చదువుకున్న వ్యక్తి గ్రామ పగ్గాలు చేపడితే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెబుతోంది 21 ఏళ్ల రేడియో జాకీ. శ్రోతల్ని ఆకట్టుకోవడానికి ఇలాంటివెన్నో జాకీలు చెబుతారులే అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే రేడియో జాకీ ‘లక్షికా దాగర్’ ప్రస్తుతం ఓ గ్రామానికి సర్పంచ్ అయ్యి, రాష్ట్రంలోనే ‘యంగెస్ట్’ సర్పంచ్‌గా నిలిచింది. యువత ఏదైనా అనుకుంటే సాధించగలరు అని చెప్పడానికి లక్షికానే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్ పరిధిలోని చింతామన్ జవాసియా గ్రామానికి చెందిన అమ్మాయే లక్షికా దాగర్. మూడువేలకు పైగా జనాభా ఉన్న చింతామణ్‌కు ఇటీవల పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పోస్టు ఎస్సీ మహిళకు కేటాయించబడింది. దీంతో ఎన్నికల్లో ఎనిమిది మంది పోటీపడ్డారు. వీరందరిలోకి చిన్నదైన లక్షికా 487 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ సీటుని దక్కించుకుంది.
జూన్ 27న 22 ఏట అడుగుపెట్టడానికి ఒకరోజు ముందు లక్షికా సర్పంచ్‌గా ఎన్నికై మధ్యప్రదేశ్‌లోనే తొలి యంగ్ సర్పంచ్‌గా నిలిచింది. గ్రామంలో తొలిసారి చదువుకున్న అమ్మాయి సర్పంచ్ అవ్వడంతో గ్రామస్థులంతా తెగ సంబరపడిపోతున్నారు.
భరత్‌పూరి జిల్లా కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌లో రీజనల్ అధికారిగా పనిచేస్తోన్న దిలీప్ దాగర్ ముద్దుల కూతురు లక్షికా. ఇంట్లో అందరిలోకి చిన్నది. ప్రస్తుతం మాస్ కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాతోపాటు, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుచేస్తోంది. ఖాళీ సమయంలో రేడియో జాకీగా పనిచేస్తోన్న లక్షికకు చిన్నప్పటి నుంచి సామాజిక సేవా దృక్పథం ఎక్కువ.
ఎప్పుడూ గ్రామస్థులతో కలిసి మెలిసి తిరుగుతూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటుండేది. ఈ క్రమంలోనే కొన్ని సమస్యలు తీర్చాలంటే అధికారం ఉండాలని భావించింది. సర్పంచ్‌గా ఉంటే గ్రామంలో ఎక్కువ మందికి సాయపడవచ్చన్న ఉద్దేశ్యంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసింది.
చదువుకున్న అమ్మాయి కావడం, ఆమె మేనిఫెస్టో నచ్చడంతో గ్రామస్థులంతా లక్షికను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఆమె ఆధ్వర్యంలో ఆ గ్రామం ప్రగతి పథంలో దూసుకుపోతుందని ఆశిద్దాం.
గ్రామాభివృద్ధే ముఖ్య ఉద్దేశ్యం
‘‘చదువుకున్న వారు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తే గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఇందుకు గ్రామస్థుల సాయం తప్పక ఉండాలి. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న సమయంలో అనేక సమస్యలు నా ముందుకొచ్చాయి.
తాగునీటి సమస్య, ట్యాప్‌లు ఉన్నప్పటికీ నీళ్లు రాకపోవడం, మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడం, వీధిలైట్ల మరమ్మతులు వంటివి సమస్యలు ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్నాయి. అర్హులైన వితంతు, దివ్యాంగులకు పెన్షన్‌లు అందడంలేదు. లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కూడా సరిగా అందడం లేదు.
స్కూళ్లలో మౌలిక సదుపాయాలు సరిగా లేవు. ఈ సమస్యలన్నింటినీ వీలైనంత వేగంగా పరిష్కరిస్తాను. అదేవిధంగా ఒక ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ను కూడా ప్రారంభిస్తాను. ఇవన్నీ ఒక్కోటి పరిష్కారమైతే గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది’’.
– లక్షికా దాగర్, మధ్యప్రదేశ్ యంగెస్ట్ సర్పంచ్
చదవండి: చిరుతిళ్లను ఆరోగ్యంగా తినొచ్చు
Comments
Please login to add a commentAdd a comment