
న్యూఢిల్లీ: కరోనా(కోవిడ్-19) నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ నుంచి కేంద్రం మరికొన్ని రంగాలకు మినహాయింపునిచ్చిన నేపథ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో ఏడు ముఖ్య మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తరుణంలో అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై శుక్రవారం చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లాక్‌డౌన్ పాక్షికంగా ఎత్తివేసినా నిబంధనలు కఠినంగా చేయాల్సిందిగా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ కార్యదర్శి హీరాలాల్ సమారియా, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ కార్యదర్శి అరుణ్ పాండా, పట్టణాభివృద్ధి కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, గ్రామీణ అభివృద్ధి కార్యదర్శి రాజేశ్ భూషణ్, షిప్పింగ్ కార్యదర్శి గోపాల్ కృష్ణ, గనుల శాఖ కార్యదర్శి సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.(కరోనా.. మధ్యప్రదేశ్‌లో 35 మంది డిశ్చార్జ్)
ఈ సందర్భంగా... ముఖ్యంగా ప్రజా రవాణా అందుబాటులో లేని తరుణంలో కార్మికుల తరలింపు విషయంపై ప్రధానంగా చర్చించినట్లు పేర్కొన్నారు. ఇక భవన నిర్మాణ కార్యకలాపాలు జోరుగా సాగనున్న వేళ ఆయా చోట్ల ఆశా వర్కర్లు, హెల్త్‌కేర్ వర్కర్ల సేవలను విరివిగా ఉపయోగించుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అదే విధంగా నిబంధనలు పాక్షికంగా సడలించిన కారణంగా పెద్ద ఎత్తును ప్రజలు రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉన్నందున శాంతి భద్రతల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలతో పీఎంఓ ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని పంచుకుంటూ సమీక్షిస్తుందని పేర్కొన్నారు.
కాగా సోమవారం నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు, రోడ్డు, భవన నిర్మాణ రంగ పనులకు అనుమతినిచ్చిన నేపథ్యంలో రోజూ వారీ కూలీలకు కాస్త ఊరట లభించనుంది. ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం శుక్రవారం తాజాగా మరికొన్ని నిబంధనలను సడలింపునిచ్చిన విషయం తెలసిందే.
తాజా సడలింపులు...
- గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు
- నీటి సరఫరా
- పారిశుద్ధ్య రంగానికి చెందిన నిర్మాణ పనులు
- బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు,
- కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల కార్యకలాపాలకు అనుమతి
- కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, ప్రాసెసింగ్
ఇక హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కొద్దిపాటి సిబ్బందితో పనులు చేసుకోవచ్చు. వెదురు, కొబ్బరి, వక్క, కొకొవా తదితర ఉత్పత్తుల ప్లాంటేషన్, ప్యాకేజింగ్, అమ్మకం, మార్కెటింగ్ మొదలైన పనులను ఈ లాక్‌డౌన్ యథావిధంగా కొనసాగించుకోవచ్చు
Comments
Please login to add a commentAdd a comment