మతం, మార్కెట్‌ కలిసిన రాజకీయం | Ajay Gudavarthy Article on Religion Politics in India | Sakshi
Sakshi News home page

మతం, మార్కెట్‌ కలిసిన రాజకీయం

Published Thu, May 19 2022 12:55 AM | Last Updated on Thu, May 19 2022 1:01 AM

Ajay Gudavarthy Article on Religion Politics in India - Sakshi

స్వేచ్ఛా మార్కెట్టు అనే భావనలో ఎటువంటి స్వేచ్ఛా లేదు. అది... మధ్యతరగతి వాళ్ళకు ‘మేం మంచిగానే ఉన్నా’మనిపించే కొనుగోలుదారీతనపు మానసిక తృప్తినీ, పేద సాదలకు కేవలం నానా ఇబ్బందులూ పడి రోజువారీ బతుకు బత్తెం సంపాదించుకునే అవకాశాన్నీ ఇచ్చే నిర్మాణం మాత్రమే! ఇక్కడ విజయానికీ, ఓటమికీ పూర్తిగా బాధ్యులు వ్యక్తులే గానీ వ్యవస్థ కాదు. ఇక, అంతిమ సత్యాన్ని వ్యక్తి అర్థం చేసుకోవడానికి మతం ఒక దారి చూపుతుంది. ఫలితాల సాధనకు గానీ, సాధించలేనితనానికి గానీ సంపూర్ణ బాధ్యత సాధకులదే తప్ప మరొకరిది కాదు. ఈ రకంగా దేశంలో మతమూ, మార్కెట్టూ నడుమ భావనాత్మక ఐక్యత కుదిరింది. ఇప్పుడు మతం సామాజిక జీవితాన్ని నయా ఉదారవాద మార్కెట్‌కు అనుకూలంగా మార్చే పనిముట్టు మాత్రమే!

మతమూ, వ్యాపారమూ అనే జోడుగుర్రాల మీద నయా ఉదారవాద హిందూత్వం సవారీ చేస్తూ, వ్యక్తి వాద ఆత్మ తృప్తిని గొప్ప విలువగా ప్రచారం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా ప్రజలను తిప్పుకునే కార్యక్రమంలో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి మతాన్ని రాజకీయ పనిముట్టుగా మార్చడం అయితే, మరోటి ఉదారవాద మార్కెట్టును ఆయుధంగా మార్చడం. తీవ్రమైన నయా ఉదార వాదం... సాయుధమూ, హింసాత్మకమూ అయిన మత ప్రతీకలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ప్రభుత్వ రంగ వనరులను కుదువ బెట్టి డబ్బుచేసుకోవడం, ప్రజల వనరులను ప్రైవేటు రంగానికి అప్పచెప్పడం అనే ఆర్థిక కార్యక్రమం... ఆదే సమయంలో వ్యక్తిగత వ్యవహారంగా ఉండాల్సిన మతాన్ని బజారుకు ఈడ్వడం అనే వ్యూహం ఒకదానితో ఒకటి ముడి పడి ఉన్నాయి. 

వాస్తవానికి స్వేచ్ఛా మార్కెట్టు అనే భావనలో ఎటువంటి స్వేచ్ఛా లేదు. అది మధ్యతరగతి వాళ్ళకు ‘మేం మంచిగానే ఉన్నాం’ అని అనిపించే కొనుగోలుదారీతనపు మానసిక తృప్తినీ, పేద సాదలకు  కేవలం నానా ఇబ్బందులూ పడి రోజు వారీ బతుకు బత్తెం సంపా దించుకునే అవకాశాన్నీ ఇచ్చే నిర్మాణం మాత్రమే! ఇంకా ఇప్పుడు బజార్లలో మనకి కనిపిస్తున్న మతానికి ఆధ్యాత్మిక వికాసంతో ఎటువంటి సంబంధం లేదు. అది ఇప్పుడు అధిక సంఖ్యాకుల ఆధిపత్యాన్ని గట్టి పరిచే పనిముట్టు మాత్రమే. దోపిడీని స్వేచ్ఛ అని చూపే నయా ఉదార మార్కెట్టు, బజారుకెక్కి హింసాత్మక అధి పత్యాన్ని గట్టిపరిచే మతం... ఒకదానితో ఒకటి పెనవేసుకొన్న కొంగొత్త దృశ్యం ఇది!

భారతదేశంలో హిందుత్వ రాజకీయాలు... మార్కెట్టునూ, మతాన్నీ రెండింటినీ కలిపి జనాన్ని తన వైపు తిప్పుకోవడానికి వాడుకుంటున్న వైనం స్పష్టం. అంతిమ సత్యాన్ని వ్యక్తి అర్థం చేసుకోవడానికి మతం ఒక దారి చూపుతుంది. విశ్వాసపూరిత మత ప్రధాన ఆచరణ ద్వారానే అంతిమ సత్యం లేదా దైవం అనుభవం లోకి వస్తుందనేది మతం చెప్పే కీలక విషయం. దైవాన్ని లేదా అంతిమ సత్యాన్ని తెలుసుకోలేదు అంటే... అనుమానాలు, సందేహాలు లేని పూర్ణ విశ్వాసం లేకపోవడమే కారణం అనే తర్కాన్ని మతాలు వాడుతాయి అని కొంచం కొంచం పరిశీలించే వారికి తెలిసి పోతుంది. 

అంటే విశ్వాసం లేకపోవడం వల్లనే విశ్వాసం ఇచ్చే అనుభవాన్ని పొందలేకపోవడానికి అడ్డంకి అనే విచిత్రమైన తర్కాన్ని మతం ముందుకు తెస్తుంది. అంటే మతాన్ని పాటించాలి అంటే ఎటువంటి ప్రశ్నలు వేయకూడదు. రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయో అన్న సంశయాత్మక దృష్టి కలిగి ఉండటం అంటేనే మతం పట్ల విశ్వాసం లేని స్థితి అవుతుంది. ఈ తర్కం నీకు అచంచల విశ్వాసం లేకుంటే  (పూర్ణ విశ్వాసిగా) నీవు అనుకున్న ఫలితాలు సాధించలేవు అనే వైపునకు దారి తీస్తుంది. ఫలితాల సాధనకు గానీ, సాధించలేని తనానికి గానీ సంపూర్ణ బాధ్యత సాధకులదే తప్ప మరొకరిది కాదు అనే నిరంకుశ తర్కం ఇది. 

ఇక్కడ నేటి భారత దేశంలో ఉపయోగిత ప్రధానమైన మార్కెట్‌ తర్కంతో మనం ఆత్మ నిర్భరత సాధించాలి అంటున్నాం. ఈ ఆత్మ నిర్భరత శిఖరాన్ని చేరుకోవాలంటే ఒక్కో అంచె ఎక్కడానికి మనం చాలా ప్రయాస పడాలి. ఒకవేళ ఆ అంచెను ఎక్కడంలో విఫలం అయితే దానికి వ్యక్తుల అసమర్థత మాత్రమే కారణం (దానికి వ్యవస్థా గత కారణాలు ఉండవు). ఎవరి విజయానికి వారే బాధ్యులు అని గుర్తు పెట్టుకోవాలి. ఈ రకమైన చట్రం నుండి చూస్తే ఇక్కడ భద్రత అన్నది ప్రధాన విలువ అని తెలుస్తుంది. స్వేచ్ఛ అనే దానికి ఇక్కడ చోటు లేదు. వ్యక్తుల సముదాయాలు తమ తమ వ్యక్తిగత బాధ్యతా యుత ప్రయత్నాల ద్వారా మాత్రమే భద్రతను సాధించుకోవాలి. నిర్భయస్థితికి చేరుకోవాలి! మొత్తంగా వ్యక్తిగత భద్రత లేక నిర్భ యత్వం సాధించాలంటే స్వేచ్ఛను పక్కకు పెట్టి బాధ్యతగా పనిచేయ డమే దిక్కు అనేది ఈ తర్కం చెప్పుతున్న విషయం. మన దేశంలో ఈ రకంగా మతమూ, మార్కెట్టూ రెండూ వ్యక్తి బాధ్యతకు అధిక ప్రాధా న్యతని ఇస్తూ ఉన్నాయి. అట్లా వాటి నడుమ భావనాత్మక ఐక్యత కుదిరింది. 

గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న ప్రైవేటీకరణా, నయా ఉదరవాద ఆర్థిక సంస్కరణలూ, వాటి ఫలితాల వల్ల... స్వాతంత్య్రం తరువాత కాలంలో దేశంలో ప్రజలందరూ నిలబడిన జాతీయ విలువల సాధికారత నశించి పోయింది. ఇప్పుడు సంక్షేమం అంటే  బుజ్జగింపో, లేక దానం పొందే అనుచరులను తయారు చేసుకునే వ్యవహారంగానో మారిపోయింది. హింసాత్మక నిరాకరణకు గురి కావడమో లేక పూర్తి విశ్వాస పూరిత విధేయత ప్రదర్శించడమో అనేవి మాత్రమే ఇప్పుడు సంక్షేమాన్ని ఆశించే వారి ముందున్న రెండు దారులుగా మారిపోయిన దుఃస్థితి ఉన్నది. అధికారానికి పూర్తిగా  విధేయులుగా ఉన్నాం అని చెప్పుకునే దానికి ప్రమాణంగా  ‘పరాయి వారు’గా ముద్రితమైన ముస్లింలను దూరం పెట్టాలి అనే ఒత్తిడి ఎల్లెడలా ఉంది ఇప్పుడు. ఈ నిరాకరణ– విధేయత చట్రానికి బయట ఉండే వారు పూర్తిగా ఒంటరులు. అదృష్టం, అరకొర అవకాశాల కోసం ఎదురు చూసే నిస్సహాయులు! ఇదీ ఈ దేశంలో ప్రస్తుతం విపరీతంగా ఊపులో ఉన్న హిందూ ఏకీకరణకు అందుతున్న మద్దతుకు వెనుక ఉన్న వాస్తవం. పెచ్చు పెరిగిపోతున్న వ్యక్తివాదం పక్కనే ఈ హిందూత్వ సాముదాయిక ఏకీకరణ కూడా జరుగుతోంది. ఇది ఒక విషాద వైపరీత్యం. 

వాస్తవానికి ఇది మతాన్ని సాయుధంగా మార్చి మార్కెట్‌ విస్తరణను నిరంతరాయంగా కొనసాగించే వ్యవహారం. ఇప్పుడు మన దేశంలో రాజ్య యంత్రానికి ఈ వ్యవస్థీకృత దుర్మార్గాన్ని, చట్టబద్ధ పాలన నుండి తప్పించే కొత్త బాధ్యత ఏర్పడింది. చట్టం అమలును పక్కన పెట్టివేయడం ఇప్పుడు నిత్య కృత్యం అయిపోయింది. ఢిల్లీ మత కల్లోలాల సందర్భంలో తప్పుడు కేసులు పెట్టడం, జహాంగీర్‌ పురిలో కూల్చివేతలు... ఈ నూతన రాజ్య ప్రవర్తనకు ఉదాహరణలు. చట్ట బద్ధ పాలన అనేది మెజారిటీ ప్రజల భద్రతకు అవరోధం అనే భావం బాగా ప్రచారం అవుతున్నది. చట్టబద్ధ పాలన, రాజ్యాంగ బద్ధ ప్రవర్తన అనే మాటలకు – ‘మైనారిటీలను బుజ్జగించడం’ అనే విపరీ తార్థాలు తీస్తున్నారు.
మన నడుమ ఇప్పుడు మతంగా ఉన్నది సామాజిక జీవితాన్ని మొత్తంగా నయా ఉదారవాద మార్కెట్‌కు అనుకూలంగా మార్చే ప్రక్రియకి పనికి వచ్చే పెద్ద పనిముట్టు మాత్రమే. వ్యక్తివాదం, హద్దూ అదుపూ లేని ప్రైవేటు లాభాపేక్షను పెంచే నయా ఉదార వాద మార్కెట్‌ అనే నేలలో ఈనాటి మతోన్మాద మూలాలు ఉన్నాయన్నది గమనించాల్సిన వాస్తవం. పండుగలు ఇప్పుడు ఉత్సాహాన్నీ, ఆనం దాన్నీ పంచుకునే సందర్భాలు కావు. అవి హింసాత్మక శక్తి ప్రదర్శన లుగా మారిపోయాయి. ఈ దుర్భర పరిస్థితిని ఎదుర్కోవడానికి మన దేశంలో అంతర్గతంగా చాలా ప్రయత్నాలు జరగాలి. బయటి నుండి వచ్చి ఎవరూ మనలను కాపాడే స్థితి లేదు. తక్కువలో తక్కువ ప్రయ త్నంగా, ముందుగా ఎట్టి పరిస్థితిలోనూ హింసకు ఆమోదం తెలప కుండా, మెజారిటీ ప్రజలకు ఉన్న అభద్రత ఏమిటి? దాని కారకాలు ఏమిటి? అన్న అంశాలను పట్టించుకోవాలి. మీ మంచికీ, చెడుకూ మీరే కారణం అని చెప్పే మార్కెట్‌ ఆధారిత స్వచ్ఛందతా ఉప దేశాలను వెనక్కు నెట్టేసి... నియమ బద్ధమూ, వ్యవస్థీకృతమూ అయిన సంక్షేమాన్ని ముందుకు తేవాలి. విషపూరిత మత వాదానికి... మెజారిటీ, మైనారిటీ మతçస్థులు ఎవరు పాల్పడినా ఎటువంటి మిన హాయింపు ఇవ్వకుండా దాన్ని ఎండగట్టి, తీవ్ర విమర్శకు నిలపడం ఇప్పుడు జరగాలి. దేశంలో నిండి పోతున్న విషాలకు ఇప్పుడు విరుగుడు కావాలి. అది దేశం లోపటినుండే రావాల్సి ఉంది. 

వ్యాసకర్త: ప్రొ‘‘ అజయ్‌ గుడవర్తి
ఢిల్లీ జేఎన్‌యూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement