ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు పట్టం కట్టనున్నారన్న విషయం సుస్పష్టమయింది. రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు జరగనున్న ఎన్నికల్లోనూ వైసీపీనే విజయం సాధించడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న విపక్షాలు పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఇప్పటికే మట్టికరిచాయి. అన్ని సామాజిక వర్గాల్లోని పేదలూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని స్వాగతిస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా జిల్లాలన్నింటిలో వైఎస్ జగన్ నాయకత్వమే ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి శరణ్యమని ప్రజల్లో గట్టి నమ్మకంగా నిలిచింది.
మూడు రాజధానుల నిర్ణయాన్ని వివాదాస్పదం చేస్తూ టీడీపీ చేపట్టిన అమరావతి ఉద్యమం బూటకమని, దీనికి ప్రజామద్దతు లభించలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. అమరావతిలోనూ 80 శాతానికి పైగా పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే విజయం సాధించడం నిజం. ప్రభుత్వమంటే కాగితాల మీద పంచరంగుల సింగపూర్, మలేషియా చిత్రాలతో మాయ చేయడం కాదని, ప్రజల్ని పంచప్రాణాలుగా పరిరక్షించుకుంటున్న జగన్ పాలనే నిజమైన ప్రభుత్వమని ప్రజలు భావిస్తున్నారు. లక్షలాది మంది పట్టణ పేదలకోసం ప్రభుత్వం సంక్షేమపథకాలు అమలుచేస్తోంది. వీటిలో ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పెన్షన్ కానుక, కాపునేస్తం, పేదలందరికీ ఇల్లు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, విద్యాదీవెన, వసతిదీవెన, చేయూత, వాహనమిత్ర, విద్యాకానుక, జీవక్రాంతి పథకాలు, డ్వాక్రా మహిళలకు ఆర్ధిక భరోసా, విద్యా, వైద్య సంస్థల్లో ‘నాడునేడు’ పథకం ద్వారా అభివృద్ధి పనులు వంటి వాటితోపాటు ఇప్పుడు అగ్రకుల పేద మహిళలకు సైతం ఆర్థిక సహాయాన్ని జగన్ ప్రభుత్వం అందించనుంది.
అభివృద్ధి పనులను విమర్శించడం తప్ప ప్రజలకు ముఖం చూపించలేకపోతున్న టీడీపీ నాయకులు ఇక పుర ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగగలరనే ప్రశ్నగా మిగులుతుంది. పుర ఎన్నికల సందర్భంగా టీడీపీనేత లోకేష్ తన ఎన్నికల మేని ఫెస్టో ప్రకటించారు. దీనిలో అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుస్తామని పేర్కొన్నారు. నేటి ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ సరుకులు తీసుకెళ్ళి అందజేస్తుంటే దీనిని కోట్లాది రూపాయల దుబారా ఖర్చుగా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా ఫలహారాలు, భోజనాలు ఉచితంగా సంతర్పణ చేయడం దుబారా ఖర్చు కిందకు ఎందుకు రాదో వారు గుర్తించగలగాలి. ఆటో డ్రైవర్లకు తమ వాహనాలను బాగుచేసుకోమని పదివేల రూపాయల సహాయాన్ని అందిస్తే విచ్చలవిడిగా డబ్బు విసిరేస్తున్నారని ఎద్దేవా చేసిన టీడీపీనేతలు ఇప్పుడు శాశ్వత ఆటో స్టాండ్లు నిర్మిస్తామనే విషయాన్ని తెరమీదకు తీసుకురావడం విడ్డూరం. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లబ్ధిదారులకు అందించిన సున్నావడ్డీ రుణాలు, పట్టణపేదలకు టీడ్కో ఇళ్లని లోకేష్ తన మేనిఫెస్టోలో పేర్కోవడం హాస్యాస్పదం.
కరోనా తీవ్రంగా ప్రబలుతున్న సమయంలో అవిశ్రాంతమైన సేవలందించిన పారి శుధ్య కార్మికులకు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, అధికారులతో అభినందన కార్యక్రమాలు నిర్వహించింది జగన్ ప్రభుత్వం. అంతేగాక వారికి బీమాతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు లోకేష్ పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామనడం చాలా వింతగా వుందని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. అభాగ్యులకు అన్నక్యాంటీన్లు, ఆడపడుచులకు పసుపు, కుంకుమ సౌభాగ్యంగా అందించినా గత ఎన్నికల్లో ఘోర పరాజయం పొందింది టీడీపీ. పారదర్శకంగా అమలు జరుగుతున్న పేదల సంక్షేమం మీద దుష్ప్రచారం చేయడం దినచర్యగా టీడీపీ నేతలు ఆచరిస్తున్నట్టు కనిపిస్తోంది. నిరంతరం నిరాధారమైన, నీతిలేని విమర్శలు కొనసాగిస్తూనే వున్నారు. పురఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు పట్టం కట్టనున్న అఖండ విజయాన్ని కూడా కళ్ళారా చూసిన తర్వాతైనా వాళ్ళ వైఖరి మారుతుందేమో వేచిచూడాలి.
డా. జీకేడీ ప్రసాద్‌రావు
వ్యాసకర్త ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఏయూ, విశాఖపట్నం
మొబైల్ : 93931 11740
‘పుర’ జనులది కూడా గ్రామీణుల బాటే!
Published Tue, Mar 2 2021 1:34 AM | Last Updated on Mon, Mar 8 2021 5:38 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment