Health Tips For Every Women With A Period Should Know By Dr Bhavana Kasu - Sakshi
Sakshi News home page

Health Tips For Periods: మేడం.. నాకు 25 ఏళ్లు... మూడుసార్లు డాక్టర్‌ దగ్గరకు వెళ్లాను...

Published Sun, Apr 30 2023 1:53 PM | Last Updated on Sun, Apr 30 2023 4:30 PM

Health Tips On Dr Bhavana kasu - Sakshi

 నాది నార్మల్‌ డెలివరీ. నెలవుతోంది. ఇంకా చాలా బ్లీడింగ్‌ అవుతోంది. మాది పల్లెటూరు. ఆసుపత్రి టౌన్‌లో ఉంది. డాక్టర్‌కి చూపించుకోవాలా? 
– డి. కృష్ణకుమారి, రంగరావు పేట

ప్రసవమైన ఆరు వారాల వరకు అప్పడప్పుడు బ్లీడింగ్‌ అవడం సహజమే. కానీ అధిక రక్తస్రావం, క్లాట్స్, వాసన, జ్వరం, నొప్పి వంటి లక్షణాలు మాత్రం నార్మల్‌ కాదు. మీరు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడ మీ టెంపరేచర్, యూటరస్, వెజైనల్‌ బ్లీడింగ్‌ మొదలైనవి చెక్‌ చేస్తారు. ఇంటర్నల్‌ స్కాన్‌ చేసి ప్లెసెంటాకు సంబంధించినవేమైనా మిగిలిపోయాయా.. ఇన్‌ఫెక్షన్‌ ఏమైనా సోకిందా అనీ పరీక్షిస్తారు.

నార్మల్‌ డెలివరీలో అయితే  కుట్లు ఎలా ఉన్నాయో కూడా చూస్తారు. బ్లీడింగ్‌ కంట్రోల్‌ అయ్యేలా మందులు ఇస్తారు. యాంటీబయాటిక్స్‌ స్టార్ట్‌ చేస్తారు. అయినా మీరు బిడ్డకు పాలివ్వచ్చు. రక్త, మూత్ర పరీక్షలు చేసి.. ఇన్‌ఫెక్షన్‌ ఏమైనా ఉందేమో చూస్తారు. మీకు ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్‌ అవసరం అవుతాయి. పప్పుధాన్యాలు, ఆకుకూరలు, తాజా కూరగాయలు, కోడిగుడ్లు, మాంసపు కూరలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. కాళ్లల్లో, ఛాతీలో కూడా బ్లడ్‌ క్లాట్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి టెడ్‌ స్టాకింగ్స్‌ను సజెస్ట్‌ చేస్తారు. 

 మేడం.. నాకు 25 ఏళ్లు. ప్రైవేట్‌ పార్ట్స్‌లో తరచుగా ఇచ్చింగ్‌ వస్తూంటుంది. ఎన్నిసార్లు మందులు వాడినా.. మళ్లీ మళ్లీ తిరగబెడుతూనే ఉంది. కిందటేడాది మూడుసార్లు డాక్టర్‌ దగ్గరకు వెళ్లాను. అయినా తగ్గట్లేదు. ఎందుకు?
– సరళ గ్రేస్, పెనుగొండ
మీరు చెప్పేదాన్ని బట్టి మీకు వెజైనల్‌ యీస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టు అనిపిస్తోంది. దీన్ని వెజైనల్‌ కాండిడయాసిస్‌ అంటారు. ఈ కండిషన్‌లో దురద, డిశ్చార్జ్‌ ఉంటాయి. కానీ రికరెంట్‌ కాండిడయాసిస్‌ అంటే ఏడాదిలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఇన్‌ఫెక్షన్‌ వస్తే లాంగర్‌ ట్రీట్‌మెంట్‌ కోర్స్, మెయిన్‌టెనెన్స్‌ కోర్స్‌ను ప్రిస్క్రైబ్‌ చేయాలి. మామూలు మందులతో తగ్గదు. ఆయింట్‌మెంట్లు, క్రీములు, వెజైనాలో పెట్టుకునే మాత్రలతో తాత్కాలిక ఉపశమనం ఉంటుంది తప్ప ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా తగ్గదు. సరైన చికిత్స అందాలంటే ఈ ఇన్‌ఫెక్షన్‌ రావడానికి గల కారణాలను అంచనా వెయ్యాలి. యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడినా.. చక్కెర వ్యాధి అదుపులో లేకపోయినా, రోగనిరోధక శక్తి సన్నగిల్లినా, హార్మోన్స్‌ థెరపీ తీసుకుంటున్నా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఉన్నా రిస్క్‌ పెరుగుతుంది. 

మీరు డాక్టర్‌ని సంప్రదించినప్పుడు వెజైనల్‌ ఎగ్జామినేషన్‌ – స్పెక్యులమ్‌ ఎగ్జామ్‌ చేయించుకోవాలి. వెజైనల్‌ స్వాబ్‌ కల్చర్‌ పంపించాలి. లాంగ్‌ కోర్స్‌ వెజైనల్‌ థెరపీలో రెండు వారాలపాటు కంటిన్యుయస్‌గా యాంటీఫంగల్‌ మెడిసిన్స్‌ తీసుకోవాలి. తరువాత వారానికి ఒకసారి అలా ఆరు నెలల వరకు కొనసాగించాలి. ఓరల్‌ యాంటీఫంగల్‌ మందులను కూడా ఇస్తారు. రక్త, మూత్ర పరీక్షలను చేస్తారు. ఇలా కంప్లీట్‌ కోర్స్‌తో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌కి చికిత్సను అందిస్తారు.. అది తిరగబెట్టకుండా ఉండడానికి!   

 నా వయసు 25 సంవత్సరాలు. ఈ మధ్య నాకు నెలసరికి ముందు చాలా నొప్పి, మూడ్‌ స్వింగ్స్, తలనొప్పి అనిపిస్తున్నాయి. నా జాబ్‌లో కూడా నేను పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. నాకేదైనా సమస్య ఉందా?
– నైమిష, వైజాగ్‌
దీనిని ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎంఎస్‌) అంటారు. ఇది ప్రతి వందమందిలో ఇద్దరికి మీలో ఉన్నంత తీవ్రంగా లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల వారి దినచర్యలో ఇబ్బందులు ఎదురవుతాయి. చాలామందికి నెలసరి మొదలవడానికి రెండువారాల ముందు నుంచి శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. బరువు పెరగడం, మానసికంగా బలహీనం కావడం, తలనొప్పి, చిరాకు, కోపం, నిద్రలేమి, నీరసం ఉంటాయి. పీఎంఎస్‌కి సరైన కారణం తెలియదు. హార్మోన్ల మార్పు వల్ల వస్తుందని అనుకుంటాం.

మీలో ఉన్న మార్పులన్నీ ఒక కాగితంపై రాసుకోవాలి. దీనిని మెన్‌స్ట్రువల్‌ డైరీ అంటాం. దీనిని రెండు మూడు నెలలు రాసినప్పుడు కారణాలు తెలుస్తాయి. దినచర్యలో మార్పులతో దీనిని తగ్గించవచ్చు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమతుల పోషకాహారం తీసుకోవడం, నెలసరికి రెండు వారాల ముందు నుంచి కాఫీ, టీ, జంక్‌ఫుడ్‌ తగ్గించుకోవడం, మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడానికి యోగా వంటివి అలవాటు చేసుకోవడం వల్ల పీఎంఎస్‌ లక్షణాలు చాలా వరకు తగ్గుతాయి. డాక్టర్‌ పర్యవేక్షణలో కొన్ని మందులు కూడా వాడుకోవలసి ఉంటుంది. విటమిన్‌–డి, విటమిన్‌–ఇ సప్లిమెంట్లు కూడా కొంత వరకు ఉపయోగపడతాయి. కొంతమందికి పైమార్పులతో కూడా లక్షణాలు తగ్గకపోతే, డాక్టర్లను సంప్రదిస్తే జీఎన్‌ఆర్‌హెచ్‌ ఎనలాగ్స్‌ మందులు ఇస్తారు. అత్యంత అరుదుగా ఈ సమస్యకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.

డా‘‘ భావన కాసు
గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌
హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement