ఇరవై ఏళ్ల వయసు దాటని వారు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు ‘ఈ వయసులో ఎందుకు?’ అనే మాట వినిపించడం సాధారణం. కైవల్య వోహ్ర, అదిత్ పలిచా ‘జెప్టో’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టినప్పుడు కూడా ఇలాంటి మాటలు కాస్త గట్టిగానే వినబడ్డాయి. అయితే ఈ మిత్రద్వయం వెనక్కి తగ్గలేదు. ‘జెప్టో’తో సూపర్ హిట్ కొట్టింది. ‘సక్సెస్‌కు వయసుతో పనిలేదు’ అని మరోసారి నిరూపించింది. ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘జెప్టో’ సూపర్ సక్సెస్ కావడమే కాదు యూనికార్న్ స్టేటస్ సాధించింది. నడక నుంచి పరుగు వరకు ‘జెప్టో’ నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి....
పాఠం నెం 1: క్లారిటీ
స్టాన్‌ఫర్డ్‌లో కంప్యూటర్ సైన్స్ చదువును వదిలేసి స్వదేశానికి తిరిగి వచ్చిన కైవల్య, అదిత్‌ల ముందుకు వచ్చి నిలబడిన ప్రశ్న...‘మీరు ఏం చేయాలనుకుంటున్నారో క్లారిటీ ఉందా?’
హండ్రెడ్ పర్సంట్. లాక్‌డౌన్ సమయంలో వచ్చిన ఐడియాను స్టార్టప్ రూపంలో రోడ్డు ఎక్కించాలంటే ఉత్సాహం మాత్రమే సరిపోదు. సబ్జెక్ట్‌పై క్లారిటీ ఉండాలి. దీని కోసం ఇ–కామర్స్ ఇండస్ట్రీకి సంబంధించిన సమాచారాన్ని కాచి వడబోసినంత పని చేశారు కైవల్య, ఆదిత్‌లు.
పాఠం నెం 2: నమ్మకం
చిన్న వయసు కావడం వల్ల కైవల్య, అదిత్‌లను ఇన్వెస్టర్‌లు నమ్మడం అంత తేలికైన విషయం కాదు. ఫండింగ్ విషయంలో ఇది ఇబ్బందిగా మారుతుంది. ‘మీకు ఎలాంటి అనుభవం లేదు కదా. ఎలా నమ్మడం?’ అంటారు. అయితే సక్సెస్ అన్ని సమస్యలకు జవాబు చెబుతుంది. మనపై ఇతరులకు నమ్మకం కలిగిస్తుంది. తొలి అడుగుల్లోనే ‘జెప్టో’ గెలుపు జెండా ఎగరేయడం వల్ల ఫండింగ్ విషయంలో ఇబ్బంది కాలేదు.
పాఠం నెం 3: ధైర్యం
‘ఈ పని రాదు అని మేము ఎప్పుడూ భయపడలేదు. ఎందుకు రాదు...ప్రయత్నించి చూద్దాం అనుకొని ముందుకు వెళ్లాం. ఈ క్రమంలో పెద్ద కంపెనీల నుంచి పోటీ ఎదురైంది. ఆ పోటీ నుంచి కూడా ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. మేము భయం దగ్గరే ఆగిపోయి ఉంటే మా ప్రయాణం కొనసాగేది కాదు’ అంటాడు ‘జెప్టో’ కో–ఫౌండర్, సీయివో కైవల్య వోహ్ర. స్టార్టప్ మొదలు పెట్టినప్పుడు పెద్ద కంపెనీలతో పోల్చి మాట్లాడుతుంటారు చాలామంది. వారి మాటలకు చిక్కితే భయమే మిగులుతుంది. భయం అనేది అపజయానికి క్లోజ్‌ఫ్రెండ్.
పాఠం నెం 4: టీమ్ స్ట్రెంత్
స్టీవ్ జాబ్స్‌ను అభిమానించే కైవల్య, అదిత్‌లకు ఆయన నోటి నుంచి వచ్చిన ‘వ్యాపారంలో గొప్ప విజయాలు అనేవి ఒక వ్యక్తి వల్ల వచ్చేవి కాదు. అది సమష్టి కృషి’ అనే మాట తెలియనిదేమీ కాదు. అందుకే తమ మీద తమకు ఆత్మవిశ్వాసం ఉన్నా అది హద్దులు దాటకుండా చూసుకున్నారు. టీమ్ స్ట్రెంత్‌ను నమ్ముకున్నారు. వారి నుంచి సలహాలు తీసుకున్నారు.
పాఠం నెం 5: రీసెట్ డీఎన్‌ఏ
తమ కంపెనీ తక్కువ టైమ్‌లోనే ఘన విజయాన్ని సాధించిన సంతోషంలో ‘జెప్టో స్పీడ్’ అనే టర్మ్‌ను కాయిన్ చేశాడు ‘జెప్టో’ కో–ఫౌండర్, సీయివో అదిత్ పలిచా. అయితే ఈ జెప్టో స్పీడ్‌కు స్పీడ్ బ్రేకర్లు ఎదురొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి క్లిష్ట సమయాల గురించి అదిత్ పలిచా ఇలా స్పందిస్తాడు ‘మరింత క్రమశిక్షణతో ఉండాలనుకున్న సమయం, సుస్థిరమైన ఎదుగుదల మార్గాలపై మరింత దృష్టి పెట్టాలని అనుకున్న సమయం, కంపెనీ డీఎన్‌ఏను రీసెట్ చేయాలనుకున్న సమయం అది.’
Comments
Please login to add a commentAdd a comment