తెనాలి: ప్రజా గాయకుడు గద్దర్ గళం మూగబోయిందని తెలిసి ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన అభిమానులు, దళిత, ప్రజాసంఘాల నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో గల అనుబంధాన్ని స్మరించుకుంటున్నారు. గద్దర్ యువకుడిగా ఉన్నప్పట్నుంచీ తెనాలికి రాకపోకలు సాగించారు. అప్పట్లో తెనాలి రాడికల్ కేంద్రంగా ఉండేది.
రాడికల్ స్టేట్ యూత్ అధ్యక్షుడిగా ఉన్న అధ్యాపకుడు పీజే వర్ధనరావును కలిసేందుకు తరచూ గద్దర్ తన స్నేహితులతో సహా వచ్చేవారు. ఉద్యమాల్లోకి వచ్చాక విప్లవ పార్టీల సభలు, ఆందోళనల్లో పాల్గొనేందుకు జిల్లాలోని గుంటూరు, పల్నాడు, తెనాలి ప్రాంతాలకు పలు సందర్భాల్లో వచ్చారు.
తెనాలిలో 1985 విరసం మహాసభలకు హాజరయ్యారు. ఒడిశాలో ఆస్ట్రేలియన్ క్రిస్టియన్ మిషనరీ గ్రాహం స్టెయిన్స్ కుటుంబ సజీవదహనానికి నిరసనగా 1999లో తెనాలిలో భారీగా జరిగిన కాగడాల ప్రదర్శన, బహిరంగసభలో పాల్గొన్నారు. చుండూరులో దళితుల హత్యాకాండ తర్వాత 2004 ఆగస్టు 6న మృతవీరులకు వరవరరావు, కళ్యాణరావుతో కలిసి గద్దర్ నివాళులర్పించారు.
బహిరంగసభలో మాట్లాడారు. గుంటూరులో తొలిగా నల్లపాడు పాలిటెక్నిక్ కాలేజిలో జరిగిన విద్యార్థి సంఘాల మహాసభల్లో గద్దర్ ప్రసంగించారు. వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో నక్సల్ అమరవీరుల తల్లిదండ్రులు నిర్వహించిన సభలోనూ గళం విప్పారు. గుంటూరు, గురజాల కోర్టుల్లో గద్దర్‌పై ఐదారు కేసులున్నాయి. వీటి విచారణకు ఆయా కోర్టులకు ఆయన హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment