చిలకలూరిపేట: తమది పూర్తిగా కుటుంబ వివాదమని, ఈ వ్యవహారంతో మంత్రి విడదల రజినికి ఎలాంటి సంబంధం లేదని చందవరం గ్రామానికి చెందిన గొంటు జయభరత్‌రెడ్డి స్పష్టం చేశారు. నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో ఈ నెల 20వ తేదీన అన్నదమ్ములు జయభరత్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి మధ్య ఘర్షణ జరిగిన విషయం విదితమే. ఇందులో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. జయభరత్‌రెడ్డి కుటుంబసభ్యులు చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో జరిగిన గొడవ పూర్తిగా తమ కుటుంబ అంతర్గత వ్యవహారమని చెప్పారు. గ్రామంలో గతంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు తన సోదరుడు శ్రీనివాసరెడ్డి తనకు ఇవ్వాల్సి ఉందని చెప్పారు.
ఆ డబ్బులు అడిగేందుకు వెళ్లినందుకే తన భార్య గొంటు సామ్రాజ్యంతోపాటు తన కుమార్తైపె దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబ సభ్యులపై మూకుమ్మడి దాడికి పాల్పడటంతో తాను ఆత్మరక్షణ కోసం గొడవ పడాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ విషయంలో మంత్రి రజినికి ఎలాంటి ప్రమేయం లేదని పేర్కొన్నారు. కావాలని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఆమె పేరును వాడుతున్నారని అన్నారు. దీనికి తోడు సొలస గ్రామానికి చెందిన బీవీరెడ్డి మా కుటుంబ వ్యవహారంపై మాట్లాడటం సముచితం కాదన్నారు.
బీవీ రెడ్డి గురించి ఆరా తీస్తే అతను కూడా జనాల వద్ద డబ్బులు వసూలు చేసి ఇబ్బందులు పెడుతున్న వ్యక్తిగా తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులు వారి స్వలాభం కోసం మంత్రిపై విమర్శలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి బీవీరెడ్డి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.
మంత్రి విడదల రజినిని అడ్డంపెట్టుకొని పదవులు పొంది జనాలను మోసం చేసే వారు విమర్శలకు దిగడం సరికాదన్నారు. శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకుడిని అని చెప్పుకుంటూ గ్రామంలో చేసిన దౌర్జన్యాల ఫలితంగా గతంలో టీడీపీకి ఓట్లే లేని గ్రామంలో ఆ పార్టీకి మనుగడ ఏర్పడిందని విమర్శించారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment