
చందోలు(పిట్టలవానిపాలెం): మండలంలోని చందోలులో వేంచేసి ఉన్న బగళాముఖి బండ్లమ్మ అమ్మవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వెంకటరమణ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ వై.లక్ష్మణమూర్తి, హైకోర్టు ఆఫీసర్ డీవీ నాగేశ్వరరావు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి డి.శ్రీదేవిలు దర్శించుకున్నారు. గుంటూరు హరి ఎంటర్‌ప్రైజెస్ వారు అమ్మవారి ఆలయానికి సమర్పించిన శోభకృత్ నామ ఉగాది పంచాంగాలను బోర్డు చైర్మన్ మోదుగుల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
అమరేశ్వరుని దర్శించుకున్న మంత్రి ఉషాశ్రీచరణ్
అమరావతి: ప్రసిద్ధ శైవపుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న బాలచా ముండికా సమేత అమరేశ్వర స్వామివారిని రాష్ట్ర సీ్త్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆదివారం దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు స్వాగతం పలికారు. అమరేశ్వర స్వామివారికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక కుంకుమపూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు స్వామివారి శేషవస్త్రాన్ని, తీర్ధప్రసాదాలను అందజేశారు. ఆమె వెంట వైఎస్సార్ సీపీ సచివాలయాల మండల కన్వీనర్ బి.హనుమంతరావు, తదితరులు ఉన్నారు.
‘పది’ పరీక్షలకు
పరిశీలకుల నియామకం
గుంటూరు ఎడ్యుకేషన్: ఏప్రిల్ 3వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వం జిల్లాస్థాయిలో పరిశీలకులను నియమించింది. గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఆర్‌ఎంఎస్‌ఏ డైరెక్టర్ పి.పార్వతి, పల్నాడు జిల్లాకు పాఠశాల విద్య ఆర్జేడీ వీఎస్ సుబ్బారావును పరిశీలకులుగా నియమించింది. ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని, పరీక్షలను ప్రశాంత వాతారణంలో జరిగేలా చూడటంలో పరిశీలకులు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంది.
దుర్గమ్మ సన్నిధిలో
సూర్యోపాసన సేవ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోక సంరక్షణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట కళావేదికపై ఆలయ అర్చకులు సూర్యభగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తజనులందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధించాలని కాంక్షిస్తూ సేవ నిర్వహించామని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. సేవలో పలువురు భక్తులు, ఉభయదాతలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్జిత సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
సాగర్ నీటిమట్టం వివరాలు
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 535.20 అడుగుల వద్ద ఉంది. ఇది 178.4758 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకి 9,387, ఎడమ కాలువకు 3,259, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 7,900, ఎస్‌ఎల్‌బీసీకి 2,000, వరద కాలువకి 320 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 22,866 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 814.00 అడుగుల వద్ద ఉంది. ఇది 36.7130 టీఎంసీలకు సమానం.

మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు ఆశీర్వచనం అందజేస్తున్న అర్చకులు

పంచాంగాలను ఆవిష్కరిస్తున్న న్యాయమూర్తి, ధర్మకర్తల మండలి చైర్మన్