
గుంటూరు లీగల్: న్యాయవాదులకు న్యాయం చేసిన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు పోలూరి వెంకటరెడ్డి చెప్పారు. కడపలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయ వాదులను మోసగించేలా అబద్ధపు హామీలు ఇచ్చిన నేపథ్యంలో పోలూరి గుంటూరులో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల మేరకు జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు స్టయిఫండ్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అమలు చేశారని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. న్యాయవాదులకు బీమా సౌకర్యం, చనిపోయిన న్యాయవాదులకు బార్ కౌన్సిల్ వారు రూ.4 లక్షలు ఇస్తుంటే, మ్యాచింగ్ గ్రాంటు కింద మరో రూ.4 లక్షలు ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కరోనా కష్ట కాలంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.10 వేలు, రూ.20 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారని తెలిపారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన రూ.100 కోట్లతోనే అమలౌతున్నాయని తెలియజేశారు.
న్యాయవాదులను మోసగించేందుకే టీడీపీ హామీలు
కడపలో గురు వారం జరిగిన న్యాయవాదుల సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయవాదులను మోసగించేందుకు అబద్ధపు హామీలు ఇచ్చారని పోలూరి విమర్శించారు. 2014 తెదేపా ఎన్నికల మేనిఫెస్టోలో న్యాయవాదులకు సంబంధించి 18 హామీలు ఇచ్చారని, ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలక్రమంలో వాటిని బుట్టదాఖలు చేశారని ఎద్దేవా చేశారు. అధికారం కోసమే చంద్రబాబు, లోకేశ్ అబద్ధపు హామీలు ఇస్తున్నారని, న్యాయవాదులు గమనించాలని కోరారు. న్యాయస్థాన తీర్పులు టీడీపీ వారికి అనకూలంగా వస్తే న్యాయం గెలిచిందంటూ తమ అనుకూల ఛాన ళ్లు, సోషల్ మీడియాలో ఊకదంపుడు ప్రసంగాలు చెబుతున్నారని అన్నారు. తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డికి బెయిల్ మంజూరైతే న్యాయవ్యవస్థ అమ్ముడు పోయిందని టీడీపీ ఆరోపించడం దారుణమన్నారు. టీడీపీ మోసాలను తిప్పికొట్టి, ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని తెలియజేశారు.
వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర
కోర్ కమిటీ సభ్యుడు పోలూరి వెంకటరెడ్డి