
అమరావతి: అమరావతి బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం బాలచాముండేశ్వరిదేవి శాకాంబరిమాత అలంకారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వేమూరి గోపి తెలిపారు. ఆషాఢమాసం పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని అన్ని రకాల కూరగాయలతో అలకరిస్తామని పేర్కొన్నారు.
43 మంది హెచ్‌ఎంలకు ఎంఈవోలుగా పోస్టింగ్స్
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న 43 మంది గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు ఎంఈవో–1 పోస్టుల్లో నియమితులయ్యారు. ఆదివారం గుంటూరులోని పాఠశాల విద్య ఆర్జేడీ కార్యాలయంలో ఆర్జేడీ వీఎస్ సుబ్బారావు అధ్యక్షతన కౌన్సెలింగ్ జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్న 89 ఎంఈఓ–1 పోస్టులను ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్‌ఎంలతో భర్తీ చేసేందుకు జరిగిన ఈ కౌన్సెలింగ్‌కు 61 మంది హాజరయ్యారు. ఎంఈఓలుగా వెళ్లేందుకు అంగీకారం తెలిపిన 43 మంది హెచ్‌ఎంలకు పోస్టింగ్ కేటాయిస్తూ ఆర్జేడీ సుబ్బారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఈఓ–1 పోస్టుల భర్తీ ద్వారా ఖాళీ అయిన గ్రేడ్–2 హెచ్‌ఎం పోస్టులను సీనియార్టీ ప్రాతిపదికన ఉద్యోగోన్నతులతో భర్తీ చేయనున్నట్లు ఆర్జేడీ సుబ్బారావు చెప్పారు. పోస్టింగ్స్ అందుకున్న ఎంఈవోలందరూ సోమవారం ఉదయం తమకు కేటాయించిన మండలాల్లో ఎంపీడీఓలకు సమాచారాన్ని ఇచ్చి విధుల్లో చేరాలని ఆదేశించారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆర్జేడీ కార్యాలయ ఉద్యోగులతో పాటు ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం పాల్గొన్నారు.
అవగాహనతోనే సైబర్ మోసాలకు అడ్డుకట్ట
బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్
బాపట్లటౌన్: అవగాహనతోనే సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయగలమని ఎస్పీ వకుల్‌జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వకుల్‌జిందాల్ మాట్లాడుతూ ఓఎల్‌ఎక్స్ ద్వారా చాలామంది మోసాలకు పాల్పడుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు లింకులు పంపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దని సూచించారు. ఎవరైనా లింకులు పంపితే వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయాలని చెప్పారు. అనంతరం ఎఐస్పీ ఓఎల్‌ఎక్స్ మోసాలపై ముద్రించిన అవగాహన పోస్టర్‌ను ఎస్పీ ఆవిష్కరించారు.
కృష్ణానదిలో వ్యక్తి గల్లంతు
అచ్చంపేట: సత్తెమ్మతల్లి సందర్శనకు వచ్చిన వ్యక్తి గింజుపల్లి వద్ద కృష్ణానదిలో పడి గల్లంతైన ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. తాటికొండలోని బ్రహ్మంగారి వీధిలో నివశించే తాడిబోయిన ప్రభాకరరావు మరో 13 మందితో మాదిపాడులో వెలసిన సత్తెమ్మతల్లిని దర్శించుకునేందుకు వచ్చారు. సాయంత్ర ఆరుగంటలకు భోజనాలు చేసేందుకు గింజుపల్లి వద్దగల కృష్ణానది తీరానికి వెళ్లారు. ఈ సమయంలో ప్రభాకరరావు స్నానం చేసేందుకు నదిలో దిగి గల్లంతయ్యాడు. తనతో వచ్చినవారు ఎంత యత్నించినా ఆచూకీ దొరకలేదు. ఇంతలో చీకటి పడటంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టనున్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 519.60 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 808.50 అడుగుల వద్ద ఉంది.

