ఈ ఏడాదంతా సైన్స్‌ విశేషాలే! | 2022 roundup international science incidents | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదంతా సైన్స్‌ విశేషాలే!

Published Wed, Dec 28 2022 12:56 AM | Last Updated on Wed, Dec 28 2022 12:56 AM

2022 roundup international science incidents - Sakshi

కొత్త సంవత్సరం రానున్నది. అంటే గడిచిన సంవత్సరంలో జరిగిన, గమనించదగిన అంశా లను సమీక్షించడానికి ఇది తగిన సమయం. 2022లో చాలా ఆసక్తికరమైన విషయాలే జరిగి నట్లు చూడవచ్చు. జనవరి మాసంలో టోంగాలోని ‘హుంగా టోంగా’ అనే అగ్నిపర్వతం పేలింది. 21వ శతాబ్దిలో ఇంతటి పేలుడు ఇదివరకు జరగలేదు. ఈ అగ్ని పర్వతం హోంగా ప్రధాన ద్వీపం పక్కన ఇంచుమించు సముద్రంలో ఉంటుంది. కనుక సునామీ పుట్టి 90 మీటర్ల ఎత్తు అలలు పుట్టాయి. నలుగురు మాత్రమే మరణించారు.

జనవరి 24న రష్యావారు ఉక్రెయిన్‌ మీద దాడి చేశారు. ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్యలో అణు విద్యుత్కేంద్రాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన చెర్నోబిల్‌ కూడా అక్కడే ఉంది. ప్రపంచంలో అణు విద్యుత్తు  ఉత్పత్తిలో ఆ దేశం 7వ స్థానంలో ఉంది. జపోరిజిజియా అనే చోట యూరోప్‌లోకెల్లా పెద్ద విద్యుత్కేంద్రం ఉంది. దాని మీద రష్యా దాడి ప్రభావం పడింది. అంటే యుద్ధం ఇంచుమించు అణు యుద్ధంగా మారే అవకాశం ఉంద నాలి. వీరి కేంద్రాలు నిజానికి పాతవి. కొత్తగా కడుతున్న కేంద్రాలలో ఇటువంటి తాకిడులను దృష్టిలో ఉంచుకుని తగిన రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తాకిడిలో మరీ పెద్ద ప్రమాదాలు ఏవీ జరగలేదం టున్నారు నిపుణులు.

ఎవరికి వారు వంశ వృక్షాలు సిద్ధం చేసుకోవడం మామూలే. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మొత్తం మానవ జాతికి వంశ వృక్షం తయారు చేసే ప్రయత్నం మొదలయింది. మానవుల జన్యు వివరాలను పరిశీ లించడం ఇప్పుడు మామూలయింది. అటువంటి ఆధునిక పరీక్షలు 3,600 వరకు ఉన్నాయి. కొన్ని ప్రాచీన మానవ జన్యు పరీక్షల ఫలితాల ఆధారంగా ఈ కొత్త వంశ వృక్షం తయారవుతున్నది. ఆక్స్‌ఫర్డ్‌ యూని వర్సిటీలో జరుగుతున్న ఈ పరిశోధనకు ప్రపంచం మొత్తం నుంచి సమాచారం అందుతున్నది అంటున్నారు పరిశోధకురాలు గిల్‌ మెక్‌ వీన్‌.

ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్‌లు దాటింది. పర్యావరణం పాడవుతున్నది. గడచిన ఫిబ్రవరి తరువాత మరోసారి సీఓపీ సభలు జరిగాయి. పరిస్థితి మాత్రం అసలు మార్పు లేకుండా ఉంది. వాతావరణ మార్పు ప్రభావాలకు గురవుతున్న బడుగు దేశాలకు సహాయం అందిం చడానికి గాను నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. నెల రోజుల యినా నిధులు ఇస్తున్నట్లు ఎవరూ ప్రకటించలేదు. పెట్రోలియం కంపెనీల మీద ఒత్తిడి తేవాలని యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటరెస్‌ గట్టిగా అంటున్నారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి కూడా ఎటువంటి ఆశ కనిపించడం లేదు. ఏం జరుగుతుందని పేద దేశాలు ఆత్రంగా చూస్తున్నాయి.

ఆస్టరాయిడ్‌లు అనే అంతరిక్ష శిలల వల్ల భూమికి ప్రమాదం జరిగే అవకాశాలు అప్పుడప్పుడు ఎదురువుతుంటాయి. నాసా వారు అటు వంటి శిలలను దారి మళ్లించే ప్రయత్నంలో విజయం సాధించారు. భూమికి 11 మిలియన్‌ కిలోమీటర్ల దూరం పయనించిన ‘డార్ట్‌’ అనే నౌక ‘డైమార్ఫస్‌’ అనే అంతరిక్ష శిలను పక్కకు కదిలించ గలిగింది. ఈ చిన్న శిల నిజానికి మరొక పెద్ద శిల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఇప్పుడు పెద్ద శిలకు కొంచెం దగ్గరగా జరిగింది. ఈ విజయం ఆధారంగా, రానున్న కాలంలో ఇటువంటి శిలలను దారి మళ్లించే ప్రయత్నాలు మరింత ఆశాజనకంగా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు.

మానవ శరీర భాగాలను ఒకరి నుంచి మరొకరికి మార్చే ప్రయ త్నాలు ఈ మధ్యన బాగా జరుగుతున్నాయి. న్యూయార్క్‌ యూనివర్సిటీలో సర్జన్‌లు ఈ సంవత్సరం జనవరిలో జన్యు మార్పులకు గురి చేసిన పంది గుండెను ఒక మనిషికి అమర్చారు. డేవిడ్‌ బెనెట్‌ అనే ఆ వ్యక్తి రెండు నెలల తరువాత చనిపోయాడు. అయినా, అతను అంతకాలం బతకడం గమనించదగిన విషయమని పరిశోధకులు అభి ప్రాయపడుతున్నారు. 2021 వరకు జంతు శరీర భాగాలను మనుషులలో అమర్చడం అన్నది ఆలోచనగానే ఉండేది. ఇప్పుడది వాస్తవం కాబో తున్నది అంటారు బర్మింగ్‌హామ్‌ సర్జన్‌ ఆండర్సన్‌.

భౌతిక శాస్త్ర పరిశోధకులు విశ్వంలోని పదార్థ నిర్మాణం గురించి అడ్వాన్స్‌డ్‌ పరిశోధనలు చేస్తుండటం తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం బోసాన్‌లు అనే పదార్థ కణాలు కనిపించాయని గొప్ప గోల పుట్టింది. ఈ సంవత్సరంలో డబ్ల్యూ బోసాన్‌ అనే కణం గురించిన పరిశో ధనలు, రంగంలో అందరినీ ఒక అడుగు వెనుకకు కదిపే రకం ఫలితా లనిచ్చాయి. జెనీవాలోని వార్జ్‌ వోడ్రాన్‌కీవైడర్‌లో ఈ పరిశోధనలు చాలా బలంగా జరుగుతున్నాయి. 2028 నాటికిగానీ, ఈ విషయం గురించి ఏమీ చెప్పలేము అన్నారు అక్కడి వారు.

మైనస్‌ 12 డిగ్రీలు అంటే... అంటార్క్‌టికా లాంటి చోట తప్ప మరెక్కడా వీలుగాని వేడిమి. అది అసలు వేడిమి కాదు. చల్లదనం. దక్షిణ ధృవం నుంచి 1,600 కిలోమీటర్ల దూరంలోని కన్‌కార్డియా పరిశోధనా కేంద్రంలో ఆ టెంపరేచర్‌ 2022 సంవత్సరం మార్చిలో గమనించారు. అంటే అక్కడ వేడిమి మొదలయిందని అర్థం అంటు న్నారు. సముద్రాలు వేడెక్కుతున్నాయి. కనుక ధృవాలు కూడా వేడెక్కు తున్నాయి. ఇటు గ్రీన్‌లాండ్, అంటే ఉత్తర ధృవంలో ఫియోనా హరికేన్‌ కారణంగా బిలియన్‌ టన్నుల మంచు కరుగుతున్నట్టు ఈ సంవత్సరంలో గమనించారు.

2022 సంవత్సరంలో జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌ విశ్వంలో అంతకు ముందు చూచి ఎరుగని ప్రాంతాలను పరిశోధకులకు చూప గలుగుతున్నది. భూమి నుంచి రీలుగాలి పద్ధతిలో యంత్రం ఎగ్జో ప్లానెట్‌లను, అక్కడి వాయువులను గురించి సమాచారం అందించింది. టెలిస్కోప్‌లో మరో 25 సంవత్సరాలకు సరిపడా ఇంధనం ఉంది. అంటే మరెంతో

సమాచారాన్ని అది అందజేయగలుగుతుంది.
అణు విద్యుత్‌ కేంద్రాలలో అణువులను విచ్ఛిన్నం చేసి, అంటే పగులగొట్టి శక్తిని పుట్టిస్తారు. అణువుల కలయిక లేదా సంయోజనం ద్వారా కూడా శక్తి ఉత్పాదన వీలవుతుంది. అయితే అందుకు మరో ముప్ఫై సంవత్సరాలు పడుతుందని చాలా కాలంగా అంటున్నారని ఒక జోక్‌ ఉంది. 2022లో ఆ పరిస్థితి మారింది అంటున్నారు. ఈ ఏడాది యూకేలో ఈ రంగంలో మంచి ఫలితాలు కనిపించాయి. 2025లో అణు సంయోజన కేంద్రం ఒకటి పని మొదలు పెడుతుంది అంటున్నారు పరిశోధకులు.

ప్రపంచంలో చాలా చోట్ల పెద్ద ఎత్తున కరువులు ఈ సంవత్సరంలో కనిపించాయి. ఆఫ్రికా, చైనా, యూఎస్‌లలో నదులు ఎండిపోయినట్లు గమనించారు. విజ్ఞాన శాస్త్రంలో సమస్యలను, సమస్యలుగా గాక, అవకాశాలుగా భావించి ముందుకు సాగడం అలవాటు. వచ్చే ఏడాది ఏం జరుగనుందో వేచి చూడాలి.

కె.బి. గోపాలం 
వ్యాసకర్త అనువాదకుడు, రచయిత 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement