దేశంలోని ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితిని సమీక్షించేందుకు కీలకమైన అంతర్జాతీయ సందర్శకుడితో భేటీని ప్రధానమంత్రి కార్యాలయం రద్దు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీడియా కరోనా వాస్తవ పరిస్థితిపై మరిన్ని ప్రశ్నలను సంధించాలి తప్ప ప్రభుత్వం నుంచి వచ్చే ‘మమ్మల్ని నమ్మండి’ అనే రకం సమాధానాలకు తలూపవద్దు. ఈ విషయంలో మనం పదే పదే ప్రశ్నించడం ద్వారానే ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ అమలు వంటి వాటిపై పునరాలోచించడానికి వీలుపడుతుంది. ప్రభుత్వాలపై నమ్మకం పెట్టడం కాదు.. ప్రజలను, ప్రశ్నలు సంధించేవారిని ప్రభుత్వాలు విశ్వసించవలసిన సమయం ఇది.
ప్రాణాంతకమైనది కానట్లయితే కరోనా అంటే మనందరికీ ఒక కామెడీగా ఉండేది. మన దేశంలో కనబడుతున్న కరోనా రకం బి. 1.617 బ్రిటన్‌లో తొలిసారి ఈ ఫిబ్రవరిలో కనిపించింది. కానీ మన దేశంలో మాత్రం కరోనా బీభత్సంగా వ్యాప్తి చెందడానికి కొత్త కరోనా రకం కారణం కాదని చెబుతున్నారు. వ్యాక్సిన్ పోర్ట్ ఫోలియోని మరింతగా విస్తరించాలని సూచించినందుకు కేంద్రమంత్రులు ప్రతిపక్ష సీనియర్ నేతను తూర్పారబడుతూ ఆయన మందుల కంపెనీలకు దళారీ అంటూ ముద్రవేసి మరీ అవమానించారు. సరిగ్గా మూడు రోజుల తర్వాత వాక్సిన్ పోర్ట్‌ఫోలియోను కేంద్రప్రభుత్వమే విస్తరించడం గమనార్హం. 45 ఏళ్లు పైబడిన వారికే కాదు మే 1 నుంచి దేశంలో 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ మొదలెడతామని కేంద్రం ప్రకటించింది. పైగా కరోనా వ్యాక్సిన్ కొరత లేదని, కానీ రాష్ట్రాలు మాత్రం వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేస్తున్నాయని కేంద్రం ఆరోపించింది. దేశంలో ఆక్సిజన్ కొరత లేదని సీనియర్ అధికారులతో కూడిన సాధికారక బృందం చెప్పింది. కానీ దేశంలోని ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు అంతర్జాతీయ సందర్శకుడితో భేటీని ప్రధానమంత్రి కార్యాలయం రద్దు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
కరోనా వ్యాక్సినేషన్‌కి సంబంధించి పూర్తిగా నియంత్రించిన సమాచారం అనేది మహమ్మారి సామూహిక నిర్వహణకు, సహాయకారి కాదని చెప్పాలి. మహమ్మారితో తలపడేందుకు ఎలాంటి సమాచారాన్ని విడుదల చేస్తే సహాయకారి అవుతుంది?
ఒకటి: భారత వైద్య పరిశోధనా మండలి వద్ద అందుబాటులో ఉన్న యాంటిజెన్ పరీక్షల సమాచారాన్ని బహిర్గతం చేయాలి. పరీక్ష స్వభావం రీత్యా ఇది తప్పిపోయిన ఇన్ఫెక్షన్లను కనుగొనడంలో లోపభూయిష్టమైన పద్ధతి. యాంటిజెన్ పరీక్షలను అధికంగా చేయించుకున్న నగరాలు, జిల్లా కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఈ పరీక్షల్లో ఇన్ఫెక్షన్లు లేవని తేలిన వ్యక్తులు స్వేచ్ఛగా తిరిగేస్తూ ఇతరులకు వైరస్ అంటించే ప్రమాదం కూడా ఉంది.
రెండు: స్వీయ పరీక్ష, నిఘాకు, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటివాటికి సంబంధించిన పరీక్షలకు కారణాలేమిటని కనుగొనాల్సి ఉంది. స్వీయ రిపోర్టింగ్ కంటే కాంట్రాక్ట్ ట్రేసింగ్‌కి సంబంధించిన సమాచారాన్ని విస్తృత స్థాయిలో వెల్లడించడమే ఉత్తమం.
మూడు: వివిధ రకాల వైరస్‌ల నిష్పత్తి యునైటెడ్ కింగ్‌డమ్ తరహా వైరస్ రకం బి.1.117. ఎక్కువగా సోకుతున్నట్లు పంజాబ్ ఆరోగ్య శాఖ నివేదించింది. దీనికి రోగనిరోధక శక్తినుంచి తప్పించుకునే ఉత్పరివర్తనం లేదు కాబట్టి ఈ వైరస్ రకం వాక్సినేషన్‌కి అధికంగా స్పందించవచ్చు. ఇకపోతే బి.1.117 రకం వైరస్ ఎక్కువగా ప్రబలుతున్న మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధక శక్తిని కల్పిస్తే ఇన్ఫెక్షన్ తీవ్రతను తగ్గించవచ్చు కానీ ఇది కూడా ఇన్ఫెక్షన్‌ను పూర్తిగా నిలిపివేయలేదు. ఎందుకంటే ఈ వైరస్ రకం రోగనిరోధక శక్తిని తగ్గించే ఉత్పరివర్తనాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల వ్యాధి నిర్వహణపై ప్రభావం చూపవచ్చు. పైగా రోగనిరోధక శక్తి ప్రయోజనాలను ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారన్నది కూడా ప్రధానమే. రోగనిరోధక శక్తిని వ్యాక్సిన్ ద్వారా అందించాక పెద్ద సంఖ్యలో ప్రజలకు మళ్లీ కరోనా సోకితే, వ్యాక్సిన్‌పై అనుమానాలు పెరగవచ్చు. ఇది వ్యాక్సిన్ కార్యక్రమంపై తీవ్ర ప్రభావం కలిగిస్తుంది.
నాలుగు: కేసులు విస్తరిస్తున్న ప్రాంతం. పెద్ద నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు ఏవైనా సరే వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా ఉంటున్నాయి. మహారాష్ట్ర నుంచి వస్తున్న పరిమిత సమాచారం బట్టి కరోనా ఇప్పుడు పెద్ద నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వ్యాపిస్తున్న కరోనా చిన్న పట్టణాలు, పెట్టీ అర్బన్ ప్రాంతాలు, లేక గ్రామాలలో ఎటువైపు కదులుతోంది అనేది అస్పష్టం. వ్యాక్సిన్ భౌగోళిక ప్రాధమ్యతకు ఇది చాలా ముఖ్యం.
అయిదు: ఏ వయస్సుల వారికి కరోనా సోకుతోంది, ఏ వయస్సుల వారు మరణిస్తున్నారు అనేది ముఖ్యం. యుక్తవయస్సులో ఉన్నవారికి కరోనా తీవ్రంగా సోకలేదని మనం భావిస్తూ వచ్చాం. ఇది మన వ్యాక్సినేషన్ వ్యూహాన్ని సమర్థిస్తూ వస్తోంది. కానీ ప్రస్తుతం కరోనా రెండో దశలో యువతీయువకులకు కూడా ఎక్కువగా సోకుతున్నట్లు కనిపిస్తోంది. ముంబైలో కరోనా గణాంకాలు ఇప్పటికీ 50 సంవత్సరాలకు లోపు వయసున్న వారిలో 65 శాతం మందికి కరోనా సోకుతున్నట్లు చెబుతున్నాయి. గతంలో ఇది 57 శాతం మాత్రమే ఉండేది. మరి ఇది వ్యాక్సినేషన్‌కి సంబంధించినదా లేక వైరస్ కొత్త రకానికి సంబంధించినదా అనేది ప్రశ్న. పుణే, ముంబై, ఢిల్లీ తదితర పట్టణాలనుంచి వస్తున్న నివేదికలు చూస్తుంటే ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయని తెలుస్తోంది. ముంబైలో కరోనా మరణాల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తున్నా, మహారాష్ట్ర లోని పలు జిల్లాల్లో అధిక మరణాలు సంభవిస్తున్నాయి. దీనిపై యంత్రాంగం దృష్టి పెట్టాలి. ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోవడం, మరణాలు తక్కువ కావడం జరుగుతోందంటే చాలామంది చికిత్స చేయించుకుంటూ రోగాన్ని నయం చేసుకుంటున్నారని, వృద్ధుల్లోనూ కేసులు తగ్గుతున్నాయని అర్థం. కాబట్టి ఏ వయస్సులో ఉన్న రోగులకు ప్రాధాన్యమివ్వాలి అనే అంశాన్ని ఈ వయోగత చట్రం ప్రభావితం చేస్తోంది. దీన్ని పారదర్శకంగా తెలియజేస్తే ఆక్సిజన్ కోసం, రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్ కోసం పరుగులు తీస్తున్న కుటుంబాలకు కాస్త హామీ ఇవ్వవచ్చు.
ఆరు: వ్యాక్సిన్ వేయించుకున్న వారు తీవ్రంగా వైరస్ సోకి ఆసుపత్రుల పాలయ్యారా? ఇప్పటికే కోటీ 10 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ కార్యకర్తలు పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకోగా, 45 ఏళ్లకు పైబడిన వయస్సు కలిగిన 9 కోట్లమంది ప్రజలు కనీసం ఒక సారి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రత్యేకించి పట్టణ కేంద్రాల్లో 45 ఏళ్లకు పైబడినవారు గణనీయమైన సంఖ్యలో వ్యాక్సిన్ వేయించుకున్నారని స్పష్టమవుతోంది. వీరు వైరస్ సోకినప్పటికీ ఆసుపత్రుల్లో చేరలేదంటే ఇది నిజంగా శుభవార్తే అవుతుంది మరి.
ఏడు: వ్యాక్సిన్ తీసుకున్నాక కలిగే దుష్పరిణామలను నివేదిం చడం ద్వారా వ్యాక్సిన్‌పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమాచారాన్ని ప్రస్తుతం వ్యాక్సినేషన్ డేటాలో పొందుపర్చలేదు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్, జాన్సన్ వ్యాక్సిన్ తీసుకున్నాక కొన్ని కేసుల్లో రోగుల్లో రక్తం గడ్డకట్టిందని అంతర్జాతీయంగా వార్తలు వచ్చాయి. భారత్‌లో ఇంతవరకు 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఇలా రక్తం గడ్డ కట్టిన కేసులు కనిపించలేదు. అయితే ప్రభుత్వం వ్యాక్సిన్‌కి సంబంధించిన ప్రతికూల సమాచారాన్ని పూర్తిగా దాచి ఉంచుతుండడం కారణంగానే ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల విశ్వాసం సడలుతుండవచ్చు.
ఎనిమిది: వ్యాక్సిన్ కొరతను గుర్తించి మన వ్యూహాన్ని మెరుగుపర్చుకోవాలి. వైరస్ వ్యాప్తిని బట్టి గ్రామీణ, పట్టణ, భౌగోళిక ప్రాధ్యానతల ప్రాతిపదికన మనం వ్యాక్సినేషన్ సమాచారాన్ని తప్పకుండా విడుదల చేయాలి. పట్టణ ప్రాంతాలకు అధికంగా సమాచారాన్ని ఇవ్వడం మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. భవన నిర్మాణ కార్మికులు నగరాల్లోని వీధి బళ్ల వర్తకులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా మనం ఫ్రంట్‌లైన్ కార్మికులను పునర్నిర్వచించవచ్చు. వీరిలో చాలామంది కరోనా సోకినప్పటికీ ఆదాయం కోల్పోతామనే భయంతో కరోనా పరీక్షలకు సిద్ధం కాకపోవచ్చు.
తొమ్మిది: గత ఏడాది తమ ప్రాంతాలకు తిరిగొచ్చిన వలస కార్మికుల విషయంలో చేసినట్లుగానే ప్రస్తుతం లక్షలాది భక్తులు గుమికూడిన కుంభమేళా నుంచి తిరిగొచ్చిన వారిని మొత్తంగా క్వారంటైన్ చేసి పరీక్షించవలసిన అవసరం ఉంది. జనం గుమికూడిన తర్వాత కూడా వారికి వైరస్ సోకలేదంటే అది వారి అదృష్టమే కావచ్చు కానీ అంతమాత్రాన అలాంటి భారీ జన సమీకరణల ఘటనలను మనం తేలిగ్గా చూడకూడదు.
పది: మీడియా కరోనా వాస్తవ పరిస్థితిపై మరిన్ని ప్రశ్నలను సంధించాలి తప్ప ప్రభుత్వాల నుంచి వచ్చే ‘మమ్మల్ని నమ్మండి’ అనే రకం సమాధానాలకు తలూపవద్దు. మనం పదే పదే ప్రశ్నించడం ద్వారానే వ్రభుత్వాలు పునరాలోచించడానికి వీలుపడుతుంది. ప్రభుత్వాలను వ్రజలు, మీడియా విశ్వసించడం కాదు.. ప్రజలను, ప్రశ్నలు సంధించేవారిని ప్రభుత్వాలు విశ్వసించవలసిన సమయం ఇది.
పార్థా ముఖోపాధ్యాయ్
సీనియర్ ఫెలో, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్
ప్రశ్నలు సంధించాల్సిన సమయమిది
Published Thu, Apr 22 2021 12:39 AM | Last Updated on Thu, Apr 22 2021 12:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment