రూ) పోషన్ ఇంక్యూబేషన్ సెంటర్ రూ. 5 లక్షలను అందించింది. ఈ ఆవిష్కరణను న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కిసాన్ మేళాలో కూడా ఇటీవల ప్రదర్శించారు.
సబ్సిడి కోసం ప్రయత్నిస్తున్నాం..
చైన్ డ్రాగింగ్ బోట్ వాడకం వల్ల రొయ్యల నాణ్యత, సర్వయివల్ రేటు పెరుగుతుంది. ‘ఆంగ్రూ’ సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సబ్సిడీపై ఆక్వా రైతులకు ఈ బోట్లను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. తౌషా టెక్నాలజీ ఇన్నోవేషన్ అనే స్టార్టప్ ద్వారా రైతులకు వారం రోజుల్లో తయారు చేయించి ఇస్తున్నాం.
– డా. తౌసీఫ్ అహ్మద్
(98852 09780), ఆవిష్కర్త,
నాగార్జున యూనివర్సిటీ
ఇంజనీరింగ్ కాలేజ్, గుంటూరు
రొయ్యలు పెరిగే కాలంలో కూడా..
‘చైన్ డ్రాగింగ్ బోట్’కు ఆక్వా రైతుల నుంచి ఆదరణ లభిస్తోంది. డా. తౌసీఫ్ అహ్మద్ రెండు బోట్లను తయారు చేసి నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతులకు అందజేశారు. ఒకొక్క బోట్ తయారీ వ్యయం రూ. 80 నుంచి 90 వేలు ఉంటుందని, ఆర్డర్ ఇచ్చిన వారం రోజుల్లో తయారు చేసి ఇవ్వగలం. ఆక్వా రైతులకు అవగాహన కల్పించేందుకు ఒక బోట్‌ను విజయవాడలోని కృష్ణా నదీ తీరంలో ప్రదర్శనకు పెట్టారు.
బోట్‌ను మనిషి గట్టు మీద నుంచే రిమోట్ పద్ధతిలో విద్యుత్తు బ్యాటరీ లేదా సౌర విద్యుత్తు ద్వారా నడిపించేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నానని డా. తౌసీఫ్ తెలిపారు. రొయ్యల సాగు ప్రారంభ దశలోనే కాకుండా, రొయ్యల పెంపకం జరిగే కాలంలో కూడా చైన్ డ్రాగింగ్ బోట్‌ను నడిపేందుకు ఆయన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పనిలో పనిగా డైనమిక్ ఎయిరేషన్ వ్యవస్థను కూడా ఈ బోట్‌కు అనుసంధానం చేస్తున్నామన్నారు. రొయ్య పిల్లలకు హాని కలగకుండా ఉండేలా అల్యూమినియం ప్రొపెల్లర్‌కు బదులు ఫైబర్ ప్రొపెల్లర్‌ను వినియోగించనున్నామని వివరించారు.
– దాళా రమేష్ బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు
ఇన్‌పుట్స్: డా.ఎన్.అశోక్ కుమార్, సాక్షి, ఏఎన్‌యూ
(చదవండి: కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా? సైన్స్ ఏం చెబుతోంది..?)
Comments
Please login to add a commentAdd a comment